భారీ ఎన్‌కౌంటర్: 30 మంది మావోయిస్టులు మృతి
Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో శుక్రవారం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎదురుకాల్పుల్లో 30 మంది మావోయిస్టులు మృతి చెందారు. బస్తర్ రేంజ్‌లోని దంతెవాడ- నారాయణ్‌పుర్ సరిహద్దులో ఎన్‌కౌంటర్ జరిగినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఘటనా స్థలంలో పలు ఆయుధాలతోపాటు భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఇటీవల కాలంలో జరిగిన అతిపెద్ద ఎన్‌కౌంటర్లలో ఇదొకటి కావడం గమనార్హం.
అబూజ్‌మడ్ దండకారణ్యంలో మావోయిస్టులు సంచరిస్తున్నట్లు సమాచారం అందింది. దీంతో భద్రతా సిబ్బంది ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలోనే శుక్రవారం మధ్యాహ్నం భద్రతా దళాలను చూసిన మావోయిస్టులు వారిపై కాల్పులకు పాల్పడగా.. భద్రతా దళాలు ఎదురుకాల్పులు జరిపారు. దీంతో 30 మంది మూవోయిస్టులు మృతి చెందారు.

సుమారు గంటపాటు ఎదురుకాల్పుల తర్వాత, ఎన్‌కౌంటర్ స్థలం నుంచి 30 మంది మావోయిస్టుల మృతదేహాలు, AK-47 రైఫిల్, ఒక SLR (సెల్ఫ్-లోడింగ్ రైఫిల్) సహా పలు ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు.
మరోవైపు, ఆ ప్రాంతంలో ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. తాజా ఎదురుకాల్పుల ఘటనతో 2024లో బస్తర్ ప్రాంతంలో జరిగిన వేర్వేరు ఎన్‌కౌంటర్లలో 187 మంది మావోయిస్టులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి.
నక్సలైట్ పేరుతో వసూళ్లు: వ్యక్తి అరెస్ట్
నక్సలైట్ పేరుతో అమాయక ప్రజలను బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన తెలంగాణలోని వనపర్తి జిల్లాలో చోటు చేసుకుంది. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ రావుల గిరిధర్ మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మామిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన తిప్పిరెడ్డి సుదర్శన్ రెడ్డి అలియాస్ ప్రమోద్ రెడ్డి అనే వ్యక్తి మాజీ నక్సలైట్ ని అని చెప్పుకుంటూ సోలిపూర్ గ్రామానికి చెందిన తేనేటి శేఖర్ రెడ్డికి ఫోన్ చేసి రైస్ మిల్ అసోసియేషన్ నుంచి రూ. 50 లక్షల ఇవ్వాలని డిమాండ్ చేశాడు.
అంతేగాక, డబ్బులు వెంటనే ఇవ్వకుంటే చంపుతామని బెదిరింపులకు గురిచేశాడు. శేఖర్ రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు సుదర్శన్ రెడ్డిని అరెస్ట్ చేశారు. పోలీసు విచారణలో నిందితుడు నేరం అంగీకరించాడని ఎస్పీ తెలిపారు. గతంలో హైదరాబాద్ లోనూ సెటిల్మెంట్ చేసేవాడన్నారు. నిందితుడిని చాకచక్యంగా పట్టుకున్న పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ గిరిధర్ హెచ్చరించారు.












Click it and Unblock the Notifications