అక్టోబర్ 2 నుంచి జాతీయ ఆరోగ్య బీమా పథకం అమలు
న్యూఢిల్లీ: బడ్జెట్ సందర్భంగా ప్రకటించిన జాతీయ ఆరోగ్య బీమా పథకాన్ని ఈ ఏడాది అక్టోబర్ 2 నుంచి అమల్లోకి తీసుకురానున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇందు కోసం ఏటా రూ.10వేల కోట్ల నుంచి రూ.12వేల కోట్ల వరకు ఖర్చయ్యే అవకాశం ఉన్నట్లు నీతిఆయోగ్ అధికారి ఒకరు తెలిపారు.
ఈ పథకం కింద ఒక్కో కుటుంబానికి దాదాపు రూ.వెయ్యి నుంచి రూ.1200 వరకు ప్రీమియం ఉంటుందని ఆయన వెల్లడించారు. ఇది పూర్తిగా నగదు రహితమని కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ శుక్రవారం ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయం తెలిసిందే. కాగా, ఈ పథకం అమలు సవాలుతో కూడుకున్నది.

ఈ బీమా పథకం రాష్ట్రాల్లోని పలు ఆసుపత్రులు, ఎంపిక చేసిన ప్రైవేటు ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంటుంది. ఇందుకోసం అయ్యే ఖర్చును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40గా పంచుకుంటాయి. గురువారం బడ్జెట్ ప్రసంగంలో చెప్పినట్లుగానే.. ఆరోగ్య రక్ష పథకం వైద్య ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుందని జైట్లీ తెలిపారు.
జాతీయ ఆరోగ్య పరిరక్షణ పథకం కింద చికిత్స పొందడానికి చేరిన కుటుంబానికి రూ.5లక్షల వరకూ బీమా కల్పించడం జరుగుతుంది. దీని వల్ల 50కోట్ల మంది లబ్ధి పొందనున్నారు. ప్రపంచంలో ప్రభుత్వ నిధులతో నడిచే ఆరోగ్య పథకాల్లో ఇదే అతిపెద్దది కాబోతోంది.












Click it and Unblock the Notifications