వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహ్మద్ ఇక్బాల్: 'సారే జహాసే అచ్చా హిందుస్థాన్ హమారా' అన్న కవి... 'ముస్లిం హై హమ్... వతన్ హై సారా జహా హమారా' అని ఎందుకన్నారు?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
జాతీయ వాదాన్ని వినిపించిన మహ్మద్ ఇక్బాల్ బ్రిటీష్ వారి నైట్ హుడ్ బిరుదును అంగీకరించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

ఇతర ప్రభావాలు ఎన్ని ఉన్నా, 19వ శతాబ్దం చివర్లో ఉర్దూ సాహిత్యం విక్టోరియన్(క్వీన్ విక్టోరియా 1819-1901) లక్షణాలను పుణికి పుచ్చుకోవడం మొదలు పెట్టింది.

ఈ కాలపు రచయితలపై అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం స్థాపకుడు సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్, 'అలీఘర్ స్కూల్'కు చెందిన ఆయన సహోద్యోగి అల్తాఫ్ హుస్సేన్‌ల ప్రభావం తీవ్రంగా ఉండేది.

అయితే, బ్రిటీష్ ప్రయోజనాలు, ముస్లింల ప్రయోజనాలు వేర్వేరు అని భావించే రచయితల వర్గం కూడా ఒకటి ఉండేది. ఉదాహరణకు, షిబ్లీ నౌమాని (1857-1914), సజ్జాద్ హుస్సేన్‌ లు జాతీయవాదాన్ని, బ్రిటిష్ వ్యతిరేక స్వరాన్ని వినిపించే వారు.

ఈ నేపథ్యంలోనే 20వ శతాబ్దపు గొప్ప కవులలో ఒకరైన సర్ మహమ్మద్ ఇక్బాల్ (1877-1938) గురించి కూడా తెలుసుకోవాలి. ఇక్బాల్ చాలామందికి అల్లామా ఇక్బాల్‌గా తెలుసు. అల్లామ అంటే పండితుడు అని అర్ధం.

ఇక్బాల్‌ కు ముస్లిం వర్గాలలో మంచి గుర్తింపు ఉంది. దీనికి కారణం ఆయన సగటు ముస్లింలో ఏముందో తెలుసుకోవడానికి ప్రయత్నించడం ఒక్కటే కాదు, ఆయన కవితలు ముస్లిం వర్గాలలో ఎంతో స్ఫూర్తిని నింపాయి.

మిగిలిన ఉర్దూ కవులకు భిన్నంగా ఆయన విప్లవ మార్గాన్ని కూడా బోధించారు.

1930 నాటి అలహాబాద్ ముస్లిం లీగ్ సమావేశంలో ఇక్బాల్ ముస్లిం దేశం కావాలని ప్రతిపాదించారు.

అధ్యాపకుడి నుంచి తత్వవేత్త వరకు....

లాహోర్‌ ప్రభుత్వ కళాశాల నుండి 1899లో పట్టభద్రుడయ్యాక, ఇక్బాల్ అదే కళాశాలలో తత్వశాస్త్ర అధ్యాపకునిగా ఉద్యోగంలో చేరారు.

ట్రినిటీ కాలేజ్, కేంబ్రిడ్జ్ , హైడెల్బర్గ్, మ్యూనిచ్‌లలో ఆయన తత్వ శాస్త్రాన్ని చదివారు. ఆ తర్వాత న్యాయశాస్త్రం కూడా చదివారాయన.

విదేశాల నుంచి తిరిగొచ్చాక మరో రెండేళ్లు గవర్నమెంట్ కాలేజీలో బోధించి ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆపై న్యాయవాద వృత్తిని చేపట్టారు. పుస్తకాలు చదవడం, రాయడం పై తన దృష్టిని కేంద్రీకరించారు.

ఇక్బాల్ బ్రిటీష్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించేవారు. అయితే 1922లో బ్రిటీష్ వారు ఇచ్చే నైట్‌హుడ్‌ని స్వీకరించడం ద్వారా అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.

