ముంబై, ఢిల్లీలో మళ్లీ కరోనా కల్లోలం: ముంబైలో 70 శాతం, ఢిల్లీలో 50 శాతం కేసుల పెరుగుదల
న్యూఢిల్లీ: దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులతోపాటు కరోనా వైరస్ కేసులు కూడా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. భారతదేశ రాజధాని ఢిల్లీతోపాటు ఆర్థిక రాజధాని ముంబైలోనూ కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ కేసులు కూడా ఈ ప్రాంతాల్లో భారీగా పెరుగుతుండటం ఆందోళనలకు గురిచేస్తోంది.
గత 24 గంటల వ్యవధిలో ముంబైలో 70 శాతం కరోనా కేసులు పెరగ్గా.. ఢిల్లీలో 50 శాతం పెరుగుదల నమోదు చేశాయి. ఆర్థిక రాజధానిలో 1377 కరోనా కేసులు నమోదు కాగా, దేశ రాజధానిలో 496 కేసులు వెలుగుచూశాయి. ఈ రెండు నగరాల్లో ఒక్కో కరోనా మరణం సంభవించింది. డిసెంబర్ 8 తర్వాత ముంబైలో అత్యధిక కేసులు వెలుగుచూశాయి. 188 శాతం కేసులు పెరిగాయి.
ఢిల్లీలో రెండు వారాల వ్యవధిలో ఒమిక్రాన్ కేసులు 2-3 శాతం నుంచి 25-30 శాతానికి పెరిగాయి. దేశంలో జన్యక్రమాన్ని విశ్లేషించే కన్సార్టియం(ఇన్సాకాగ్) ఆధ్వర్యంలోని ఢిల్లీ ల్యాబ్ ఈ విషయాన్ని పేర్కొంది. ఢిల్లీ ఆంక్షలు విధించినట్లు ప్రకటించిన గంటల్లోనే 50 శాతం కరోనా కేసులు పెరగడం గమనార్హం.

ఢిల్లీలో భారీగా కేసులు పెరగడంతో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ లెవెల్-I (ఎల్లో అలర్ట్)ని అమలు చేస్తున్నామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఈ మేరకు ఎల్లో అలర్ట్ ఆంక్షల ఉత్తర్వులను జారీ చేశారు. ఢిల్లీలో ఎల్లో అలెర్ట్‌లో భాగంగా సినిమా హాళ్లు, జిమ్స్, స్పాలు మూతపడనున్నాయి. స్కూల్స్, కళాశాలలు, కోచింగ్ సెంటర్లు, సినిమా హాళ్లు, స్పాలు, జిమ్‌లు, ల్టీప్లెక్స్‌లు, బాంక్వెట్ హాల్స్, ఆడిటోరియంలు, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు మూసివేయనున్నారు. అలాగే రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ విధించనున్నారు. ఇక పెళ్లిళ్లు, అంతిమ సంస్కారాలకు 20 మందికి మాత్రమే అనుమతించనున్నారు.
మతపరమైన ప్రార్ధనా మందిరాలోకి భక్తుల ప్రవేశంపై కూడా నిషేధం విధించింది ఢిల్లీ కేజ్రీవాల్ ప్రభుత్వం. ఢిల్లీ మెట్రో, బస్సులు, రెస్టారెంట్లు, బార్‌లు 50 శాతం సామర్థ్యంతో పనిచేయడానికి పరిమితి విధించింది. ఆటో,క్యాబ్‌లో ఇద్దరు ప్రయాణించడానికి మాత్రమే అనుమతి ఉంది. దుకాణ సముదాయాలు, మాల్స్‌లో దుకాణాలను సరి, భేసి విధానంలో నిర్వహించుకునేలా అనుమతినిచ్చింది. ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వరకు అనుమతినిచ్చింది.
ఇక, వీక్లీ మార్కెట్లలో 50 శాతం దుకాణాలకు మాత్రమే అనుమతి ఇచ్చింది. ప్రైవేట్ కార్యాలయాల్లో 50 శాతం సిబ్బందితో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు పనిచేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. భవన నిర్మాణ పనులకు, ఈ కామర్స్ డెలివరీలకు కూడా ప్రభుత్వం అనుమతినిచ్చింది.
కొత్త సంవత్సరం సందర్భంగా వేడుకలను కూడా ప్రభుత్వం నిషేధించింది. డిసెంబర్ 27న ఢిల్లీలో రాత్రి కర్ఫ్యూ 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అమల్లోకి వచ్చింది. కాగా, కరోనావైరస్ కేసులతో వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు రాత్రిపూట కర్ఫ్యూ కొనసాగుతోంది. కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించే వారితో కఠినంగా వ్యవహరించాలని ఢిల్లీ ప్రభుత్వం పోలీసులను, ఇతర అధికారులను ఆదేశించింది.
ఇక, కేసులు పెరుగుతున్న క్రమంలో మహారాష్ట్రలోనూ కరోనా ఆంక్షలు అమలవుతున్నాయి. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 వరకు బహిరంగ ప్రదేశాల్లో ఐదుగురు కన్నా ఎక్కువ మంది ఉండొద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఇండోర్‌లో జరిగే పెళ్లిళ్లకు 100, ఔట్‌డోర్‌లో జరిగే పెళ్లిళ్లకు 250 మంది కన్నా ఎక్కువ మంది హాజరు కావొద్దని ఆదేశించింది. జిమ్స్, స్పా, థియేటర్లు 50శాతం కెపాసిటీతో నడిపించుకోవాలని స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications