వచ్చే ఎన్నికల్లో నా ప్రత్యర్థులు సిబిఐ, ఐఎం: మోడీ
లక్నో: వచ్చే ఎన్నికల్లో తనకు ప్రత్యర్థులుగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ), ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్‌లు తలపడనున్నాయని భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. తనపై సిబిఐ నమోదు చేసిన కేసులు, తను పాట్నాలో నిర్వహించిన ర్యాలీపై ఉగ్రవాదులు చేసిన దాడిని ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బహ్రెయిచ్‌లో ర్యాలీ నిర్వహించారు.
భారీ భద్రత మధ్య కొనసాగిన ర్యాలీలో ఆయన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. తనను తొలగించేందుకు బాంబులు, బుల్టెట్లు, బెదిరింపులు రాజకీయ కుట్రలో భాగంగా మారాయని అన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తనకు ప్రత్యర్థులుగా సిబిఐ, ఇండియన్ ముజాహిదీన్‌లు పోటీ పడనున్నట్లు ఆయన తెలిపారు. అయితే వాటికి తాను భయపడబోనని మోడీ చెప్పారు.

ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ గుజరాత్ రాష్ట్రంలో మూడుసార్లు జరిగిన శాసనసభ ఎన్నికల్లో తనను ఓడించలేకపోయిందని అన్నారు. ఎన్నికల ప్రక్రియ ద్వారా తనను ఓడించలేమని తెలుసుకున్న కాంగ్రెస్.. సిబిఐ, ఇండియన్ ముజాహిదీన్‌లను తన ప్రత్యర్థులుగా తీసుకొస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ఈ సందర్భంగా మోడీ ప్రశంసలు కురిపించారు. తన రాష్ట్ర అభివృద్ధి కోసం ప్యాకేజి ఇవ్వాలని కేంద్రాన్ని మమతా బెనర్జీ కోరుతున్నారని, అయితే ఇలాంటి ఏ పని కూడా ఉత్తరప్రదేశ్ సమాజ్‌వాది పార్టీ ప్రభుత్వం చేయడం లేదని విమర్శించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్ నగర్‌లో జరిగిన అల్లర్లపై ఆయన తొలిసారిగా స్పందించారు. అల్లర్లను ప్రోత్సహించారనే ఆరోపణలపై తమ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలను ప్రభుత్వం అరెస్ట్ చేసిందని, అయితే కోర్టు వారికి క్లీన్‌చీట్ ఇచ్చిందని తెలిపారు.
బిజెపిపై బురద జల్లే చర్యలకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పాల్పడుతోందని మోడీ ఆరోపించారు. తమ పార్టీకి అధికారం కట్టబెట్టినట్లయితే ఎవరైతే అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారో వారందరినీ సరైన ప్రదేశానికి పంపిస్తానని అన్నారు. అందుకే తనను చూసి అవినీతిపరులైన నాయకులు భయపడుతున్నారని చెప్పారు. తను ఉగ్రవాదుల చర్యలకు భయపడనని, ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేస్తానని అన్నారు.
పాట్నాలో నిర్వహించిన తన ర్యాలీకి హాజరైన ప్రజలు భారత్ మాతాకీ జై అన్నందుకే ఉగ్రవాదులు బాంబులు పెట్టి పలువురి ప్రాణాలు తీశారని అన్నారు. ప్రస్తుతం తన బహ్రెయిచ్ ర్యాలీలో కూడా ప్రజలు భారత్ మాతాకీ జై అని నినదించాలని, ఈ నినాదాలతో ఉగ్రవాదులకు భయం పుట్టుకురావాలని నరేంద్ర మోడీ అన్నారు. ఉత్తరప్రదేశ్ పురోగతే దేశ అభివృద్ధి అని, ఉత్తరప్రదేశ్ ప్రజలు తీసుకునే నిర్ణయమే దేశ భవిష్యత్‌ను నిర్ణయిస్తుందని ఆయన అన్నారు. రాష్ట్రంలోని 80 లోక్‌సభ స్థానాల్లో బిజెపిని గెలిపించి దేశ అభివృధ్దిలో భాగస్వాములు కావాలని మోడీ ప్రజలను కోరారు.












Click it and Unblock the Notifications