1927లో పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1928-29లో, అలీఘర్, హైదరాబాద్, మద్రాసు విశ్వవిద్యాలయాలలో ఆరు ఉపన్యాసాలు ఇచ్చారు. ఇవి ఆయనలోని మత పరమైన భావాలను వివరిస్తాయి. తర్వాత 'రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ రిలిజియస్ థాట్ ఇన్ ఇస్లాం' అనే పుస్తక రూపంలో తీసుకొచ్చారు.

1931లో లండన్‌లో జరిగిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌లో భారతీయ ముస్లిం ప్రతినిధి సభ్యునిగా ఇక్బాల్ పాల్గొన్నారు. ఈ ప్రతినిధి బృందానికి అగా ఖాన్ నాయకత్వం వహించారు.

ఇక్బాల్ సమకాలికుడైన కవి అక్బర్ అలహబాదీ (1846-1921) కూడా పాశ్చాత్య నాగరికతను తీవ్రంగా వ్యతిరేకించేవారు. అయితే, పాశ్చాత్య నాగరికత ముఖ్యంగా బ్రిటీష్ వారిపట్ల ఆయన వ్యతిరేకత సాంస్కృతిక, సామాజిక, రాజకీయ కారణాలలతో ముడిపడి ఉంది.

అయితే ఇక్బాల్ మతం, తత్వశాస్త్రం ఆధారంగా పాశ్చాత్య జ్ఞానాన్ని, ఇంగ్లీష్ మెటీరియలిజంను డెవలప్ చేశారు. కానీ దీనిపై చాలామందికి సందేహాలున్నాయి.

మొదట్లో ఇక్బాల్, అక్బర్ ఇద్దరూ ఆర్ట్ ఫర్ లైఫ్‌ అన్న వాదనకు మద్దతుదారులు. ఇద్దరూ పూర్తిగా రాజకీయ కవులు, ముస్లిం సమాజంలోని సంఘర్షణ గురించి బాగా తెలిసిన వారు.

బ్రిటీష్ ప్రభుత్వంలో చాలామంది ముస్లింలు గౌరవప్రదమైన ఉద్యోగాలలో ఉన్నారు. అయితే, ముస్లింలకు బ్రిటిష్ ప్రభుత్వం నుండి లభిస్తున్న గుర్తింపు, ప్రశంసలు ఒక షో తప్ప మరేమీ కాదు.

అందుకే ఇస్లామిక్ సమాజంలో పునరుజ్జీవనం అవసరమని ఇక్బాల్ నమ్మేవారు. ఇంతకన్నా వేరే మార్గం లేదని ఆయన వాదించేవారు.

హృదయాన్ని హత్తుకునే తన కవిత్వంతో ఆయన భారతీయ ముస్లింలకు వారి చరిత్రను గుర్తు చేశారు. ఈ అద్భుతమైన చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకొని అందుకు అనుగుణంగా నడుచుకోవాలని ఆయన ముస్లింలకు సూచించేవారు.

ప్రత్యేక ముస్లిం దేశం భావన చివరకు పాకిస్తాన్ ఏర్పాటుకు దారి తీసింది

ఇక్బాల్‌లో మార్పు

కవిగా ఆరంభంలో ఇక్బాల్ హిందూ, ముస్లింల ఐకమత్యం గురించి, స్వతంత్ర భారతదేశం గురించి రాసేవారు. అయితే, ఇది రాను రాను ఏకేశ్వరవాదం, వ్యక్తివాదాలవైపు మళ్లింది.

ఇక్బాల్ కవిత్వ ప్రయాణం ఇలా సాగింది:

1904లో తరానా-ఎ-హింద్ ('హిందువులం మనం, మనదే హిందూస్థాన్') అని రాసిన ఇక్బాల్ 1910లో తరానా-ఎ-మిల్లీ ('ముస్లింలు మనం, ఈ ప్రపంచం మనదే ') అని రాశారు.

రెండు దశాబ్దాల తర్వాత, 1930లో అలహాబాద్‌లో జరిగిన ముస్లిం లీగ్ సమావేశానికి అధ్యక్షత వహించి, ముస్లింల కోసం ప్రత్యేక దేశం అన్న ప్రతిపాదన చేశారు.

