మహారాష్ట్రలో బీజేపీకి పవార్ల షాక్..! విలీనానికి ముహుర్తం-కొత్త బాస్ గా ?
మహారాష్ట్రలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఆకస్మిక మరణంతో మహాయుతి కూటమికి నేతృత్వం వహిస్తున్న బీజేపీకి ఓ షాక్ తగలింది. అయితే ఇప్పుడు ఆయన మరణం తర్వాత ఎన్సీపీలో (ncp) రెండు గ్రూపులు కలిసిపోవాలని తీసుకున్న నిర్ణయం మరో షాకిచ్చింది. ఓవైపు అజిత్ పవార్ ఇప్పటివరకూ నిర్వహిస్తున్న మంత్రిత్వ శాఖలు తమకు ఇవ్వాలంటూ ఎన్సీపీ మంత్రులు సీఎం ఫడ్నవీస్ ను కోరారు. అదే సమయంలో ఎన్సీపీలో రెండు గ్రూపులు కలిసిపోయేందుకు ముహుర్తం ఖరారైంది.
గతంలో 2023లో శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీని చీల్చి బీజేపీ-శివసేనతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన అజిత్ పవార్ .. గతేడాది జరిగిన ఎన్నికల్లోనూ చీలిక వర్గంతోనే ఎన్నికలకు వెళ్లి గెలిచారు. అయితే ఆయన తాజాగా బారామతిలో జరిగిన విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం, అంతకు ముందే స్ధానిక సంస్ధల ఎన్నికల కోసం తన బాబాయ్ శరద్ పవార్ తో విలీనం కోసం మంతనాలు జరపడం వంటి కారణాలతో ఇప్పుడు పార్టీలో రెండు గ్రూపులు కలిసిపోయేందుకు మార్గం సుగమమైంది.

అజిత్ పవార్ మరణం తర్వాత ఆయన భార్య సునేత్రా పవార్ ను పరామర్శించేందుకు వచ్చిన ఎన్సీపీ శరద్ పవార్ వర్గం నేతలు విలీనానికి ప్రతిపాదించడం, ఆమె కూడా ఓకే చెప్పేయడంతో త్వరలోనే విలీన ప్రక్రియను ప్రారంభించనున్నారు. మహారాష్ట్రలో వచ్చే నెలలో స్ధానిక సంస్ధల ఎన్నికలు ముగిశాక రెండు గ్రూపులు విలీనం చేసుకోవాలని నిర్ణయించాయి. అలాగే ఎన్సీపీకి అధినేతగా ఎవరుండాలనే దానిపైనా చర్చలు జరుగుతున్నాయి. ఇందులో అజిత్ భార్య సునేత్రా పవార్ తో పాటు శరద్ పవార్ కూతురు సుప్రియా సూలే, సీనియర్ నేత ప్రఫుల్ పటేల్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. త్వరలో వీరిలో ఒకరికి పగ్గాలు అప్పగించబోతున్నారు.












Click it and Unblock the Notifications