ఏపీ కంటే తెలంగాణలో పాజిటివిటీ రేటు తక్కువ: ఆ ప్రాంతాల్లో 6-8 వారాల లాక్‌డౌన్ ఉండాల్సిందే: ఐసీఎంఆర్
న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్‌లో మహమ్మారి విజృంభిస్తున్న వేళ భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) కీలక సూచనలు చేసింది. ఇప్పటికే దేశంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న రాష్ట్రాలన్నీ లాక్‌డౌన్, కర్ఫ్యూలు, ఇతర ఆంక్షలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ పలు ప్రాంతాల్లో కేసులు ఎక్కువగానే నమోదవుతూ వస్తున్నాయి.

అక్కడ 6-8 వారాలా లాక్‌డౌన్ అవసరం
ఈ నేపథ్యంలో కరోనా పాజిటివిటీ 10 శాతం కంటే ఎక్కువగా ఉన్న జిల్లాల్లో 6 నుంచి 8 వారాలపాటు లాక్‌డౌన్ అవసరమని ఐసీఎంఆర్ చీఫ్ బలరాం భార్గవ స్పష్టం చేశారు. అధిక పాజిటివిటీ రేటు ఉన్న జిల్లాల్లో పూర్తి లాక్‌డౌన్ ఉండాల్సిందేనని అన్నారు. అక్కడ పాజిటివిటీ రేటు 10 నుంచి 5 శాతానికి తగ్గితే ఆంక్షలు తగ్గించవచ్చని సూచించారు. అలా జరగాలంటే 6 నుంచి 8 వారాల లాక్‌డౌన్ అవసరమని పేర్కొన్నారు.

ఢిల్లీలో లాక్‌డౌన్‌తో సత్ఫలితాలు, కానీ..
ఢిల్లీలో విధించిన లాక్‌డౌన్ సత్ఫలితాలను ఇస్తోందని ఓ ఇంటర్వ్యూలో బలరాం భార్గవ తెలిపారు. 35 శాతంగా ఉన్న పాజిటివిటీ రేటు ప్రస్తుతం 17 శాతానికి తగ్గిందని, ఇలాంటి పరిస్థితుల్లో లాక్‌డౌన్ సడలిస్తే పరిస్థితి మరింత తీవ్రంగా మారే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు. కరోనా సెకండ్ వేవ్‌లో యువత ఎక్కువగా అనారోగ్యం పాలవుతుండటంపై ఆయన స్పందించారు.

ఏపీ కంటే తెలంగాణలో పాజిటివిటీ రేటు తక్కువే.. గోవా టాప్
ఇక దేశ వ్యాప్తంగా పాజిటివిటీ రేటు 21 శాతం ఉన్నట్లు ఐసీఎంఆర్ చీఫ్ తెలిపారు. దేశంలోని 718 జిల్లాల్లో దాదాపు 310 జిల్లాల్లో దేశ పాజిటివిటీ రేటు సరాసరి(21శాతం) కంటే ఎక్కువగా ఉందని, మూడో వంతు జిల్లాల్లో 10శాతం కంటే ఎక్కువగా పాజిటివిటీ రేటు ఉందన్నారు. గోవాలో అత్యధికంగా దాదాపు 48 శాతం పాజిటివిటీ రేటు ఉందని, ఆ తర్వాత హర్యానాలో 37 శాతం, హిమాచల్ ప్రదేశ్, నాగాలాండ్‌లోపాజిటివిటీ రేటు ఇప్పుడిప్పుడే పెరుగుతోందన్నారు. గోవా తర్వాత పుదుచ్చేరి, పశ్చిమబెంగాల్, హర్యానా, కర్ణాటక రాష్ట్రాల్లో పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉందన్నారు. ఇక తెలంగాణలో పాజిటివిటీ రేటు 9 శాతం ఉండగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 23 శాతంగా ఉందని వివరించారు.

సెకండ్ వేవ్‌లో యువతపైనే కరోనా ఫోకస్.. ఎందుకంటే..
యువత ఎక్కువగా బయట తిరుగుతుండటంతో కరోనా బారినపడుతున్నారని ఆయన తెలిపారు. అంతేగాక, దేశంలో విస్తరిస్తున్న కరోనా కొత్త వేరియంట్లు కూడా ఇందుకు మరో కారణమని భార్గవ తెలిపారు. 2020లో వచ్చిన కరోనా తొలి వేవ్‌లో వచ్చిన కేసుల్లో 31 శాతం మంది 30ఏళ్లలోపు వారుండగా, ఇప్పుడు అది 32శాతానికి చేరిందన్నారు. దేశంలో గత కొద్ది రోజులుగా 3 లక్షలకుపైగా కరోనా కేసులు, 4వేలకుపైగా మరణాలు సంభవిస్తున్న విషయం తెలిసిందే. లాక్‌డౌన్, ఆంక్షల అంశాన్ని కేంద్రం రాష్ట్రాలకే వదిలేసింది. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేసింది. దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించే పరిస్థితి లేదని తేల్చి చెప్పింది.












Click it and Unblock the Notifications