ప్రధాని మోదీతో స్టార్ హీరో కీలక భేటీ
తిరువనంతపురం: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. కేరళ పర్యటనలో ఉన్నారు. రెండు రోజుల పర్యటన కోసం సోమవారం సాయంత్రం ఆయన కేరళలోని కోచికి చేరుకున్నారు. రోడ్ షోలో పాల్గొన్నారు. సుమారు రెండు కిలోమీటర్ల మేర ఈ రోడ్ షో సాగింది. కోచిలోని శాక్ర్డ్ హార్ట్ కళాశాల గ్రౌండ్స్‌లో యువం పేరుతో నిర్వహించిన కాన్‌క్లేవ్‌కు హాజరయ్యారు. నటులు అపర్ణ బాలమురళి, నవ్య నాయర్..సహా పలువురు సెలెబ్రిటీలు ఇందులో పాల్గొన్నారు.
ఏకే ఆంటోని కుమారుడు అనిల్ ఆంటోని, బెంగళూరు దక్షిణ లోక్‌సభ సభ్యుడు, బీజేపీ యువమోర్చా జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్య, కేరళ బీజేపీ చీఫ్ కే సురేంద్రన్, రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి వీ మురళీధరన్, ప్రకాశ్ జవదేకర్, నటుడు సురేష్ గోపీ.. ప్రధానితో కలిసి వేదికను పంచుకున్నారు. గాయకులు కేఎస్ హరిశంకర్, విజయ్ ఏసుదాస్ పాటలు ఉర్రూతలూగించాయి. ఈ సందర్భంగా నవ్య నాయర్ ప్రధాని మోదీ పాదాలకు నమస్కరించారు.

ఈ కార్యక్రమం ముగిసిన తరువాత- ఉన్ని ముకుందన్ ప్రధానితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆయన బస చేసిన హోటల్‌లో ప్రత్యేకంగా కలుసుకున్నారు. ఈ సమావేశం 45 నిమిషాల పాటు కొనసాగింది. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులు, రాజకీయాల గురించి వారు మాట్లాడారు. జనతా గ్యారేజ్, భాగమతి, ఖిలాడి, యశోద సినిమాల ద్వారా తెలుగువారి పరిచితుడయ్యాడు ఉన్ని ముకుందన్. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ మాలికాపురం సూపర్ హిట్.
భారతీయ జనతా పార్టీకి కేరళలో ఉన్న బలం నామమాత్రమే. వామపక్షాలు, కాంగ్రెస్‌తో కూడిన ఎల్డీఎఫ్, యూడీఎఫ్ ఇక్కడ క్షేత్రస్థాయిలో బలంగా ఉన్నాయి. 2019 నాటి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ కనీసం ఖాతాను కూడా తెరవలేకపోయింది. మోదీ ఛరిష్మా, బీజేపీ ప్రభంజనం.. కేరళలో ఏ మాత్రం ప్రభావం చూపలేదు.
కేరళలో మొత్తం 20 లోక్‌సభ స్థానాలు ఉండగా.. కాంగ్రెస్-16, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్-2, కేరళ కాంగ్రెస్ (మురళీధరన్)-1, రివాల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ-1 స్థానాలను గెలుచుకున్నాయి. బీజేపీకి ఒక్క సీటు కూడా దక్కలేదిక్కడ. 2024 సార్వత్రిక ఎన్నికల నాటికి కేరళ లోక్‌సభ ఎన్నికల్లో పాగా వేయాలనేది బీజేపీ భావిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటి నుంచే కసరత్తు మొదలు పెట్టింది.
మాలీవుడ్‌పై దృష్టి సారించింది. మలయాళ స్టార్ హీరో సురేష్ గోపీని రాజ్యసభకు పంపించింది బీజేపీ. ఆ తరువాత కూడా పెద్దగా బీజేపీ ప్రభావం కనిపించలేదిక్కడ. దీనితో యువ హీరోలపై ఫోకస్ పెట్టింది. తాజాగా స్టార్ హీరో ఉన్ని ముకుందన్‌తో ప్రధాని మోదీ భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.












Click it and Unblock the Notifications