ట్రైన్ లో యువతిని వేధించిన కామాంధుడు..కిందకు తోసేయ్యడంతో..
ముంబై లోకల్ ట్రైన్ లో షాకింగ్ ఘటన జరిగింది. ఓ యువతిపై తోటి ప్రయాణికుడు దారుణానికి ఒడిగట్టాడు. తొలుత ఆమెపై అసభ్యంగా ప్రవర్తిస్తూ వేధించిన కామాంధుడు.. ఆ తర్వాత ఆ యువతిని ఏకంగా రైలు నుంచి కిందకు నెట్టేశాడు. దాంతో ఆమె చేయి నలిగిపోయి నుజ్జు నుజ్జు అయింది. అంతేకాక తలకు 16 కుట్లు పడ్డాయి. ఈ ఘటన నేపథ్యంలో నిందితుడు 53 ఏళ్ల జితేంద్ర హిర్ముఖేను రైల్వే పోలీసులు కొన్ని గంటల్లోనే అరెస్ట్ చేశారు. అయితే నిందితుడిపై హత్యాయత్నం సెక్షన్ 109 కింద కేసు నమోదు చేయకపోవడంపై బాధితురాలి కుటుంబం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో నిత్యం లక్షలాది మంది రైలు ప్రయాణం చేస్తుంటారు. ఈ క్రమంలో నగరంలో మహిళల భద్రతపై ప్రశ్నలు తలెత్తేలా షాకింగ్ ఘటన జరిగింది. ఈ ఘటన ముంబైలోని బోరివలి నుంచి విరార్ కు వెళ్లే ట్రైన్ లో చోటు చేసుకుంది. రైలులో బాగా రద్దీ ఉన్న కారణంగా 20 ఏళ్ల యువతి దివ్యాంగుల కోచ్ లోకి ఎక్కింది. అయితే నైగావ్ ఈస్ట్ కు చెందిన 53 ఏళ్ల జితేంద్ర హిర్ముఖే అనే ప్రయాణికుడు ఆమెను పదేపదే అసభ్యంగా తాకడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం నెలకొంది. అయితే వీరి గొడవ విన్న తోటి ప్రయాణికులు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఎంతకూ వినని నిందితుడు.. బూతులు తిడుతూ తన చెప్పుతో యువతిపై దాడికి పాల్పడ్డాడు.

ఈ క్రమంలో కోపంతో ఊగిపోయిన జితేంద్ర.. యువతిని బలంగా రైలు నుంచి బయటకు తోసేశాడు. దీంతో ఆమె ప్లాట్ ఫామ్, రెండు కోచ్ ల మధ్య ఉన్న ఖాళీ స్థలంలో పడిపోయింది. దాంతో ఆమె చేయి నుజ్జునుజ్జుగా తెగిపోయింది. అక్కడే ఉన్న ఓ పోలీసు అధికారి, తోటి ప్రయాణికులు వెంటనే స్పందించి ఆమెను పైకి లాగి ఆసుపత్రికి తరలించారు. మరోవైపు నిందితుడిపై హత్యాయత్నం సెక్షన్ 109 కింద కేసు నమోదు చేయకపోవడంపై బాధితురాలి కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మహారాష్ట్ర నవ నిర్మాణ సేన నేతల సాయంతో జీఆర్పీ పోలీస్ సీనియర్ ఇన్ స్పెక్టర్ ను కలిసి వినతిపత్రం అందించారు. ఈ మేరకు త్వరలోనే నిందితుడిపై కేసు నమోదు చేస్తామని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications
