గడ్కరీ, రాజ్‌నాథ్‌ని అడిగితే చెప్తారు: మోడీపై డిగ్గీ సెటైర్లు
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఆదివారం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. నరేంద్ర మోడీ వన్ మేన్ కేబినెట్ అని, అలాంటప్పుడు మంత్రివర్గాన్ని విస్తరించాల్సిన అవసరం లేదని ఎద్దేవా చేశారు. మంత్రివర్గ విస్తరణ పైన అంత ఆతృత ఎందుకని మీడియాను ప్రశ్నించారు.
మోడీ లాంటి వ్యక్తికి మంత్రివర్గ విస్తరణ అవసరం లేదన్నారు. అతను వన్ మేన్ కేబినెట్ అన్నారు. ఈ విషయాన్ని కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్‌ని లేదా నితిన్ గడ్కరీని అడిగినా చెబుతారన్నారు.
మరోవైపు, కాంగ్రెస్ నేత పీసీ చాకో అంతకుముందు మాట్లాడుతూ... కేబినెట్ విస్తరణ ద్వారా ప్రభుత్వం పని చేయాలనుకుంటున్నట్లుగా ఉందని అభిప్రాయపడ్డారు. చాలామంది మంత్రులు అడిషనల్ ఛార్జ్ తీసుకున్నారని చెప్పారు. అసలే చేయకపోవడం కంటే ఆలస్యమైనా చేయడం మంచిదని, ఇప్పుడు విస్తరణ చేయడం సరైనదని అభిప్రాయపడ్డారు. తాను కొత్త మంత్రులకు శుభాకాంక్షలు తెలుపుతున్నానని చెప్పారు.

ముషార్రఫ్ ఫార్ములాతోనే పరిష్కారం: రాంజెఠ్మలానీ
కాశ్మీర్ సమస్య రావణకాష్ఠంలా రగులుతుండటానికి భారత్‌లోని ప్రభుత్వాల వైఖరే కారణమని ప్రముఖ న్యాయకోవిదుడు రామ్ జెత్మలానీ కొత్త వివాదాన్ని లేవనెత్తారు. శనివారం ఆయన శ్రీనగర్‌లో విలేకరులతో మాట్లాడారు. దాయాదుల మధ్య నిత్యకలహం నివారణకు పాకిస్తాన్ మాజీ సైనిక పాలకుడు ముషార్రఫ్ లోగడ ప్రతిపాదించిన ఫార్ములాయే సరైన పరిష్కారమన్నారు.
కాశ్మీర్ వేర్పాటువాద సంస్థలతో చర్చలకు 2002లో కేంద్రం నియమించిన మధ్యవర్తుల కమిటీకి జెత్మలానీ చైర్మన్‌గా ఉన్నారు. ఆ సమయంలో ఒక ఉమ్మడి స్నేహితుడి ద్వారా ముషార్రఫ్ తన ఫార్ములాను పంపారన్నారు. దానికి స్వల్ప సవరణలు చేసి పంపగా ఆయన కూడా అంగీకరించారని చెప్పారు.
కాశ్మీర్ సమస్యకు ముషార్రఫ్ అద్భుత మైన శాశ్వత పరిష్కారం సూచించారని, కానీ ఆయన కృషికి భారత ప్రభుత్వమే గండికొట్టిందన్నారు. అలాగే కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రాజ్యాంగంలో చెరిపివేయ వీలుకాని అంతర్భాగమని ప్రధాని మోడీకి ఓ సందర్భంలో వివరించానన్నారు. అందుకే బీజేపీ నేతలు ఇప్పుడా ప్రస్తావన తేవడంలేదని చెప్పారు.
ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలని ఐక్యరాజ్యసమితి ఆదేశించిన మాట వాస్తవమేనన్నారు. అయితే, పాకిస్తాన్ ఆక్రమిత భూభాగం సహా కాశ్మీర్ నుంచి చొరబాటుదారులంతా పూర్తిగా నిష్క్రమించాక, అదీ భారత పతాకం కింద సాగాల్సి ఉంటుందని షరతు విధించిందని వివరించారు.












Click it and Unblock the Notifications