లైంగిక వేధింపు: యువకులకు రోడ్లు ఊడ్చే శిక్ష
థానే: ఓ నలుగురు యువకులు చీపుర్లు పట్టి ఏకధాటిగా దాదాపు ఏడు గంటలపాటు రోడ్లన్నీ ఊడ్చేశారు. వారి పర్యవేక్షణగా ఓ పోలీసు అధికారి కూడా ఉన్నాడు. ఎందుకంటే వారు స్వచ్ఛ భారత్‌లో భాగంగా రోడ్లను శుభ్రం చేయడం లేదు. ఓ యువతిని లైంగికంగా వేధింపులకు గురి చేసినందుకు కోర్టు వేసిన శిక్షగా ఈ పని చేస్తున్నారు. ఆరు నెలలపాటు రోడ్లన్నీ శుభ్రంగా ఊడ్చాలని కోర్టు ఆదేశించడంతో తప్పని పరిస్థితుల్లో రోడ్ల మీద పడ్డారు.
ఈ ఘటన మహారాష్ట్రలోని థానే నగరంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గత దసరా రోజున అంకిత్ జాదవ్, సుహాస్ ఠాకూర్, మిలిండ్, అమిత్ అనే నలుగురు యువకులు మద్యం మత్తులో ఓ యువతిని లైంగికంగా వేధించారు. యువతిని కాపాడేందుకు యత్నించిన వ్యక్తిపై హత్యాయత్నానికి ఒడిగట్టారు. దీనిపై బాధితులు కోర్టును ఆశ్రయించారు.

కాగా, బాధితులతో నలుగురు నిందితులు స్నేహపూర్వకమైన ఒప్పందాన్ని కుదర్చుకున్నారు. దీంతో న్యాయస్థానం కేసును కొట్టివేసింది. బాధితులతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా... ఆ నలుగురు యువకులు థానే నగరంలోని రోడ్లన్నింటినీ ప్రతిరోజూ 6నెలల పాటు పోలీసుల సమక్షంలో శుభ్రపరచాలని కోర్టు శిక్ష విధించారు.
తమకు విధించిన శిక్షపై నిందితులు మాట్లాడుతూ.. తాము తప్పు చేశామని, అందుకే శిక్ష అనుభవిస్తున్నామని తెలిపారు. ఇలాంటి తప్పు మరోసారి చేయమని.. తమకు విధించిన శిక్షను చూసి ఇంకెవ్వరూ ఇలాంటి పనులు చేయకూడదని కోరుకుంటున్నట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications