వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మెటావర్స్: ఇంటర్నెట్‌కి రాబోయే 'అవతార్' - డిజిహబ్

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
ప్రతీకాత్మక చిత్రం - డిజిటల్ ఆర్ట్

నిద్ర లేస్తూనే పక్షుల కిలకిలారావాలు, సముద్ర ఘోష వినిపిస్తాయి మీకు, మీరుండేది హైదరాబాద్ లాంటి సిటీ నడిబొడ్డున కిక్కిరిసిన అపార్ట్‌మెంటులోనే అయినా.

లేచి, కాస్త తయారై, ఏమన్నా తినేసరికి, మీ హోమ్-ఆఫీస్‍ రూమ్‍లో మీ కొలీగ్స్ డిజిటల్ అవతార్‍లో సిద్ధంగా ఉంటారు, ముఖ్యమైన మీటింగ్ కోసం.

మీరు మీ వర్చువల్ రియాల్టీ హెడ్‍సెట్ తగిలించుకుని మీ అవతార్ ఆక్టివేట్ చేయగానే మీ డిజిటల్ అవతార్ వాళ్ళ ఇళ్ళల్లోకి ప్రవేశిస్తుంది.

అందరూ ఒకే చోటున ఉన్న భావన కలుగుతుంది. ప్రాజెక్టు డెమో మీ కళ్ళ ముందు 3D మోడల్‍లో ఉండడంతో చేయాల్సిన మార్పుల గురించి మాట్లాడడమే కాకుండా అప్పటికప్పుడు మార్చి చూపించగలుగుతారు.

ఈ లోపు, పక్క గదిలో మీ అమ్మాయికి సోలార్ సిస్టమ్ నేర్పిస్తున్న టీచర్ డిజిటల్ అవతారంలో ఆమె పక్కనే ఉంటుంది. భూమికి చంద్రుడు మరీ దగ్గరగా వస్తే ఏమవుతుందో తెల్సుకోవడానికి వాళ్ళు చంద్రుని ఆర్బిట్‍ని భూమికి దగ్గరగా జరుపుతారు. జరిగే పరిణామాలు 3Dలో కళ్ళ ముందు కనిపిస్తాయి వాళ్ళిద్దరికి.

వీకెండ్ న్యూయార్క్‌లో టేలర్ స్విఫ్ట్ కాన్సర్ట్‌కి మీ పార్టీ అవతార్‍లో అటెండ్ అవుతారు, మీ ఇంటినుంచే.

లక్షలాది మంది అటెండ్ అవుతున్న ఆ ఈవెంట్‍లో మీదే బెస్ట్ సీట్. పాడిన పాటల్లో మీకు నచ్చినవాటిల్లో NFT (non-fungible token) పెట్టి కొనుక్కుంటారు కూడా.

కాన్సర్ట్ ముగిసీ ముగియగానే హైదరాబాద్‍లోని మీ ఇంట్లో నిద్రకి ఉపక్రమిస్తారు.

ఇదేదో సైన్స్ ఫిక్షన్, ఫాంటసీ కథ/సినిమా నుంచి ఎత్తుకొచ్చిన సీన్ కాదు. ఇప్పటికిప్పుడు కాకపోయినా, రాబోయే పది పదిహేనేళ్ళల్లో మన రొటీన్లు ఎంచుమించుగా ఇలాగే ఉండవచ్చు.

వర్చువల్/అగ్‍మెంటెడ్ రియాల్టీ ద్వారా ఎక్కడ కావాలనుకుంటే అక్కడ డిజిటల్ అవతారాల్లో ప్రత్యక్షం అవ్వడం, మన అభిరుచికి తగ్గట్టుగా వర్చువల్ ప్రపంచాలు సృష్టించుకుని వాటిలో నివసించడం, మానవానుభూతిలోకి తేలిగ్గా రాలేని అనుభవాలని ( అంతరిక్షంలో, సముద్రగర్భంలో విహరించడం లాంటివి) సాధ్యమయ్యేలా చేసేది మెటావర్స్.

ఆఫ్‍లైన్-ఆన్‍లైన్, వర్చువల్-రియల్ అనే బైనరీలు తుడిపేస్తుందది.

ఫేస్‍బుక్ కంపెనీ తన పేరుని "మెటా"గా మార్చుకుంటున్నట్టు వచ్చిన వార్తల నేపథ్యంలో, మెటావర్స్ గురించి చర్చలు మొదలయ్యాయి.

నిజానికి ఫేస్‍బుక్కే కాదు, మైక్రోసాఫ్ట్ మొదలుకుని ఎన్విడియా (NVIDIA) వరకూ దిగ్గజ సాఫ్ట్వేర్ కంపెనీలతో పాటు అనేక స్టార్టప్‍లు ఈ మెటావర్స్ సంబంధించి కొత్త ఆవిష్కరణలను తీసుకురావడం కోసం ప్రయత్నిస్తున్నారు.

భారత్‌లోని పెద్దా, చిన్నా టెక్నాలజీ కంపెనీలు కూడా ఈ రంగంలో విశేష కృషి జరుపుతున్నాయి.

మెటా లోగో

మెటావర్స్ అంటే ఏంటి?

1980ల్లో ఇంటర్నెట్ ఎలా ఉండబోతుందో ఎవరూ కచ్చితంగా చెప్పలేకపోయినట్టే, ప్రస్తుతానికి మెటావర్స్ అంటే ఏమిటో, అది ఎలా ఉండబోతుందో ఎవరూ ఇదమిత్థంగా చెప్పలేరు.

సైన్స్ ఫిక్షన్ రచనల్లో కనిపించేంత పకడ్బందీగా, సమర్థవంతంగా పనిచేస్తుందా, లేదా పూర్తిగా ఫట్ అయ్యి ఏదో నామమాత్ర రూపాల్లో మిగలొచ్చా?

ఏ వింత లోకాలు సాధ్యం, ఏ విపరీత సవాళ్ళని విసరబోతుందన్నది కాలమే చెప్పాలి.

అయితే, టెక్నాలజీ ద్వారా జనజీవన విధానాన్ని భారీ స్థాయిలో మార్చేయాలంటే అది ఒక పూటలో జరిగేది కాదు.

ఎన్నో పిల్ల కాలువలు, ఉపనదులు కలిశాకే మహానదిగా పరిణామం చెందినట్టే టెక్నాలజీకి కూడా చాలా కలిసి రావాలి.

ప్రస్తుతం, ట్రెండ్‍లో ఉన్న టెక్నాలజీలని బట్టి భవిష్యత్తుని మనం అంచనా వేయవచ్చు.

ఉదాహరణకి, ఒక రెండేళ్ళుగా సోషల్ మీడియాలో "అవతార్" అనే కాన్సప్ట్ స్టార్ట్ అయ్యింది.

మనకి నచ్చిన రంగు, రూపురేఖలతో ఒక అవతార్‍ని సృష్టించుకుని దాన్ని మన ఎమోషన్స్ తెలిపే కామెంట్స్ లో ఉపయోగించుకోవచ్చు. అది మన ఐడెంటిటిగా మారుతుంది.

మనం రికార్డ్ చేసిన వీడియోలో ఈ అవతార్‍ను మాస్క్ గా పెడితే, మన ముఖకవళికలకు తగ్గట్టు బొమ్మలో కూడా మార్పులు జరుగుతాయి.

బొమ్మే మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. దీన్ని వాడుకుని చాలా మంది కామెడీ/సెటైర్ స్కిట్లు చేస్తున్నారు.

ప్రస్తుతానికి ముఖకవళికలకు పరితమైన ఈ టెక్ ఒకవేళ మన శరీరం మొత్తాన్ని సెన్సార్ చేసి, డిజిటల్ అవతార్‍లో ఆ మార్పులని ప్రతిబింబించగలిగితే, వ్యాసం మొదట్లో చెప్పుకున్న సీనులో మనం ఇంట్లో ఉంటూనే వేరే చోటున కూడా ఉండగలగడం సాధ్యపడుతుంది.

ఈ అవతార్‍లతో పాటుగా ప్రస్తుతం AR/VR డివైజులు (స్మార్ట్ గ్లాసెస్, వర్చువల్ రియాల్టీ థెరపీ గురించి ఇది వరకు డిజిహబ్‍లో తెలుసుకున్నాం), క్రిప్టో కరెన్సీ మొదలైనవన్నీ మన మధ్యన ఇప్పటికే ఉన్నాయి. ఇవ్వన్నీ భారీ స్థాయిలో, అపరిమితంగా, సమర్థవంతంగా ఎంత త్వరగా పని చేయగలిగితే మెటావర్స్ అంత త్వరగా సాధ్యపడుతుంది.

మెటావర్స్ కో నిర్వచనం ఇచ్చుకునే ముందు, మెటావర్స్ అంటే ఉన్న కొన్ని అపోహలని పరిశీలిద్దాం.

1. మెటావర్స్ అంటే వర్చువల్ రియాల్టీ: ప్రస్తుతం మన వాడుతున్నది మొబైల్ ఇంటర్నెట్. దానికి యాప్స్, స్మార్ట్ ఫోన్స్ కావాలి. కానీ యాప్స్, స్మార్ట్ ఫోన్స్ ని మొబైల్ ఇంటర్నెట్ అనలేం కదా, అలానే మెటావర్స్ అనుభవంలోకి తేవడానికి వర్చువల్ రియాల్టీ విశేషంగా సాయపడుతుంది కానీ, అది మెటావర్స్ కాదు.

2. యూజర్లు సృష్టించిన వర్చువల్ ప్రపంచం: ఇప్పుడు ఫేస్‍బుక్, ట్విటర్, యూట్యూబ్ లాంటి సోషల్ మీడియా ప్లాట్‍ఫార్మ్స్ లో యూజర్లు కంటెంట్ క్రియేట్ చేస్తారు. కానీ అవే ఇంటర్నెట్‍ అని ఎలా అనలేమో, అలానే మెటావర్స్ లో కూడా యూజర్ల ద్వారా క్రియేట్ చేసిన వర్చువల్ ప్రపంచాలు ఉండే అవకాశమున్నా, వాటినే మెటావర్స్ అనలేం.

3. అదొక వీడియో గేమ్ లాంటిది: కాదు. వీడియో గేమ్స్ ఒకానొక goalతో రూపొందిస్తారు. ఆటలోకి లాగిన్/లాగవుట్ అవ్వాల్సి ఉంటుంది. గేమ్‍లో ఉన్న ప్రపంచం/అనుభవం తాత్కాలికం. ఏకకాలంలో కొందరు మాత్రమే ఆటని ఆడగలరు. మెటావర్స్ లో ఇలాంటి అనేకానేక గేమ్స్ భాగం కానీ ఆ గేములే మెటావర్స్ అనిపించుకోవు.

4. ఎnity/webXR/webGPU లాంటి టెక్నాలజీలే మెటావర్స్: ఇవి మెటావర్స్ ని రూపొందించడానికి వాడే టెక్నాలజీలే కానీ అవి మెటావర్స్ కావు.

మెటావర్స్

మరి మెటావర్స్ అని దేన్ని అనవచ్చు?

మెటావర్స్ ఇంటర్నెట్‍కి రానున్న వర్షన్ అనుకోవచ్చు. ఇంటర్నెట్‍లానే ఇది కూడా నెట్‌వర్క్. అయితే, వెబ్1.0 text ని, వెబ్2.0 మల్టీమీడియా కంటెంట్‍ని మన రోజూవారి జీవితంలో భాగం చేసినట్టుగా, వెబ్ 3.0కి ఒక రూపాంతరమైన మెటావర్స్ realtime rendered 3D virtual worldsని మనకి అందుబాటులో ఉంచగలదు.

అది కూడా భారీ ఎత్తున్న, ఒకేసారి ఎక్కువమంది వాడే సౌలభ్యాన్ని ఇస్తుంది. ఈ అనుభవం మొత్తంలో ఒక యూజర్‍కి ఒకటే ఐడెంటిటీ ఉండడంతో, వర్చువల్ ప్రపంచంలో ఒక చోటు నుంచి మరో చోటుకి వెళ్ళే వెసులుబాటు ఇస్తుంది.

దీనికి కావాల్సిన హార్డ్ వేర్ (యూజర్ల వైపున AR/VR headsets లాంటివి, ఎంటర్‍ప్రైజుల వైపున సెన్సార్లు, ఇండస్ట్రియల్ కెమరాలు వైగైరా) అందుబాటులోకి వచ్చి, అందుకు తగ్గట్టుగా కంప్యూటింగ్ కెపాసిటీ కూడా ఉండాలి.

ఒక వర్చువల్ ప్రపంచంలో మనిషి పరిగెడుతున్న వేగం బట్టి పరిసరాలు మార్చాలంటే ఫిజిక్స్ కాల్కులేషన్, రెండరింగ్, సింక్రోనైజేషన్, AI అన్నీ వేగవంతంగా కంప్యూట్ చేస్తే సత్తా ఉండాలి.

నెట్‍వర్క్ కూడా అంతే సమర్థవంతంగా పనిజేయాలి. ఈ వర్చువల్ లోకంలో కొనుగోళ్ళకి, లావాదేవీలకి వీలుగా క్రిప్టోకరెన్సీ లాంటి డిజిటల్ టెక్నాలజీలు పుంజుకోవాలి.

ఇలాంటివి మరెన్నో కలిసి వస్తేనే మెటావర్స్ సాధ్యపడుతుంది.

వర్చువల్ రియాలిటీ

మెటావర్స్ టెక్నాలజీల్లో ఇండియా కంపెనీల పాత్ర

మెటావర్స్ ఎకోసిస్టమ్‍కి కొన్ని పరిష్కారాలు, ఆవిష్కరణలు జత చేసే విషయంలో ఇండియా కంపెనీలు ముందంజలో ఉన్నాయి.

రానున్న ఐదేళ్ళల్లో ఇండియాలో స్మార్ట్ ఫోన్ల వినియోగం కూడా ఒక బిలియన్‍కి చేరబోతుంది! మెటావర్స్ ని సృష్టించడంలో, దాన్ని ఉపయోగించడంలో ఇండియా పాత్ర భారీగా ఉండబోతుందని అంచనా.

కాకినాడ రిలయన్స్ గాస్ ప్లాంట్‍లో కొత్త ఉద్యోగులకి విపరీత వాతావరణాల్లో ఉద్యోగ శిక్షణ ఇవ్వవలసినప్పుడు AR/VR టెక్నాలజీలని వాడి, కృత్రిమ వాతావరణాలని (ఉదా: నీటికింద పనిజేయాల్సినప్పటి పరిస్థితులని) సృష్టించి, అందులో ఉద్యోగులని నిలిపి శిక్షణను ఇస్తున్నారు.

దీని ద్వారా తక్కువ ఖర్చు, తక్కువ రిస్క్ తో శిక్షణలు పూర్తి చేస్తున్నారు. చెన్నైకి చెందిన ఒక కంపెనీ కృత్రిమ వాతావరణం క్రియేట్ చేయగల టెక్నాలజీలని అందిస్తుంది.

అలాగే, భారత సైన్యంలో యుద్ధ వాతావరణంలో కొత్త సైనికులకి శిక్షణ ఇవ్వడానికి ఒక హొలోసూట్ (holosuit) ఉపయోగిస్తున్నారు.

ఈ సూట్‍లో నలభైకు పైగా సెన్సార్లు కాళ్ళు, చేతులు, వేళ్ళ కదిలకలను ట్రాక్ చేస్తాయి. శిక్షణలో ఉన్న సైనికులు ఈ సూట్ ధరించి డిజిటల్ ప్రపంచంలోకి ప్రవేశిస్తారు.

అందులో భాగమైన డమ్మీ టెర్రరిస్ట్ ఆ అవతార్‍ని కొట్టగానే సూట్ ధరించిన మనిషికి దెబ్బ తగులుతుంది. సూట్ ధరించినవారు డిజిటల్ ప్రపంచంలో ఏదన్నా పట్టుకుంటే ఆ స్పర్శ తెలుస్తుంది.

https://twitter.com/artrac_ia/status/1438806812438896642

"బాలీ హీరోస్" మరో బాలీవుడ్ ప్రపంచాన్ని సృష్టించడానికి సిద్ధపడుతుంది. ప్రముఖ సెలబ్రిటీలు, మ్యూజిక్ కంపెనీలు, ప్రొడక్షన్ హౌస్‍లతో కలిసి NFT (దీని గురించి వివరంగా రానున్న వ్యాసాల్లో) గేమింగ్‍ని ప్రవేశబెట్టబోతుంది.

బాలీవుడ్ సెలబ్రిటీ అవతార్‍లను, సీన్లని, పాటలని వాడి కొత్త కొత్త స్క్రిప్టులు రాసి డబ్బు గెలుచుకోవచ్చు. అదే తరహాలో, ఫుడ్ గేమింగ్‍ని ప్రవేశబెట్టబోతుంది OneRare అనే కంపెనీ.

హైదరాబాద్‍కి చెందిన NextMeet మనకి తెలిసిన వీడియో కాన్ఫరెన్సింగ్ అనుభవాన్ని పూర్తిగా మార్చేస్తూ కాన్ఫరెన్సులు, నెట్వర్కింగ్ ఈవెంట్స్ 3Dలో అనుభవంలోకి తీసుకురావడానికి కృషి చేస్తుంది.

రానున్న కొన్ని సంవత్సరాల్లో ఇవ్వన్నీ కలిసి మన జీవితాలని ఎలా మార్చివేస్తాయో వేచి చూడాల్సిందే! ఊహాగానాలు, అంచనాలకన్నా మెటావర్స్ త్వరలోనే మన జీవితాల్లో భాగమయ్యే అవకాశాలూ ఉన్నాయి. సరైన చట్టాలూ, పాలసీలు లేకుండా ఇలాంటి టెక్నాలజీలు పెరిగిపోతే కష్టం. పైగా వాస్తవంలో ఇప్పటి వరకూ మనకి అలవాటైన బంధాలు, స్నేహాలు, అనుభవాలూ ఒక్కసారిగా ఈ వర్చువల్ ప్రపంచంలో ఎలా మారిపోతాయో? వీటిని గురించి అందరూ ఆలోచించడం అవసరం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Metaverse: The 'Avatar' Coming to the Internet - Digihab
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X