పెళ్లి పత్రిక వైరల్; 'రాయల్ మెక్ .. రాయల్ రైతు'
కర్ణాటకకు చెందిన ఓ యువ రైతు తన పెళ్లి పత్రికతో సామాజిక మాధ్యమాల్లో సంచలనం సృష్టిస్తున్నారు. వ్యవసాయం చేసే యువకులకు పిల్లను ఇచ్చేందుకు తల్లిదండ్రులు వెనుకాడటం, అమ్మాయిలు కూడా రైతును చేసుకోవడానికి ఇష్టపడకపోవడం వంటి ప్రస్తుత పరిస్థితుల్లో... "రైతు అంటే తక్కువ కాదు.. అదొక రాయల్ లైఫ్" అని చాటిచెప్పారు తుమకూరు జిల్లాకు చెందిన తేజేష్ కుమార్.

పెళ్లి పత్రికపై 'రాయల్ మెక్ / రైతు'
రైతులకు అమ్మాయిలు దొరకడం లేదన్న సామాజిక అపోహలను సవాల్ చేస్తూ, ఫిబ్రవరి 4న జరగనున్న తన వివాహ పత్రికపై ఆయన గర్వంగా తన వృత్తిని ముద్రించుకున్నారు. ఆ పత్రికపై 'రైతు / Royal Mech' అని రాసి, వ్యవసాయం అనేది గౌరవప్రదమైన వృత్తి అని అందరికీ తెలిసేలా చేశారు. బీ.కామ్ చదివిన హర్షిత అనే యువతి తేజేష్‌ను వివాహం చేసుకోవడానికి ముందుకు రావడం, సమాజంలో వస్తున్న మార్పుకు నిదర్శనంగా నిలిచింది.
తేజేష్ ఇస్తున్న బలమైన సందేశం
"ఇంజనీర్‌గా పనిచేస్తే కేవలం జీతం వస్తుంది.. కానీ రైతుగా ఉంటే కుటుంబంతో గడపడానికి సమయం, మనసుకి ప్రశాంతత లభిస్తాయి" అని తేజేష్ గర్వంగా చెబుతున్నారు. ఇప్పుడు రైతులు కూడా అత్యాధునిక సాంకేతికతతో లక్షల్లో సంపాదిస్తున్నారని, ఆడపిల్లలకు సంతోషకరమైన, సురక్షితమైన జీవితాన్ని రైతులు ఇవ్వగలరని ఆయన నిరూపించారు. చదువుకున్న వారు వ్యవసాయం వైపు రావడం లేదన్న మాట అబద్ధమని తన పెళ్లి ద్వారా చాటిచెప్పిన ఈ యువ రైతు, ఇప్పుడు తనలాంటి వేలాది మంది యువ రైతులకు స్ఫూర్తిప్రదాతగా నిలిచారు.












Click it and Unblock the Notifications