భారత్‌కు సరికొత్త ఆర్థిక శకం- రాబోయే 25 ఏళ్లలో దేదీప్యమాన భవష్యత్తు..!
భారతదేశం ఆర్థిక ప్రగతి రథంపై దూసుకుపోతోంది. ప్రపంచ దేశాలన్నీ ఆశ్చర్యంగా చూస్తుండగా, ఆర్థిక శక్తిగా అవతరించేందుకు సిద్ధమవుతోంది. ఈ చారిత్రాత్మక సమయంలో, ముంబై నగరంలో జరిగిన ఇండియా గ్లోబల్ ఫోరం 'NXT25' సదస్సు ప్రపంచ పెట్టుబడిదారులను ఒకే వేదికపైకి తెచ్చింది. భారతదేశపు పెట్టుబడి స్వర్ణావకాశాలు, ఆర్థిక సంస్కరణల జోరు, వ్యూహాత్మక భాగస్వామ్యాల పటిష్టత... ఇవన్నీ కలిసి రాబోయే 25 ఏళ్లలో భారతదేశాన్ని సంపద సృష్టికి, ప్రపంచ ఆర్థిక విస్తరణకు తిరుగులేని గమ్యంగా ఎలా మారుస్తాయో నిపుణులు మేధోమథనం చేశారు. ఈ సదస్సు యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది.
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) మేనేజింగ్ డైరెక్టర్ మరియు CEO ఆశిష్ చౌహాన్ ముఖాముఖిలో భవిష్యత్తు సంపదపై సంచలన విషయాలు వెల్లడించారు. స్టాక్ మార్కెట్ లిస్టింగ్‌ల ప్రాముఖ్యతను, పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచే మార్గాలను, భారతదేశ నియంత్రణల పటిష్టతను ఆయన తనదైన శైలిలో వివరించారు. అమెరికాతో పోలిస్తే భారతీయ లిస్టింగ్ నిబంధనలపై ఆయన చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆలోచింపజేశాయి. "భవిష్యత్తులో 80 శాతం సంపద కంటికి కనిపించని రూపంలోనే ఉంటుంది. అనుభవమే అసలైన సంపదగా మారుతుంది. దానికి వెల కట్టడం సాధ్యం కాదు" అని ఆయన చెప్పడంతో సభికులు ఆశ్చర్యపోయారు. భవిష్యత్తు ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండబోతుందో ఆయన మాటలు కళ్ళకు కట్టాయి.

ప్రపంచ వాణిజ్య యుద్ధాలు ముగిశాయంటూ సోరిన్ ఇన్వెస్ట్‌మెంట్స్ వ్యవస్థాపకుడు సంజయ్ నాయర్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి."సుంకాలను అడ్డుపెట్టుకుని వ్యాపారం చేయడం ఇకపై కుదరదన్న ఆయన...ప్రైవేట్ కంపెనీలు కొత్త వ్యూహాలు రచించాలని పిలుపునిచ్చారు.తమ సరఫరా వ్యవస్థలను ప్రక్షాళన చేసుకోవాలని, ప్రపంచ మార్కెట్లను జయించేందుకు సిద్ధం కావాలన్నారు. పెద్ద, సమర్థవంతమైన వ్యాపారాలుగా ఎదగాలని చెప్పిన సంజయ్ నాయర్...పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమివ్వాలన్నారు.అప్పుడే ఎగుమతులు సాధ్యమవుతాయని స్పష్టం చేశారు. ఈ సంక్షోభంలోనే పెట్టుబడిదారులకు అసలైన అవకాశం ఉందని ఆయన ఉద్ఘాటించారు.
మార్కెట్ హెచ్చుతగ్గులపై నువామా క్యాపిటల్ మార్కెట్స్ ప్రెసిడెంట్ & హెడ్ శివ్ సెహగల్ ఆసక్తికర విశ్లేషణ చేశారు. "గతంలో అధిక లాభాలు, తక్కువ నష్టాలు ఉండేవి. కానీ ఇప్పుడు సీన్ మారింది. తక్కువ లాభాలు, ఎక్కువ నష్టాలు ఉండే రోజులు వచ్చాయి. మార్కెట్ ఎప్పుడూ ఒకేలా ఉండదు. మంచి వార్తలు, మంచి ధరలు ఒకేసారి రావు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి.. అతి త్వరలోనే భారత్ 'వికసిత్ భారత్' కలను నిజం చేసేందుకు దూసుకుపోతుంది" అని ఆయన భవిష్యత్తుపై ధీమా వ్యక్తం చేశారు.
భారతీయ స్టార్టప్‌ల కొత్త ట్రెండ్‌పై నూన్ గ్రూప్ సీఈఓ ఫరాజ్ ఖలీద్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. "చిన్న వస్తువుల వ్యాపారం కాదు.. పెద్ద సమస్యలను పరిష్కరించే స్టార్టప్‌లు రావాలి.డీప్ టెక్నాలజీ, సరికొత్త ఆవిష్కరణలపై దృష్టి పెట్టాలి. AI టెక్నాలజీతో అద్భుతాలు సృష్టించవచ్చు. కస్టమర్లను అర్థం చేసుకున్నవారికే విజయం వరిస్తుంది" అని ఆయన యువ పారిశ్రామికవేత్తలకు దిశానిర్దేశం చేశారు.
టైటాన్ క్యాపిటల్ మరియు స్నాప్‌డీల్ సహ వ్యవస్థాపకుడు కునాల్ బహ్ల్ మాట్లాడుతూ, "భారతదేశం విభిన్న వ్యాపారాలకు నిలయం. చిన్న, పెద్ద తేడా లేకుండా అన్నింటినీ ప్రోత్సహించాలి. కానీ మనం మరింత పెద్ద లక్ష్యాలు పెట్టుకోవాలి. పర్యావరణ వ్యవస్థను విస్తరించాలి. డీప్ టెక్నాలజీ ఆవిష్కరణలకు సమయం పడుతుంది. ఓపికతో ప్రయత్నిస్తే అద్భుతాలు సాధించవచ్చు" అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
NXT25 సదస్సు కేవలం సమావేశం కాదు.. ఇది భారతదేశ భవిష్యత్తును నిర్దేశించే వేదిక.ప్రపంచ వ్యాపార దిగ్గజాలు,ప్రభుత్వ విధానకర్తలు,పెట్టుబడిదారులు,టెక్నాలజీ నిపుణులు ఒకచోట చేరి భారతదేశం యొక్క సరికొత్త ప్రయాణానికి బాటలు వేశారు.పెట్టుబడులు,టెక్నాలజీ,పర్యావరణం,ఆవిష్కరణలు.. ఈ నాలుగు పిల్లర్స్‌పై భారతదేశం ప్రపంచ శక్తిగా ఎదగడం ఖాయం. ఈ సదస్సు ముంబైలో ముగిసినా, భారతదేశ ఆర్థిక విజయం కథ ఇప్పుడే మొదలైందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇండియా గ్లోబల్ ఫోరం గురించి:
ఇండియా గ్లోబల్ ఫోరం ఆధునిక భారతదేశ చరిత్ర గురించి తెలుపుతుంది.మార్పు వృద్ధి అనే రెండు అంశాలపై భారత్ ఎంత వేగంగా దూసుకెళుతోందో తెలుసుకునేందుకు ప్రపంచ దేశాలకు ఒక చక్కటి అవకాశం అని చెప్పొచ్చు.ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునే దిశగా వాణిజ్యం- దేశాలు ముందడుగు వేయడానికి IGF ఒక వారధిలా నిలుస్తుంది.












Click it and Unblock the Notifications