ఫేస్‌బుక్ లవ్: భారత ప్రియుడి కోసం అమెరికా నుంచి వచ్చేసింది!
న్యూయార్క్/న్యూఢిల్లీ: వారిద్దరి మధ్య చిగురించిన ఫేస్‌బుక్ పరిచయం ప్రేమగా మారింది. ఆ తర్వాత ఇద్దరూ కలవాలని నిర్ణయించుకున్నారు. అంతే, ఆలస్యం చేయకుండా భారతదేశంలోని మురికివాడలో ఉండే యువకుడి కోసం రెక్కలు కట్టుకుని వచ్చేసింది అమెరికాకు చెందిన మహిళ. ఇంకా, ఆలస్యమెందుకని వివాహం బంధంతో ఏకమయ్యారు ఆ ప్రేమికులు.
వివరాల్లోకి వెళితే.. 41ఏళ్ల సదరు యువతి అమెరికాకి చెందిన ఎమిలీ. మోంటానా ప్రాంతంలో హెల్త్ కోఆర్డినేటర్‌గా పనిచేస్తోంది. కాగా, ఆ 23ఏళ్ల అబ్బాయి హితేశ్ చావ్డాది భారతదేశంలోని అహ్మదాబాద్. మురికివాడలో నివసిస్తున్న ఓ దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువకుడు.

ఎమిలీ, హితేశ్‌లకు ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. భాష సమస్య ఉన్నప్పటికీ.. గూగుల్ ట్రాన్స్‌లేటర్ సాయంతో సంభాషించుకున్నారు. కొద్దిరోజుల తర్వాత ఎమిలీ హితేశ్‌ని కలవాలనుకుంది. వెంటనే ఇండియాలో వాలిపోయి అతన్ని కలుసుకుంది. ఇంకెందుకు ఆలస్యం అనుకున్నారేమో గానీ.. ఇద్దరూ కలుసుకున్న రోజే హిందూ సంప్రదాయ పద్ధతిలో ఒక్కటయ్యారు.
మొదటిసారి ఎమిలీని కలిసినప్పుడు తనలోని సింప్లిసిటీ ఎంతగానో ఆకట్టుకుందని హితేశ్ చెప్పాడు. హితేశ్ చాలా అమాయకుడని తన వద్ద ఎలాంటి దాపరికాలు చేయడని అది నచ్చే పెళ్లి చేసుకోవాలనుకున్నానని ఎమిలీ తెలిపింది.
అందరి తల్లిదండ్రుల్లాగే ఎమిలీ విషయంలో హితేశ్ తల్లిదండ్రులు తడబడ్డారు. వారి ప్రేమానురాగాలు చూసి నెమ్మదిగా వారూ అర్ధం చేసుకుని నూతన దంపతుల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు.
అయితే, వీరి ప్రేమ పెళ్లి ఇక్కడితో ఆగలేదు. హనీమూన్ కోసం ఎమిలీ తన భర్తను అమెరికా తీసుకెళ్లనుంది. అంతేగాక, ఈ నూతన దంపతులు ఇండియాలోనే స్థిరపడాలని నిర్ణయించుకున్నారు.












Click it and Unblock the Notifications