అయితే, ఇక్బాల్ ఇస్లామిక్ జాతీయవాద భావజాలంలో మనుషులు సృష్టించిన సరిహద్దులకు చోటులేదు.

ఒక కవితలో భారతదేశం గురించి ఆయన ఇలా రాశారు.

''మీరు ఐరోపా బానిసత్వాన్ని అంగీకరించారు

నేను మిమ్మల్ని చూసి జాలిపడుతున్నాను

యూరప్ ను చూసి కాదు''

మహ్మద్ అలీ జిన్నా పాకిస్తాన్ కోసం పట్టుబట్టి దేశ విభజనకు కారణమయ్యారు

ఉర్దూ కవిత్వపు 'కొత్త నిబంధన'

ఇక్బాల్ రాసిన తొలి కవితల్లో కనిపించే జాతీయవాదం క్రమంగా మారడం మొదలవుతుంది. జర్మన్ తత్వవేత్త నీషే, ఫ్రెంచ్ తత్వవేత్త బెర్గ్‌సన్, జర్మనీకి చెందిన కార్ల్‌మార్క్స్ ప్రభావంతో ఇక్బాల్ కవిత్వంలో మార్పులు వచ్చినట్లు చెబుతారు.

ఇక్బాల్ కవిత్వాన్ని నిశితంగా పరిశీలించిన అల్ అహ్మద్ సురూర్, ఇక్బాల్ కొత్త కవిత్వాన్ని 'ఉర్దూ కవిత్వానికి కొత్త నిబంధన' గా అభివర్ణించారు.

భారతదేశంలోని అభ్యుదయ రచయితలు తమ కవితలతో విప్లవాత్మకంగా మారుతున్న కాలంలో ఇక్బాల్ కవితలకు ఎంతో ప్రాముఖ్యత ఏర్పడింది. ప్రగతిశీల రచయితలతోపాటు ఇక్బాల్ కూడా విప్లవం, మార్పు గురించి కవితలు రాశారు.

ఇక్బాల్ 'ఆధ్యాత్మిక సోషలిజం'ను ఆశ్రయించగా, అభ్యుదయ కవులు సోవియట్ యూనియన్ మోడల్ సోషల్ రియలిజాన్ని నమ్మారు. ఈ రెండు మార్గాలు ఫ్యూడలిజానికి వ్యతిరేకంగా భారతీయులను ప్రేరేపించాయి.

ఇక్బాల్ పాటలు, కవితలు ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకంగా ఉంటుంది.

ఇక్బాల్ కవిత్వం భారతీయ ముస్లింలు చెడుతో పోరాడటానికి, అణచివేతను ఎదుర్కోవడానికి సూచించిన మార్గం. దీనివల్ల బ్రిటీష్ వారికి ఎలాంటి ఇబ్బంది లేదు.

ఇక్బాల్ తన కవిత్వంలో తిరుగుబాటు గురించి కూడా ప్రస్తావించారు. అయితే ఇది బ్రిటీష్ సామ్రాజ్యాన్ని వ్యతిరేకించేది కాదు. అందుకే ఇక్బాల్ కవిత్వంపై బ్రిటీష్ ప్రభుత్వం ఎలాంటి నిషేధాలు విధించ లేదు.

అప్పట్లో సిబ్తే హసన్ లాంటి విప్లవ కవుల రచనలకు భయపడి బ్రిటీష్ ప్రభుత్వం వాటిపై నిషేధం విధించింది.

విక్టర్ కీర్నన్ తన వ్యాసంలో ఇక్బాల్‌ను మార్పును కోరే ప్రవక్త అని పేర్కొన్నారు. '' ఇక్బాల్ తన కవిత్వంలో అనేక సంక్లిష్టతలను, గందరగోళాలు, వైరుధ్యాలను ప్రదర్శించారు'' అని విక్టర్ రాశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Mohammad Iqbal:'Saare Jahase Achcha Hindustan Hamara'Why did he say'Muslim Hai Hum
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X