నా కుమార్తె పోల్ డ్యాన్సర్ అవ్వొచ్చు, డాక్టర్‌ని మాత్రం కానివ్వను: బ్లాగులో కేరళ డాక్టర్
కొచ్చి: తన కుమార్తె బార్‌లో పోల్ డ్యాన్సర్ వృత్తిని ఎంచుకున్నా అంగీకరిస్తానే తప్ప భారత్‌లో వైద్య వృత్తిని మాత్రం స్వీకరించనీయబోనని కేరళలోని ఓ ఆసుపత్రిలో అనస్ధీషియాలజిస్ట్‌గా పనిచేస్తోన్న డాక్టర్ రోషన్ రాధాకృష్ణన్ తన బ్లాగులో పోస్ట్ చేశారు.
తాను ఈ విధంగా మాట్లాడడానికి గల కారణాలను కూడా వెల్లడించారు. మే 15న ఆయన ఈ పోస్టుని తన బ్లాగులో పోస్టు పెట్టగా, ఇప్పటికే ఈ పోస్టుకి 20 వేలకు పైగా షేర్స్, 130 కామెంట్లు వచ్చాయి. ఈ పోస్టుపై చర్చకు తెరతీస్తూ 'రెడ్డిట్ ధ్రెడ్' కూడా ప్రారంభమైంది.
ఈ లింక్‌పై క్లిక్ చేసి 'రెడ్డిట్ ధ్రెడ్' ను చదవండి

తన బ్లాగులో "భారత్‌లో డాక్టరు వృత్తి అంటే కుటుంబ జీవితాన్ని కోల్పోయినట్టే. కేటాయించిన పని గంటల కంటే ఎక్కువగా పని చేయాలి. చాలినంత వేతనాలుండవు. ఇంట్లో సుఖ సంతోషాలు కొరవడతాయి. రోగుల మరణాలను ఆపాల్సిన డాక్టర్లు ఇప్పుడు వారి బంధువుల చేతుల్లో చావకుండా తప్పించుకునే మార్గాలు వెతకాల్సిన పరిస్ధితి ఉంది. వృత్తి కోసం ప్రాణాలను తీసుకుంటామా?" అని పోస్టు చేశారు.
అంతే కాదు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ గణాంకాల ప్రకారం 2015లో భారత్‌లో వైద్య వృత్తిలో ఉన్నవారిలో 75 శాతం మంది ఏదో ఒక విధంగా రోగులు, వారి బంధువుల నుంచి హింసను ఎదుర్కొన్నవారేనని పేర్కొన్నారు.
"ఎన్నో అవకాశాలున్నాయి. నీకు కావాలంటే మతం కూడా మార్చుకోవచ్చు. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్‌గా మారి అమెజాన్ అడవుల్లో తిరగొచ్చు లేదా లాస్ వెగాస్‌లోని బార్లలో పోల్ డ్యాన్సర్‌గా మారొచ్చు. కానీ, నిన్ను భారత్‌లో వైద్య వృత్తిని మాత్రం చేపట్టనివ్వను. ఎందుకంటే గత 20 ఏళ్లుగా నిన్ను పెంచింది నీ ఓటమిని చూసేందుకు కాదు" అంటూ రాధాకృష్ణన్ తన బ్లాగులో రాశారు. అంతే కాదు ఇతర డాక్టర్లు కూడా వైద్య వృత్తిలో ఎదుర్కొన్న అనుభవాలు, భారత్ ఎందుకు తప్పుగా వెళుతుందో చెప్పాలని కోరారు.












Click it and Unblock the Notifications