అన్ని విధాలా ఆదుకుంటాం: మోడీ, ఆపరేషన్ లెహర్
న్యూఢిల్లీ: హుదూద్ పెను తుపానుకు తీవ్రంగా దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలను అన్ని విధాలా ఆదుకుంటామని ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ హామీ ఇచ్చారు. రాజ్‌నాథ్ సింగ్ ఆదివారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఒడిశా సిఎం నవీన్ పట్నాయక్‌తో టెలిఫోన్‌లో మాట్లాడారు. హుదూద్ సృష్టించిన బీభత్సాన్ని సమీక్షించి, నష్టం వివరాలు తెలుసుకున్నారు.
ఆంధ్ర, ఒడిశాను ఆదుకునేందుకు కేంద్రం అన్ని విధాలా తోడ్పడుతుందన్నారు. పెను తుపాను తీవ్రత తగ్గి సహాయ పునరావాస కార్యక్రమాల నిర్వహణకు అనువైన పరిస్థితులు నెలకొనగానే కేంద్ర పరిశీలక బృందాలను పంపాలని హోంశాఖ ఆలోచిస్తోంది. హోంశాఖ అధికారులు ఆంధ్రప్రదేశ్, ఒడిశాలో హుదూద్ తుపాను సృష్టించిన బీభత్సాన్ని ఎప్పటికప్పుడు అంచనావేస్తూ జాతీయ విపత్తు నివారణ విభాగానికి తగు ఆదేశాలు జారీ చేస్తున్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హుదూద్ తుపానును ఎదుర్కొనేందుకు అన్ని రకాలుగా సిద్ధం కావటంవల్లే మరణాలను నివారించగలిగినట్టు హోంశాఖ అధికారులు చెబుతున్నారు. రెండు రాష్ట్రాల్లోని తీరప్రాంతాల నుంచి వేలాదిమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించటం వల్ల మరణాలు నివారించగలిగామని చెబుతున్నారు.

ఆపరేషన్ లెహర్ సిద్ధం
హుదూద్ పెను తుపాను తాకిడికి విలవిల్లాడిన అంధ్రప్రదేశ్, ఒడిషా రాష్ట్రాల్లోని కల్లోలిత ప్రాంతాలనుంచి ప్రజలను రక్షించే గురుతర బాధ్యతను నౌకాదళానికి అప్పగించారు. ఆపరేషన్ లెహర్ పేరిట భారత నౌకాదళం తన శక్తియుక్తులన్నిటినీ క్రోడీకరించి సహాయక చర్యలకు సమాయత్తమయింది. సాయుధ దళాలలో అత్యంత కీలకమైన ఈ బాధ్యతలను నిర్వహించే విధంగా నౌకాదళం తన వనరులన్నిటినీ సమీకరించుకుని ఆంధ్రప్రదేశ్ ఉపప్రాంత దళాలను విశాఖపట్నం, శ్రీకాకుళం (టెక్కలి, ఎచ్చెర్ల) ప్రాంతాల్లో మోహరించింది.
అలాగే గోపాల్‌పూర్‌లోని వైమానిక రక్షణ కాలేజీలో ఉపద్రవ నిర్వహణ కేంద్రాన్ని ఏర్పాటుచేసింది. ఆరు బృందాలు, పది ఉప బృందాలను రహదారుల మరమ్మతు కార్యక్రమానికి వినియోగించారు. రాంచీ, అలహాబాద్, సికింద్రాబాద్‌లలో సైనిక దళం 25 సహాయ బృందాలను, రెండు ఇంజనీరింగ్ టాస్క్ఫోర్సులను సమాయత్తం చేసింది. చిల్కా, విశాఖపట్నం సహా ఒడిషా, ఆంధ్రప్రదేశ్‌లోని కీలక ప్రాంతాల్లో నౌకాదళం తన సంపత్తిని అలాగే సిబ్బందిని మోహరించింది.
అదేవిధంగా వరదల్లో చిక్కుకున్న ప్రజలను రక్షించేందుకు గజ ఈతగాళ్ళను 30 బృందాలను కూడా సంసిద్ధం చేసింది. నాలుగు నౌకలు, వైద్య బృందాలు అవసర పరిమాణంలో మందులను కూడా ముందస్తుగా సమీకరించింది. ఆరు హెలికాప్టర్లు, రెండు ప్రత్యేక హెలికాప్టర్లు, రెండు వైద్య బృందాలు ఇప్పటికే విశాఖ చేరుకుని సహాయ సంక్షేమ చర్యలు మొదలుపెట్టాయని రక్షణ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.












Click it and Unblock the Notifications