జాబ్ వదిలేస్తే బంపర్ ఆఫర్: భారత టెక్కీలకు మైక్రోసాఫ్ట్ బిగ్ అనౌన్స్‌మెంట్
టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కీలక ప్రకటన చేసింది. భారత్, అమెరికా, బ్రిటన్, కెనడాల్లో పనిచేస్తోన్న 60,000 ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా వాలంటరీ ఎగ్జిట్ ప్రోగ్రామ్ ను అమలు చేయనున్నట్లు వెల్లడించింది. ఉద్యోగాల నుంచి స్వచ్ఛందంగా వైదొలగాలని భావించే వారికి ఆర్థిక ప్యాకేజీతో పాటు కెరీర్ గైడెన్స్ కూడా అందించనున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగా భారత్ కు చెందిన ఉద్యోగులు తమ నిర్ణయాన్ని వెల్లడించడానికి ఈ ఏడాది డిసెంబర్ 1వ తేదీ వరకు గడువు ఇచ్చింది మైక్రోసాఫ్ట్.
భారత్ లో మైక్రోసాఫ్ట్ లో దాదాపు 23,000 మంది ఉద్యోగులు పనిచేస్తోన్నారు. వీరిలో ఎంతమందికి ఈ వాలంటరీ ఎగ్జిట్ కు అర్హత ఉందనే విషయంపై సంస్థ యాజమాన్యం పూర్తి స్పష్టత ఇవ్వలేదు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో కలిపి మొత్తం 60,000 మంది ఉద్యోగులు ఈ స్వచ్ఛంద నిష్క్రమణ ఆఫర్ పరిధిలోకి వస్తారని పేర్కొంది. ఏఐ ఎక్స్‌పీరియన్సెస్, కోపైలట్, ఫైనాన్స్, హ్యూమన్ రిసోర్సెస్, ఎక్స్‌బాక్స్, విండోస్ + డివైసెస్ సహా ఇతర విభాగాలలోని ఉద్యోగులను దీని పరిధిలోకి తెచ్చిందా సంస్థ యాజమాన్యం. ఇందులో నుంచి మార్కెటింగ్, కమర్షియల్ బిజినెస్, సెక్యూరిటీ టీమ్ ను మినహాయించారు.

స్వచ్ఛందంగా సంస్థను వీడేందుకు సిద్ధపడే ఉద్యోగులకు లేఆఫ్ పరిహారాల తరహాలోనే మంచి బెనిఫిట్స్ అందుతాయని మైక్రోసాఫ్ట్ తెలిపింది. ప్రతి సంవత్సరానికి ఒక నెల బేసిక్ శాలరీని పరిహారంగా ఇవ్వనున్నట్లు వివరించింది. దీనితో పాటు హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని పొడిగిస్తుందా సంస్థ. ఉద్యోగాలను వదులుకునే వారికి ఇతర కంపెనీల్లో నూతన అవకాశాలను దక్కించుకోవడానికి వీలుగా ప్రత్యేకంగా కెరీర్ ట్రాన్సిషన్ సర్వీసులను కూడా అందుబాటులో తెస్తుంది.
ఈ వాలంటరీ ఎగ్జిట్ ఆఫర్ లెవెల్ 70, అంతకంటే తక్కువ స్థాయిలో ఉన్న ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుందని మైక్రోసాఫ్ట్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అమీ కోల్‌మన్ వెల్లడించారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అడాప్టేషన్ అనంతరం చోటు చేసుకుంటోన్న మార్పులకు అనుగుణంగా వర్క్‌ఫోర్స్‌ను పునర్వ్యవస్థీకరించుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. దీనికి అర్హులైన 60,000 మంది ఉద్యోగులకు కూడా త్వరలోనే మెయిళ్లను పంపుతామని అన్నారు.
ఉద్యోగుల సంఖ్యను కుదించుకుంటూనే భారత్ లో క్లౌడ్ ఇన్ ఫ్రా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మానవ వనరుల నైపుణ్యాభివృద్ధికి 20.5 బిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టనున్నామని అన్నారు. 2030 నాటికి భారత్ లో సుమారు రెండు కోట్ల మందికి ఏఐ బేస్డ్ ట్రైనింగ్ ఇవ్వాలనే తమ లక్ష్యమని వివరించారు.














Click it and Unblock the Notifications
