దారుణం: వాపు తగ్గలేదని అమ్మాయి చెయ్యి నరికిన డాక్టర్
పాట్నా: బీహార్‌లోని నవాడా జిల్లా కేంద్రంలో దారుణ ఘటన జరిగింది. చేతి వాపు ఎంతకీ తగ్గకపోవడంతో ఏకంగా బాలిక చేతినే నరికేశాడు ఓ వైద్యుడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం కలిగించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విష్ణుపూర్ గ్రామానికి చెందిన నాలుగేండ్ల చిన్నారి ఆంచల్కుమారికి నెల కిందట చేయి విరిగింది.
చికిత్సకోసం నవడాలోని డాక్టర్ అరవింద్‌కుమార్ ఆస్పత్రిలో చేరారు. అయితే ఎన్ని కట్లు వేసినా, రకరకాల మందులిచ్చినా బాలిక ఆంచల్ చేతి వాపు తగ్గకపోవడంతో తల్లిదండ్రులకు సమాచారం అందించకుండానే వైద్యుడు ఏకంగా చిన్నారి ఎడమ చేతిని తొలగించేశాడు.
బాలిక బంధువులు కలెక్టరేట్ ఆందోళన నిర్వహించారు. నిందిత వైద్యుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తీవ్ర ఆగ్రహానికి, ఆవేదనకు గురైన కుటుంబసభ్యులు పోలీసుల్ని ఆశ్రయించారు. కేసు నమోదుచేసుకుని, విచారణ కోసం మెడికల్ బోర్డును నియమించినట్లు ఎస్పీ పర్వేజ్ అఖ్తర్ తెలిపారు.
నిందిత వైద్యుడు చికిత్స అందించడంతో తీవ్ర నిర్లక్ష్యం వహించాడని జిల్లా సివిల్ సర్జన్ మాధేశ్వర్ ప్రసాద్ తెలిపారు. ప్రస్తుతం బాధిత బాలికకు సదర్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు ఆయన తెలిపారు.