ఇదీ అసలు సంగతి: స్విస్‌లో కరుగుతున్న బ్లాక్ మనీ
న్యూఢిల్లీ: స్విట్జర్లాండ్ బ్యాంకుల్లో భారతీయులు దాచుకున్న నల్లధనం తగ్గుముఖం పట్టిందట.. అవును ఇది నిజమే మరి. స్విట్జర్లాండ్ జాతీయ బ్యాంకు (ఎస్ఎన్ బీ) అధికారులు స్వయంగా ఈ సంగతి బయట పెట్టారు. ఒకప్పుడు నల్ల కుబేరులకు స్వర్గధామంగా స్విట్జర్లాండ్ బ్యాంకులను భావిస్తూ వచ్చారు.
కానీ 2004లో యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక... ప్రత్యేకించి 2014లో మోదీ సర్కార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెట్టిస్తున్నారు. నల్లధనాన్ని వెలికి తీసి ప్రతి భారతీయుడి ఖాతాలో రూ.15 లక్షల నగదు జమ చేస్తామని మూడేళ్ల క్రితం ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టారాయే మరి. అదలా ఉంచితే.. నల్లధనాన్ని వెనుకకు రప్పించడం వల్ల దేశ ప్రగతికి అవసరమైన పలు ప్రాజెక్టులు చేపట్టొచ్చు.
కానీ వ్యయ ప్రయాసలకు ఓర్చి రకరకాలుగా స్విట్జర్లాండ్ లోని బ్యాంకుల్లో దాచి పెట్టుకున్న నగదు ప్రభుత్వం లాగేసుకుంటుందంటే ఎవరికైనా కడుపు మంటే మరి. గమ్మత్తేమిటో తెలుసా.. ప్రపంచవ్యాప్తంగా స్విస్ బ్యాంకుల్లో నల్లధనం దాచుకున్న విదేశీయుల్లో భారతీయులు 1996 నుంచి 2007 వరకు ముందు వరుసలోనే నిలిచారు. అనునిత్యం విమర్శలు.. మీడియా నిఘాతో గత యూపీఏ ప్రభుత్వం కూడా విదేశాలతో ద్వంద్వ పన్నుల చట్టం కింద పన్ను ఎగవేతకు పాల్పడిన వారి జాబితా పొందేందుకు కుదుర్చుకున్న ఒప్పందాలకు అనుగుణంగా దేశీయంగానూ చట్టాలు చేసింది.

ఇలా తరిగిపోతున్న భారతీయుల నిల్వలు
గతేడాది ఆఖరులో భారత ప్రభుత్వం కూడా స్విట్జర్లాండ్ సర్కార్ తో ఈ మేరకు ఎంవోయూ కుదుర్చుకున్నది. అయితే స్విట్జర్లాండ్ ఇచ్చిన జాబితా బయటపెట్టకూడదన్న షరతైతే విధించారు గానీ.. పరోక్షంగా.. అవసరమైతే అనధికారికంగా సమాచారం బయటకు తీయడం మీడియాకు వెన్నతో పెట్టిన విద్య. భారత ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకే స్విట్జర్లాండ్ సమాఖ్య మండలి.. స్వతస్సిద్ధ వెల్లడి వ్యవస్థను ఏర్పాటు చేసింది. దీని ప్రకారం భారతదేశం, స్విస్ మరో ఒప్పందం చేసుకుంటే వచ్చే ఏడాది మొదట్లో నల్ల కుబేరులైన భారతీయుల జాబితా తయారీ మొదలై 2019 సెప్టెంబర్ నాటికి కేంద్ర ప్రభుత్వం చేతికి చిక్కుతుంది. నల్ల కుబేరులంటే ఆశామాషీ వ్యక్తులేం కాదుగా.. అవసరమైతే ప్రభుత్వాలను మార్చేయగల శక్తి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం తాము అమలు చేయబోయే విధానాలను బయటపెట్టిన తర్వాత నల్ల కుబేరులు తమ జాగ్రత్తల్లో తాము ఉన్నారు. దాని ఫలితంగానే 2015తో పోలిస్తే గత ఏడాది భారతీయుల నల్లధనం సగానికి సగం తగ్గిపోయి రూ.4500 కోట్లకే పరిమితమై పోయింది.

సింగపూర్, హంకాంగ్ వైపు అందరి చూపు
ఇక్కడ ఇంకో విశేషం కూడా ఉన్నది. స్విస్ బ్యాంకుల్లో భారతీయుల నగదు తగ్గుతుంటే ఇతర దేశాల పౌరుల సొమ్ము పెరుగుతున్నది. 2016లో మొత్తం 1.41 బ్రిలియన్ల స్విస్ ఫ్రాంక్ ల నుంచి 1.42 బ్రిలియన్ల స్విస్ ఫ్రాంక్‌లకు పెరగడం గమనార్హం. మూడేండ్లుగా వరుసగా భారతీయుల నగదు నిల్వలు రికార్డు స్థాయిలో తరిగిపోయి 676 మిలియన్ల స్విస్ ఫ్రాంక్‌ల (రూ.4,500 కోట్లు)కు చేరుకున్నాయి. 2015లో 0.08 శాతంగా ఉన్న భారతీయుల డబ్బు.. గతేడాది 0.04 శాతానికి తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో భారతీయులు తమ అక్రమ సంపాదనను స్విస్ బ్యాంకుల నుంచి ఇతర దేశాల బ్యాంకులకు మళ్లించారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కానీ ఆర్థిక కేంద్రాలుగా ఉన్న సింగపూర్, హాంకాంగ్ బ్యాంకుల్లో భారతీయుల ఖాతాల్లో నిల్వలు పెరిగాయని అధికార వర్గాల కథనం. అధికారికంగా ఎస్‌ఎన్బీ ఎటువంటి ప్రకటన చేయలేదు.

