అమ్మాయిని ముద్దు పెట్టుకున్నాడని నడిరోడ్డుపై నగ్నంగా.. కొడుకు చేసిన పనికి తండ్రికి నరకం..
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో మానవత్వం ముసుగులో ఎంతటి అన్యాయం జరిగిందో తెలిపే తీవ్ర దిగ్భ్రాంతికరమైన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. తాను ప్రేమించిన అమ్మాయిని ముద్దు పెట్టుకున్నాడనే ఒక్క కారణంతో 17 ఏళ్ల మైనర్ బాలుడిని, అతని స్నేహితుడిని, ఆ కుర్రాడి తండ్రిని వీధుల్లో నగ్నంగా ఊరేగించిన అత్యంత అమానుష ఘటన కలకలం రేపింది. దక్షిణ కోల్‌కతా పరిధిలోని సర్సునా పోలీసు స్టేషన్ పరిధిలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ దారుణం స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
స్థానిక సమాచారం ప్రకారం, 13 ఏళ్ల బాలికను, ఆ మైనర్ బాలుడు ముద్దు పెట్టుకుంటూ ఉండగా బాలిక కుటుంబ సభ్యులు చూశారు. దీంతో ఆగ్రహంతో రగిలిపోయిన బాలిక తల్లిదండ్రులు, ఆమె మేనమామ కలిసి... బాలుడిని, అతని స్నేహితుడిని ఒక గదిలో బంధించి దారుణంగా కొట్టారు. అనంతరం బాలుడితో అతని తండ్రికి ఫోన్ చేయించి అక్కడికి రప్పించారు. బాధితుడైన తండ్రి అక్కడికి చేరుకోగానే ఆయనపై కూడా ఆరుగురు వ్యక్తులు తీవ్రంగా దాడికి పాల్పడ్డారు.

అక్కడితో ఆగక, బాలిక మేనమామ ఒక అడుగు ముందుకు వేసి ఆ తండ్రి చేతికి తుపాకీ ఇచ్చి "నీ ముందు రెండే మార్గాలు ఉన్నాయి.. ఒకటి నీ కొడుకుని నువ్వే కాల్చి చంపు, లేదంటే మీ కొడుకుతో పాటు నువ్వు కూడా వీధిలో నగ్నంగా నడువు" అని తీవ్రంగా బెదిరించాడు. వేరే దారి లేక ఆ తండ్రి తన కొడుకుతో, అతని స్నేహితుడితో కలిసి వీధిలో నగ్నంగా నడవాల్సి వచ్చింది. ఈ ఘోరమైన దృశ్యాలను కొందరు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఈ అవమానకర ఘటన బయటకు వచ్చింది.
స్థానికుల ఆగ్రహం.. పోలీసుల రంగప్రవేశం
ఈ అమానుషమైన చర్యకు సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తీవ్ర ఆగ్రహానికి గురైన స్థానిక ప్రజలు బాలిక ఇంటిపై దాడికి ప్రయత్నించగా, వెంటనే రెస్పాండ్ అయిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. బాలుడిని, అతని తండ్రిని అత్యంత దారుణంగా అవమానించిన బాలిక తల్లిదండ్రులను పోలీసులు వారి ఇంట్లోనే అరెస్ట్ చేశారు.
అలాగే, పరారయ్యేందుకు యత్నించిన బాలిక మేనమామను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. తీవ్ర మానసిక వేదనకు గురైన బాధితులకు న్యాయం జరిగేలా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.














Click it and Unblock the Notifications
