మూడోసారి గెలిపించిన ప్రజలకు ప్రధాని మోదీ బంపర్ ఆఫర్..!!
PM Modi new cabinet meeting: దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. దైవసాక్షిగా ప్రమాణం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. దేశ ప్రధానిగా ఆయన ప్రమాణం చేయడం వరుసగా ఇది మూడోసారి.
ఈ కార్యక్రమానికి పలువురు ఆహ్వానితులు హాజరయ్యారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల అధినేతలు పాల్గొన్నారు. వివిధ దేశాల అధ్యక్షులు, ప్రధానమంత్రుల సమక్షంలో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం కొనసాగింది. మోదీ పాటు మొత్తం 72 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఇందులో 61 మంది బీజేపీ, 11 మంది ఎన్డీఏ అలయెన్స్ ఎంపీలు ఉన్నారు.

కాగా- నేడు ప్రధానమంత్రి అధ్యక్షతన తొలి కేబినెట్ భేటీ కానుంది. ఈ సాయంత్రం ఢిల్లీలో ఈ సమావేశం ఏర్పాటైంది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్రమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన జీ కిషన్ రెడ్డి, బండి సంజయ్, కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాసవర్మ సహా మిగిలిన వారందరూ ఇందులో పాల్గొననున్నారు.
దేశ ప్రజలు వరుసగా మూడోసారి తనను గెలిపించిన నేపథ్యంలో ప్రధాని మోదీ వారికి తీపి కబురు వినిపించనున్నారు. ప్రధానమంత్రి గ్రామీణ్ ఆవాస్ యోజన పథకం కింద అదనంగా రెండు కోట్ల గృహాలను మంజూరు చేయడానికి ఉద్దేశించిన ప్రతిపాదనలను మంత్రివర్గం ఆమోదించే అవకాశాలు ఉన్నాయి.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన - గ్రామీణ్ పథకం కింద అర్హులైన లబ్దిదారుల కోసం గృహాలను మంజూరు చేయడానికి ఉద్దేశించిన పథకం ఇది. దీనికి అనుబంధంగా ప్రధానమంత్రి జన్‌జాతి ఆదివాసి న్యాయ మహా అభియాన్ కింద ఈ పథకాన్ని కేంద్రం అమలు చేస్తోన్న విషయం తెలిసిందే.
2023-2024 వార్షిక బడ్జెట్‌లో దీన్ని చేర్చింది కేంద్రం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే దీన్ని అమలు చేస్తామనీ అప్పట్లో ప్రకటించింది. గత ఏడాది నవంబర్ 29వ తేదీన ఈ పథకాన్ని కేంద్ర కేబినెట్ ఆమోదించింది. దీన్ని అమలు చేయడానికి అయ్యే ఖర్చు 24,104 కోట్ల రూపాయలు.
ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా 15,336 కోట్ల రూపాయలు. మిగిలిన 8,768 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వాలు భరించాల్సి ఉంటుంది. ఇప్పుడీ పథకం కింద అదనంగా రెండు కోట్ల గృహాలను మంజూరు చేయడానికి కొత్త కేంద్ర కేబినెట్.. ఆమోదం తెలపనుంది. దీనితోపాటు మరికొన్ని సంక్షేమ పథకాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications