భార్య మేనకోడలితో పరారైన భర్త... భార్యకు ఫోన్లో తలాక్... కానీ ప్లాన్ బెడిసికొట్టి...
ఓ యువకుడు మైనర్ అయిన భార్య మేనకోడలిని తీసుకుని పరారయ్యాడు. ఆపైన భార్యకు ఫోన్ చేసి మూడుసార్లు తలాక్ చెప్పేశాడు. కానీ చివరికి ప్లాన్ బెడిసికొట్టి పోలీసులకు దొరికిపోయాడు.
భోపాల్: మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ యువకుడు మైనర్ అయిన భార్య మేనకోడలిని తీసుకుని పరారయ్యాడు. ఆపైన భార్యకు ఫోన్ చేసి మూడుసార్లు తలాక్ చెప్పేశాడు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.
భోపాల్‌కు చెందిన ఫైజాన్ అనే యువకుడు.. ఓ అమ్మాయిని ప్రేమించి పెద్దల అనుమతితో పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత భార్య మేనకోడలి (14)తో కూడా అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఇద్దరూ భోపాల్ నుంచి మరో ప్రాంతానికి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. ఫైజాన్ తన భార్య మేనకోడలితో కలసి కాన్పూర్ బయలుదేరాడు.
ఈ విషయం తెలియగానే ఫైజాన్ భార్య కుటుంబ సభ్యులు అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే కాన్పూర్ వెళ్లేముందే ఫైజాన్ అక్కడ ఉన్న తన స్నేహితుడికి ఫోన్ చేసి స్టోరీ మొత్తం చెప్పి, తన పెళ్లికి సహకరించాల్సిందిగా కోరాడు.

తీరా కాన్పూర్ వెళ్లాక స్నేహితుడి ఫోన్ స్విచాఫ్ రావడంతో ఫైజాన్ ప్లాన్ బెడిసికొట్టింది. అక్కడ పెట్రోలింగ్ చేస్తున్న రైల్వే పోలీసులు.. అనుమానాస్పదంగా కనిపించిన పైజాన్, మైనర్ బాలికను కస్టడీలోకి తీసుకుని విచారించడంతో బండారం బట్టబయలైంది.
వారు భోపాల్ పోలీసులకు సమాచారం అందించి, వారిద్దరినీ భోపాల్ పంపించారు. అయతే ఫైజాన్ తన భార్యను ఒప్పించి, తనను రెండో పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడని, కాన్పూర్ వెళ్లాక ఫోన్‌లో విడాకులు ఇస్తున్నట్టు భార్యకు చెప్పాడని మైనర్ బాలిక పోలీసుల విచారణలో పేర్కొంది. ఫైజాన్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు ఈ కేసులో అతని భార్యను కూడా విచారిస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications