కోల్‌కతాలో ర్యాలీ: నరేంద్ర మోడీ బెంగాలీ స్పీచ్ అదుర్స్
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్‌కతాలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ భారీ బహిరంగ సభను నిర్వహించారు. బుధవారం నిర్వహించిన ఈ సభలో కాసేపు బెంగాళీ భాషలో ప్రసంగించిన మోడీ, సభికులను విశేషంగా ఆకట్టుకున్నారు. మోడీ సభకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని ప్రజలు భారీగా తరలివచ్చారు.
కోల్‌కతా నగరంలో ఎన్నో సభలు, సమావేశాలు జరిగాయని, కానీ ఇంత పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావడం తాను ముందెన్నడూ చూడలేదని నరేంద్ర మోడీ అన్నారు. ఈ సందర్భంగా భారతదేశ చరిత్రలో బెంగాల్ ప్రాధాన్యతను ఆయన గుర్తు చేశారు. దేశం అగ్రస్థానంలో ఉండాలంటే బెంగాలీల పాత్ర కీలకమన్నారు. ప్రపంచంలోనే భారత్ అగ్రస్థానంలో ఉండాలన్నది స్వామి వివేకానందుడి ఆకాంక్ష అని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బెంగాల్ దేశానికి మార్గనిర్దేశనం చేయాలని సూచించారు.

ప్రముఖ కవి, రచయిత రవీంద్రనాథ్ ఠాగూర్ సోదరుడు గుజరాత్ రాష్ట్రంలో చాలా కాలంపాటు నివసించారని, రాష్ట్రానికి విశేష సేవలందించారని చెప్పారు. స్వాతంత్ర్య సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ సోదరుడు జౌళి పరిశ్రమకు అందించిన సేవలు మరువలేనివని మోడీ పేర్కొన్నారు. బెంగాలీయులకు, గుజరాత్‌కు ఉన్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని దేశ ప్రధాని కాకుండా గాంధీ కుటుంబం అడ్డుకుందని మోడీ ఆరోపించారు.
రెండుసార్లు ఆయనకు ప్రధానమంత్రి పదవి లభించాల్సి ఉండగా గాంధీ కుటుంబం ఆయనకు ఆ అవకాశాన్ని ఇవ్వలేదని అన్నారు. ప్రణబ్ ముఖర్జీ ప్రధాని అయితే దేశం బాగుండేదని, ఆయనకు జరిగిన అన్యాయాన్ని బెంగాలీ ప్రజలు మరవకూడదని అన్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వంపై మోడీ రాజనీతిని ప్రదర్శిస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. బెంగాల్ అభివృద్ధి ఒక్క రాష్ట్ర ప్రభుత్వంతోనే కాదని, కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా కావాలని చెప్పారు.
మార్పు కోసం మీరు ఓటేస్తే నిజంగా మార్పు జరిగిందా అని మమతా ప్రభుత్వాన్ని ఉద్దేశించి ప్రజలను ప్రశ్నించారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో బిజెపి అధికారంలోకి వస్తుందని అన్నారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం, రాష్ట్రంలో తృణముల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏది మంచిదో మీకే తెలుస్తుందని మోడీ అన్నారు. బెంగాల్‌లోని అన్ని లోక్‌సభ స్థానాల్లో బిజెపి పోటీ చేస్తుందని తెలిపారు. బెంగాల్ ప్రజలు బిజెపికి ఒక్క అవకాశం ఇవ్వాలని 60 ఏళ్లలో జరగని అభివృద్ధిని చేసి చూపిస్తామని అన్నారు.












Click it and Unblock the Notifications