ఓటమి కాదు, ఆత్మహత్యే: బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్య
న్యూఢిల్లీ: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమిపై ఆ పార్టీ నేతలు వరుసగా విమర్శలు చేస్తూనే ఉన్నారు. హుకుందేవ్ నారాయణ యాదవ్, శత్రుఘ్న సిన్హా లాంటి సీనియర్ నేతల తర్వాత ఈ జాబితాలో బీహార్‌లోని బెగుసరాయి ఎంపీ భోలా సింగ్ చేరిపోయారు.
బీహార్‌లో బీజేపీ పార్టీ ఓటమి పరాజయం మాత్రమే కాదని అది ఆత్మహత్యేనంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఓటమికి ప్రధాని నరేంద్రమోడీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షా బాధ్యత వహించాలని అన్నారు.

మంగళవారం మీడియాతో మాట్లాడిన భోలా సింగ్ ‘‘అది అపజయం కాదు, ముమ్మాటికి పార్టీ తనకు తాను చేసుకున్న ఆత్మహత్యే. ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ సహా తమ పార్టీ నేతలు అతిగా స్పందించారు. అనవసర విషయాలను ప్రస్తావించారు. గోవు, పాకిస్థాన్ తదితర అంశాలను మా నేతలు అనవసరంగా ప్రస్తావించారు'' అని వ్యాఖ్యానించారు.
2005లో నితీశ్ కుమార్ మంత్రి వర్గంలో భోలా సింగ్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పని చేశారు. నీళ్లు లేకపోయినా బీహార్‌లో బీజేపీ బోటు మునిగి పోయిందని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రచారంలో భాగంగా బీజేపీ మాటల దాడులను నితీశ్ కుమార్ సారథ్యంలోని మహాకూటమి సరైన రీతిలో సమాధానమిచ్చిందని కొనియాడారు.












Click it and Unblock the Notifications