భారత సైనికుడ్ని తీసుకొస్తాం: పారికర్, ‘ఇబ్బంది పెడ్తున్న పాక్’
న్యూఢిల్లీ/పుణె: పొరపాటున సరిహద్దు దాటి పాకిస్థాన్ సైన్యం చేతికి చిక్కిన భారత జవాను చందు బాబులాల్ చవాన్‌ను విడిపించేందుకు అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తున్నామని కేంద్ర రక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్ వెల్లడించారు. సరిహద్దు దాటి పాక్ భూభాగంలోకి వెళ్లిన చందును పాక్ సైన్యం అదుపులోకి తీసుకున్నట్లు పారికర్ తెలిపారు.
సరిహద్దులు దాటిన సైనికులు, సాధారణ పౌరులను తిరిగి వెనక్కి తీసుకొచ్చేందుకు కొన్ని విధానాలు ఉన్నాయని, వాటి ద్వారానే డీజీసీఏ పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. సెప్టెంబర్ 30వ తేదీన రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన చందు బాబులాల్ సరిహద్దు దాటి పాక్ భూభాగంలోకి ప్రవేశించగా ఆ దేశ సైన్యం అతడిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.
కాగా, ఈ వార్త తెలుసుకున్న అతడి అమ్మమ్మ గుండెపోటుతో మృతి చెందింది. జవాను కుటుంబసభ్యుల పరిస్థితి గురించి కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆరా తీశారు. జవానును తిరిగి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు ఇదివరకే రాజ్‌నాథ్ తెలిపారు.

జవాను తాజా పరిస్థితి
సర్జికల్ దాడుల అనంతరం పాక్ సైన్యానికి చిక్కిన భారత సైనికుడు చందులాల్ చవాన్‌ను జైల్లో ఖైదీలా, యుద్ధంలో పట్టుబడిన బందీలా చూస్తున్నట్లు కొన్ని జాతీయ మీడియాలో వార్తలొస్తున్నాయి. అంతేగాక, నానా రకాలుగా ఇబ్బంది పెడుతున్నట్లు సమాచారం.
చందులాల్ తమ దగ్గరే ఉన్నట్లు ఇప్పటికే పాక్ ప్రకటించింది. పాక్ మీడియా చవాన్ కుటుంబానికి సంబంధించిన పూర్తి వివరాలను కూడా ప్రసారం చేసింది. కాగా, చవాన్ క్షేమంగా తిరిగిరావాలని అతని కుటుంబంతోపాటు దేశమంతా ఆకాంక్షిస్తోంది.












Click it and Unblock the Notifications