నీట్ యూజీ-2025లో 99.99 శాతం.. కానీ ఆ ఒక్క కారణంతో సూసైడ్ !!
నీట్ యూజీ-2025లో 99.99 శాతం మార్కులు సాధించి.. జాతీయ స్థాయిలో 1475వ ర్యాంకు పొందిన 19 ఏళ్ల ప్రతిభావంతుడైన విద్యార్థి కాలేజీ అడ్మిషన్ రోజే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో చోటు చేసుకోగా దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
టాప్ ర్యాంక్ సాధించిన విద్యార్థి..
ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చంద్రాపూర్ జిల్లా సందేవాహి తాలూకాలోని నవర్‌గావ్ ప్రాంతానికి చెందిన అనురాగ్ అనిల్ బోర్కర్ (19) చిన్నప్పటి నుంచే చదువులో అగ్రగామిగా నిలిచాడు. కష్టపడి చదివి నీట్‌లో అద్భుతమైన ఫలితాలు సాధించాడు. కుటుంబం, బంధువులు, స్నేహితులు అందరూ అతడు ఒక మంచి వైద్యుడిగా ఎదుగుతాడని ఆశలు పెట్టుకున్నారు. సాధించిన ర్యాంక్ ఆధారంగా అతనికి ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ కోర్సులో ప్రవేశం దక్కింది.

అడ్మిషన్ రోజే దారుణ నిర్ణయం..
కుటుంబం మెడికల్ కాలేజీకి వెళ్లేందుకు సన్నాహాలు చేస్తుండగా.. అనురాగ్ తన ఇంట్లోనే ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు. డాక్టర్‌గా మారతాడని కలలు కన్న తల్లిదండ్రులకు ఇది మోకాళ్ల మీద పడ్డ దెబ్బలాంటిది. ఒక్కసారిగా కుమారుడి మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
సూసైడ్ నోట్‌లోని వివరాలు..
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అనురాగ్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అక్కడ ఒక సూసైడ్ నోట్ కూడా లభ్యమైంది. ఆ నోట్‌లోని పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడించకపోయినా.. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం అనురాగ్ తనకు "ఎంబీబీఎస్ చదవాలని లేదని, డాక్టర్ అవ్వాలని కోరుకోవడం లేదని" రాశాడు. అతడు వైద్య విద్యపై ఆసక్తి లేకపోవడం వలనే ఈ దారుణ నిర్ణయం తీసుకున్నాడని అనుమానం వ్యక్తమవుతోంది.
దర్యాప్తు కొనసాగుతుంది..
ప్రస్తుతం ఈ కేసును నవర్‌గావ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థి మానసిక ఒత్తిడి, కుటుంబ అంచనాలు, కెరీర్ ప్రెషర్ వంటి అంశాలు కూడా ఈ కేసులో ప్రధాన కోణాలుగా విచారణలో ఉన్నాయని పోలీసులు తెలిపారు. ప్రతిభావంతుడైన విద్యార్థి అకాలంగా ప్రాణాలు తీసుకోవడం సమాజానికి పెద్ద హెచ్చరికే అని వాపోతున్నారు. ఇలాంటి విషాదాలు మరలా పునరావృతం కాకుండా చూసుకోవాలని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications