పాక్ కుట్ర: రూ 50 వేలకు ఆ టీచర్ దేశ ద్రౌహం
న్యూఢిల్లీ: ఆయన ఓ ప్రార్థనా మందిరంలో పిల్లలు పాఠాలు చెప్పే మాస్టారు. అక్కడ ఉన్న ప్రార్థనా మందిరాన్ని పరిరక్షించాల్సిన సంరక్షకుడు. అయితే కేవలం రూ. 50 వేల కోసం ఆశపడి దేశద్రోహానికి పాల్పడ్డాడని భారత ఇంటిలిజెన్స్ అధికారులు చెప్పారు.
రాజస్థాన్ లోని నగౌర్ లో ఉన్న మసీదులో టీచర్ గా పని చేస్తున్న మౌలానా రమ్జాన్ ఖాన్ నెలకు రూ. 50 వేలు వస్తుందని ఆశతో భారత సైనిక రహస్యాలను పాక్ కు చేరవేస్తున్నాడని విచారణలో వెలుగు చూసిందని అధికారులు తెలిపారు.
నగౌర్ లోని మసీదులో 40 మంది పిల్లలకు ఉర్దూ పాఠాలు చెప్పటానికి మౌలానాకు నెలకు రూ. రెండు వేలు జీతం ఇస్తారు, మసీదు నిర్వహణకు నెలకు రూ. 3 వేలు ఇస్తారు. భారత సరిహద్దులో నివాసం ఉండే మౌలానాకు అక్కడి ప్రజలు అందరూ పరిచయం ఉన్నారు.

అంతే కాకుండా మౌలానాను కలవడానికి కొందరు మాజీ సైనికులు అక్కడికి వెళ్లేవారు. న్యూఢిల్లీలోని పాక్ హై కమిషన్ లో ఉద్యోగం చేస్తున్న మహమ్మద్ అక్తర్ కు ఈ విషయం తెలిసింది. ఎలాగైనా మౌలానాను కలవాలని, ఆయన్ను ట్రాప్ చెయ్యాలని నిర్ణయించాడు.
గత సంవత్సరం మౌలానాను మహమ్మద్ అక్తర్ భేటీ అయ్యాడు. భారత సైనికుల రహస్యాల గురించి మాకు సమాచారం ఇస్తే నెలకు రూ. 50 వేలు ఇస్తామని ఆయనకు మాయమాటలు చెప్పాడు. మొత్తం మీద మౌలానాను ఒప్పించాడు.
రాజస్థాన్ లోని భారత సరిహద్దులో మౌలానా రమ్జాన్ ఖాన్ కు మంచి పేరు. పలుకుబడి ఉంది. అందు వలన ఆయన మీద అనుమానం రాదని పాక్ హైకమిషన్ ఉద్యోగి మహమ్మద్ అక్తర్ పసిగట్టాడు. అదే సమయంలో వ్యాపారి సుభాష్ జహంగీర్ కు ఆర్థిక సమస్యలు ఉన్నాయని మహమ్మద్ అక్తర్ గుర్తించాడు.
తాను చెప్పినట్లు చేస్తే నీకు నగదు సహాయం చేస్తానని, నీ అప్పులు తీర్చడానికి అవకాశం ఉంటుందని మౌలానా రమ్జాన్ ఖాన్ సుభాష్ జహంగీర్ కు మాయమాటలు చెప్పాడు. మొత్తం మీద వీరిద్దరు కలిసి భారత సైనిక రహస్యాలను సేకరించారు.
తరువాత న్యూఢిల్లీలోని పాక్ హైకమిషన్ ఉద్యోగి మహమ్మద్ అక్తర్ కు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న ఇంటిలిజెన్స్ అధికారులు వీరిని అరెస్టు చేశారు. మౌలానా రమ్జాన్ ఖాన్, సుభాష్ జహంగీర్ ఎవరి సహాయంతో సైనిక రహస్యాలు తెలుసుకున్నారు అనే విషయం అధికారులు బయటపెట్టలేదు.
వీరిద్దరి నుంచి పాక్ హైకమిషన్ ఉద్యోగి మహమ్మద్ అక్తర్ వివరాలు సేకరించి పాక్ కు సమాచారం ఇస్తున్నాడని అధికారులు గుర్తించారు. రాజస్థాన్ పోలీసులు, ఎన్ఐఏ అధికారులు మౌలానా రమ్జాన్ ఖాన్, సుభాష్ జహంగీర్ ను విచారించి వివరాలు సేకరిస్తున్నారు.












Click it and Unblock the Notifications