హుధుద్: మోడీ, జగన్, కేసీఆర్.. అందర్నీ కదిలించింది!
హైదరాబాద్: హుధుద్ ఆంధ్రప్రదేశ్‌లో పెను నష్టాన్ని కలిగించింది. ముఖ్యంగా విశాఖలో ఎటు చూసినా విధ్వంసం కనిపించింది. హుధుద్ నుండి తేరుకోవడానికి ఏపీకి మరికొద్ది రోజులు పట్టనుంది. హుధుద్ తుఫాను నేపథ్యంలో ప్రభుత్వం వేలాది మందిని పునరావాస కేంద్రాలకు తరలించింది.
వారికి ఆహారం, నీరు అన్నింటిని ఏర్పాటు చేసింది. అయినా, చాలాచోట్ల బాధితులకు అందక అవస్థలు పడుతున్నారు. పాల ధర, పెట్రోలు ధర.. ఇలా అన్నింటి ధరలు భారీగా పెరిగాయి. రెండు రోజులుగా ప్రాణాలు అర చేతిలో పెట్టుకుని క్షణాలు నెట్టుకొచ్చిన విశాఖ ప్రజలు ఇప్పుడిప్పుడే బయటకొస్తున్నారు.
తుపాను బీభత్సానికి తమ ఇళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీస వసతులు లేకపోవడంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ, విద్యుత్ రంగాలకు తీరని నష్టం జరగింది. గుక్కెడు మంచినీళ్లు కూడా ఎక్కడా దొరకడం లేదని ప్రజలు వాపోతున్నారు. నగరంలో కొన్ని కార్ల షో రూం నుంచి కార్లు క్రింద పడిపోయాయి.

కాగా, ఉత్తరాంధ్రను హుధుద్ వణికించిన నేపథ్యంలో రాజకీయ నాయకులు క్యూ కట్టనున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిస్థితిని దగ్గర ఉండి సమీక్షిస్తున్నారు. పరిస్థితి పూర్తిగా బాగుపడే వరకు తాను విశాఖలోనే ఉంటానని చెప్పారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి కూడా మంగళవారం విశాఖకు చేరుకుంటారు. ఆయన కూడా తుఫాను సహాయ కార్యక్రమాలు ముగిసే వరకు ఉత్తరాంధ్రలోనే ఉండనున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఇప్పటికే ఏపీకి సహాయం చేసేందుకు సిద్ధమని ప్రకటించిన విషయం తెలిసిందే.
మరోవైపు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా మంగళవారం ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు. మంగళవారం ఉదయం పది గంటలకు ఆయన ప్రత్యేక విమానంలో విశాఖపట్నం వెళ్త్తున్నారు. విశాఖపట్నం చేరుకున్న వెంటనే మోడీ చంద్రబాబుతో కలిసి ఏరియల్ సర్వే చేస్తారు. హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా ప్రధాని వెంట ఉండనున్నారు.












Click it and Unblock the Notifications