'నేనే డిప్యూటీ సీఎం' అన్న సహాని! మహాకూటమిలో తేజస్వితో సీట్ల పంచాయితీ!!
Bihar Election 2025: బీహార్ అసెంబ్లీ ఎన్నికలు 2025 తేదీలను నేడు(అక్టోబర్ 6) సాయంత్రం 4 గంటలకు ఎన్నికల సంఘం(ఈసీ) ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష మహాకూటమిలో సీట్ల పంపకాల ప్రక్రియ వేగవంతమైంది. సీట్ల పంపకంపై చర్చించేందుకు ఆదివారం(అక్టోబర్ 5) మహాకూటమి నేతలు కీలక సమావేశం నిర్వహించారు.
నేనే డిప్యూటీ సీఎం అవుతా: ముఖేష్ సహాని
ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ నివాసంలో జరిగిన ఈ సమావేశం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమై రాత్రి 11 గంటల వరకు దాదాపు 5 గంటల పాటు కొనసాగింది. ఈ సమావేశం అనంతరం వికాస్‌శీల్ ఇన్‌సాన్ పార్టీ(VIP) అధినేత ముఖేష్ సహాని మీడియా ముందుకొచ్చి కీలక వ్యాఖ్యలు చేశారు. "డిప్యూటీ సీఎం ఎవరు అవుతారు?" అని విలేకరులు ముఖేష్ సహానిని అడగగా.. ఆయన ఏ మాత్రం తడబడకుండా.. "ఇది కూడా చెప్పాలా? శుభం పలకండి! మాదే ప్రభుత్వం ఏర్పడుతుంది, నేనే డిప్యూటీ సీఎం అవుతాను" అని ధీమా వ్యక్తం చేశారు.

రెండు రోజుల్లో సీట్ల వివరాలు
ముఖేష్ సహాని మాట్లాడుతూ.. ఈ రోజు(అక్టోబర్ 6) కూడా కూటమి భాగస్వామ్య పక్షాలతో సమావేశం ఉంటుందని.. అందులో పూర్తిస్థాయిలో చర్చిస్తామని వెల్లడించారు. " రెండు రోజుల్లో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి సీట్ల పంపకం, అభ్యర్థుల గురించి అధికారిక ప్రకటన చేస్తాం. ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది. ఏ స్థానం ఎవరి ఖాతాలో పోతుందనే పూర్తి వివరాలు మీడియాకు అందిస్తాం. "అని ముఖేష్ సహాని ప్రకటించారు.
స్పందించిన ఇతర నేతలు
తేజస్వి యాదవ్ నివాసంలో జరిగిన ఈ సమావేశంలో ఆర్జేడీ తరఫున తేజస్వి యాదవ్, ఎంపీ సంజయ్ యాదవ్.. కాంగ్రెస్ తరఫున రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్ రామ్, కృష్ణ అల్లవరూ.. వీఐపీ నుంచి ముఖేష్ సహాని, వామపక్షాల తరఫున పలువురు నేతలు పాల్గొన్నారు. సమావేశం ముగిసిన అనంతరం కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్ రామ్ సహాని వ్యాఖ్యలపై స్పందిస్తూ.. "అవన్నీ అంతర్గత విషయాలు. ముందు ముందు నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడే ఒక నిర్ణయానికి రావడం తొందరపాటు అవుతుంది" అని అన్నారు.
మరోవైపు వామపక్ష నేత అజయ్ కుమార్ మహాకూటమిలో సీట్ల పంపకం దాదాపుగా ఖరారైందని ధీమా వ్యక్తం చేశారు. అక్టోబర్ 7న ఎప్పుడైనా సీట్ల అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని తెలిపారు. సీపీఐ(ఎం) నేత లాలన్ చౌదరి స్పందిస్తూ.. తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉంటారనే విషయంపై అన్ని పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదిరిందని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications