మల్లిఖార్జున ఖర్గేకు అదే పెద్ద సవాల్ - ప్రధాని మోదీ హవాకు చెక్..!!
కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడు వచ్చేసారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న మల్లిఖార్జున ఖర్గే 137 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు అయ్యారు. 24 ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాత గాంధీ కుటుంబేతర వ్యక్తి కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలు తీసుకుంటున్నారు. కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు రాహుల్ గాంధీ నిరాకరించటంతో పాటుగా గాంధీ కుటుంబం ఆసక్తి చూపకపోవటంతో ఎన్నిక అనివార్యమైంది. గాంధీ కుటుంబం అండతోనే ఖర్గే సునాయాసంగా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించారు. మొత్తం 9385 మంది ప్రతినిధులు ఓటు వేయగా.. మల్లిఖార్జున ఖర్గేకు 7897 ఓట్లు వచ్చాయి. థరూర్‌కు 1072 ఓట్లు వచ్చాయి. పార్టీ అధ్యక్షుడు అయిన ఖర్గేకు పార్టీ బాధ్యతల తో పాటుగా నిర్ణయాధికారం దక్కేనా అనేది ఇప్పుడు ప్రధాన చర్చగా మారుతోంది.
ఖర్గే పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా.. గాంధీ కుటుంబమే నిర్ణయాలు తీసుకుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కానీ, పార్టీ నేతలు మాత్రం అధ్యక్షుడిదే అధికారమని చెబుతున్నాయి. ఖర్గే ముందున్న ప్రధాన లక్ష్యం 2024 ఎన్నికల్లో విజయం సాధించటం. అటు ప్రధాని మోదీ హవా కొనసాగుతున్న వేళ.. రానున్న ఎన్నికలు కాంగ్రెస్ కు కీలకంగా మారుతున్నాయి. ఇప్పటికే రాహుల్ భారత్ జోడో యాత్ర ద్వారా ప్రజల్లో ఆదరణ పెంచుకొనే ప్రయత్నం చేస్తున్నారు. వాగ్దాటి - ఛరిష్మా తో ప్రధాని మోదీ కాంగ్రెస్ కు కొరకరాని కొయ్యగా మారారు. ఈ సమయంలో ఖర్గే దళిత నేతగా పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించినా, పార్టీ కంటే ప్రజలను తమ వైపు తిప్పుకోవటంలో ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తారనేదే కీలకం. అసలు పార్టీలో ఆయనతో కలిసొచ్చే నేతలు ఎవరనేది మరో చర్చ.

ఖర్గేకు పార్టీ పైన పూర్తి అవగాహన ఉండటంతో పాటుగా.. బీజేపీ రాజకీయాల గురించి తెలిసి ఉండటంతో ఆయనకు ఫ్రీ హ్యాండ్ తో పాటుగా పార్టీ పునర్నిర్మాణం జరిగితేనే బీజేపీని ఎదుర్కొనే అవకాశం ఉంటుందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ అధినేతగా ఖర్గేకు ఇప్పుడు బీజేపీ కంటే పార్టీలోని అసమ్మతి నేతలను బుజ్జగించటమే ప్రధాన సవాల్ గా మారే అవకాశం కనిపిస్తోంది. జీ 23 నేతలను ఖర్గే ఏ రకంగా సమన్వయం చేసుకుంటారనేది మరో సందేహం. గుజరాత్ - హిమాచల్ ప్రదేశ్ లో పార్టీ గెలుపు ఖర్గే ముందున్న తక్షణ లక్ష్యం. ఆ తరువాత సొంత రాష్ట్రమైన కర్ణాటకలో విజయం సాధించాల్సి ఉంటుంది. రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మోదీకి చెక్ పెడితేనే..2024 ఎన్నికల్లో ప్రధాని మోదీకి కాంగ్రెస్ గట్టి పోటీ ఇవ్వటం సాధ్యపడుతుందని విశ్లేషకుల అంచనా. ప్రధాని మోదీకి చెక్ పెట్టటం కోసం ఖర్గే ఏం చేయబోతున్నారనేది పార్టీలో ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications