గాలి జనార్దన్ రెడ్డి మద్దతు ఎవరికో తెలుసా ?, అయితే కండీషన్ పెట్టిన రెడ్డి గారు !
బెంగళూరు/బళ్లారి: గతంలో బీజేపీ జెండా దించకుండా మోసి కర్ణాటకలో ఆ పార్టీ అధికారంలోకి రావడానికి శక్తి వంచనలేకుండా పని చేసిన మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి కొరకరాని కొయ్యగా తయారయ్యాడు. చివరికి కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న సమయంలోనే సీబీఐ అధికారులు గాలి జనార్దన్ రెడ్డిని అరెస్టు చేసి జైల్లో పెట్టారు.
తనను కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేసిందని గాలి జనార్దన్ రెడ్డి అప్పట్లో ఆరోపణలు చేశారు. జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత గాలి జనార్దన్ రెడ్డి బీజేపీ నుంచి బయటకు వచ్చేసి కల్యాణ కర్ణాటక ప్రగతి పార్టీ స్థాపించారు. గాలి జనార్దన్ రెడ్డి ఆయన సొంత పార్టీ కేఆర్ పీ నుంచి కోప్పళ జిల్లాలోని గంగావతి నియోజక వర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు.

బుధవారం గంగావతిలో ఓటు వేసిన గాలి జనార్దన్ రెడ్డి ఆ నియోజక వర్గంలోని పలు పోలింగ్ బూతులు తిరుగుతూ పోలింగ్ తీరును పరిశీలించారు. ఈ సందర్బంగా గంగావతిలో మీడియాతో మాట్లాడిన గాలి జనార్దన్ రెడ్డి తాను ఉదయం బసవతాత, గంగావతి గ్రామ దేవత ఆశీర్వాదం తీసుకున్న తరువాత ఓటు వేశానని చెప్పారు.
గతంలో తనను కాంగ్రెస్ పార్టీ జైలుకు పంపించిందని ఆరోపణలు చేసిన గాలి జనార్దన్ రెడ్డి ఇప్పుడు అవసరం అయితే తాను కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తానని ప్రకటించడం కలకలం రేపింది. గంగావతిలో తనకు ఎవరు పోటీ లేరని, గంగావతిలో విజయం తనదే అని మాజీ మంత్రి, మైనింగ్ గాలి జనార్దన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
కర్ణాటకలో కేఆర్ పీ పార్టీ 13 నియోజక వర్గాల్లో భారీ మెజారిటీతో విజయం సాధిస్తుందని, మిగిలిన నియోజక వర్గాల్లో మా పార్టీ గట్టిపోటీ ఇస్తుందని మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి మీడియాకు చెప్పారు. బళ్లారిలో తన భార్య లక్ష్మీ అరుణ కచ్చితంగా విజయం సాదిస్తారని మాజీ మంత్రి, మైనింగ్ గాలి జనార్దన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

మా పార్టీ విజయం సాధిస్తే ఏదోఒక పార్టీకి మద్దతు ఇవ్వాల్సి ఉంటుందని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. తాను కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడానికి సిద్దంగా ఉన్నానని, అయితే సిద్దరామయ్యను సీఎం చేస్తే మాత్రమే తాను కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తానని గాలి జనార్దన్ రెడ్డి కండిషన్ పెట్టడం ఇప్పుడు కర్ణాటకలో హాట్ టాపిక్ అయ్యింది.
తనను కాంగ్రెస్ పార్టీ జైలుకు పంపించిందని పదేపదే ఆరోపణలు చేసిన గాలి జనార్దన్ రెడ్డి ఇప్పుడు తాను బీజేపీకి మద్దతు ఇస్తానని చెప్పకుండా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తానని బహిరంగంగా చెప్పడం ఇప్పుడు కర్ణాటకలో హాట్ టాపిక్ అయ్యింది. మే 13వ తేదీ తరువాత గాలి జనార్దన్ రెడ్డి కేఆర్ పీ పార్టీకి ఎన్నిసీట్లు వస్తాయో ? అనే విషయంలో క్లారిటీ వస్తుంది.












Click it and Unblock the Notifications