వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా సుప్రీంలో మరిన్ని పిటిషన్లు-తాజాగా ఇవే..!
తాజాగా కేంద్రం పార్లమెంట్ ఉభయసభల్లో ఆమోదించిన వక్ఫ్ చట్ట సవరణ బిల్లుల్ని సవాల్ చేస్తూ పలువురు ఎంపీలు, ప్రజాప్రతినిధులు, ముస్లిం సంస్థలు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్, ఎంఐఎం ఎంపీలు మొహమ్మద్ జావెద్, అసదుద్దీన్ ఓవైసీ సుప్రీంకోర్టులో వేర్వేరు పిటిషన్లు దాఖలు చేయగా... ఇవాళ ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ సుప్రీంకోర్టులో విడిగా ఇదే అంశంపై పిటిషన్ దాఖలు చేశారు. ఆయనతో పాటు అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ సంస్థ కూడా సుప్రీంను ఆశ్రయించింది.
కాంగ్రెస్, ఎంఐఎం తర్వాత వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన మూడో విపక్ష పార్టీగా ఆప్ నిలిచింది. ప్రస్తుతం ఈ వివాదాస్పద చట్టం పార్లమెంటు ఉభయ సభల ఆమోదం తర్వాత రాష్ట్రపతి ఆమోదం కోసం ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో వక్ఫ్ చట్ట సవరణ ముస్లింల మతపరమైన, సాంస్కృతిక స్వయంప్రతిపత్తిని తగ్గిస్తుందని ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ సుప్రీంలో దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రభుత్వ జోక్యం మైనారిటీలు తమ మతపరమైన , స్వచ్ఛంద సంస్థలను నిర్వహించే హక్కులను దెబ్బతీస్తుందని వాదించారు.

ఈ చట్టం సమానత్వ స్వేచ్ఛ, మతపరమైన వ్యవహారాల నిర్వహణ మరియు మైనారిటీల హక్కులతో సహా పౌరుల బహుళ ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తుందని ఖాన్ తన పిటిషన్లో ఆరోపించారు. అయితే కేంద్రం మాత్రం ఈ చట్టం ముస్లిం మహిళలకు ప్రయోజనం చేకూరుస్తుందని, వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో పారదర్శకతను నిర్ధారిస్తుందని తెలిపింది. ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టు త్వరలో విచారణ చేపట్టబోతోంది. ఆలోపు రాష్ట్రపతి పార్లమెంట్ ఆమోదించిన బిల్లుల్ని ఆమోదిస్తే ఏం జరుగుతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.












Click it and Unblock the Notifications