రెండంకెలకు దూరంగా టాప్ టెన్ దేశాలు
స్విస్ బ్యాంకుల్లో విదేశీయులు మొత్తం 389 బిలియన్ల ఫ్రాంక్‌లు జమచేశారు. ఇందులో 25 శాతం (359 బిలియన్ల ఫ్రాంక్‌లు)తో బ్రిటన్ తొలిస్థానంలో, 14 శాతంతో (177 బిలియన్ల ఫ్రాంక్‌లు) అమెరికా రెండో స్థానంలో నిలిచాయి. అత్యధిక నల్లధనం జమచేసినవారున్న మొదటి పది దేశాల్లో వెస్టిండీస్, ఫ్రాన్స్, బహమాస్, జర్మనీ, జెర్సీ, హాంకాంగ్, లక్సెంబర్గ్ నిలిచాయి. బ్రిటన్, అమెరికా మినహా మిగతా ఎనిమిది దేశాల పౌరుల నిల్వలు మొత్తం 10 శాతం లోపే ఉండటం గమనార్హం.

క్రమంగా తగ్గిపోయిన భారత్ నిల్వలు
2004 నాటికి స్విస్ బ్యాంకుల్లో విదేశీయులు నల్లధనం జమచేసిన జాబితాలో భారత్ 37వ స్థానంలో నిలిచింది. క్రమంగా నాటి నుంచి ఏటేటా స్విస్ బ్యాంకుల్లో భారతీయుల నల్లధనం నిల్వలు తరుగుతూ వచ్చాయి. 2007 వరకు టాప్ 50 దేశాల జాబితాలో ఉన్న భారత్.. 2008 నుంచి క్రమంగా 55వ స్థానానికి.. అక్కడ నుంచి 2009తో 2014లో చివరికల్లా 61, 2015 నాటికి 75వ స్థానానికి పడిపోయింది. 1996 2007 మధ్య టాప్ 50లో కొనసాగిన భారతీయుల డిపాజిట్లు 2009, 2010లలో 59వ స్థానానికి పడిపోయాయి. 2011లో 55వ స్థానానికి పెరిగిన నల్లకుబేరుల నిల్వలు తిరిగి 2013లో 58, 2012లో 71వ స్థానానికి పడిపోయాయి. 2016 చివరికల్లా స్విస్ బ్యాంకుల్లో విదేశీయులు దాచుకున్న నల్లధనం మొత్తం 141 లక్షల కోట్ల స్విస్ ఫ్రాంక్‌ల నుంచి స్వల్పంగా 142 లక్షల కోట్ల స్విస్ ఫ్రాంక్‌లకు పెరిగింది. పాకిస్థాన్ 2015లో 71వ స్థానంలో కొనసాగుతున్నది.

ఆసియా ఖండంలో చైనా ముందు వరుస
స్విస్ ఖాతాలు గల బ్రిక్స్ దేశాల జాబితాలోనూ భారత్ దిగువనే కొనసాగుతున్నది. 15.6 బిలియన్ల ఫ్రాంక్‌లతో రష్యా 19వ స్థానం, 9.6 బిలియన్ల ఫ్రాంక్‌లతో చైనా 25, 2.7 బిలియన్లతో బ్రెజిల్ 52, 2.2 బిలియన్ల ఫ్రాంక్‌లతో దక్షిణాఫ్రికా 61 స్థానం కలిగి ఉన్నాయి. భారత్ పొరుగుదేశాల్లో బంగ్లాదేశ్ 667.5 మిలియన్ల ఫ్రాంక్‌లతో 89వ స్థానం, నేపాల్ 312 మిలియన్ల ఫ్రాంక్‌లతో 150, 307 మిలియన్ ఫ్రాంక్‌లతో శ్రీలంక 151, 50 లక్షల ఫ్రాంక్‌లతో భూటాన్ 282వ స్థానం పొందాయి. స్విస్ బ్యాంకుల్లో సంపన్న దేశాల పౌరులు దాచుకున్న మొత్తం 824 బిలియన్ల ఫ్రాంక్‌లు కాగా, అభివృద్ధి చెందుతున్న దేశాల పౌరులు కేవలం 208 మిలియన్ల ఫ్రాంక్‌లు జమచేశారు.












Click it and Unblock the Notifications