ఒంటి నిండా గాయాలను చూపించిన నేహా బోరా
కేంద్రం ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ (AISA) ఆధ్వర్యంలో నేడు దేశ రాజధానిలో భారీ నిరసన కార్యక్రమాన్ని జరుగనుంది. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో తీవ్ర అవకతవకలు జరిగాయని, దీనికి బాధ్యత వహిస్తూ సీఈసీ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వివిధ విద్యార్థి సంఘాలు, పౌర సమాజ ప్రతినిధులు పెద్ద ఎత్తున నిరసనకు దిగనున్నారు. ఇండియా గేట్ నుండి జంతర్ మంతర్ వరకు సిటీజన్స్ మార్చ్ నిర్వహించనున్నారు.
శనివారం నిర్వహించిన శాంతియుత ర్యాలీని పోలీసులు బలవంతంగా అడ్డుకోవడంతో ఘర్షణ వాతావరణం ఏర్పడిన విషయం తెలిసిందే. దీనికి కొనసాగింపుగా నేడు సిటీజన్స్ మార్చ్ చేపట్టనుంది ఐసా. ఈ ఆందోళనల్లో పాల్గొన్న ప్రముఖ సామాజిక కార్యకర్త యోగేంద్ర యాదవ్, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్, ఐసా జాతీయ అధ్యక్షురాలు నేహా బోరాతో పాటు సుమారు 150 మంది నిరసనకారులను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఎన్నికల నిర్వహణలో నిష్పాక్షికతను కోల్పోయిన సీఈసీ జ్ఞానేష్ కుమార్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని వారు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియలో అధికార యంత్రాంగం పారదర్శకతను పక్కనబెట్టిందని ఆందోళనకారులు ఆరోపించారు. అర్హులైన లక్షలాది మంది ఓటర్ల పేర్లను జాబితాల నుంచి అక్రమంగా తొలగించారని, ఇది ప్రజాస్వామ్య ప్రాథమిక సూత్రాలకే గొడ్డలిపెట్టు అని వారు మండిపడ్డారు.
దేశ ప్రజల ఓటు హక్కుల పరిరక్షణకు, ఎన్నికల సంఘం నిష్పాక్షికతకు భరోసా కల్పించేందుకు ఈ నిరసనలు అత్యంత కీలకమని పౌర సంఘాలు పేర్కొన్నాయి. జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తతలు కొనసాగుతుండగానే, అటు నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా ఎన్ఎస్‌యూఐ ఆధ్వర్యంలో ఇండియా గేట్ వద్ద ప్రదర్శనలు జరిగాయి. ఎన్నికల సంఘం పనితీరులో జవాబుదారీతనాన్ని డిమాండ్ చేస్తూ విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
మరోవైపు నిరసనను అణచివేయడానికి ఢిల్లీ పోలీసులు అతిగా ప్రవర్తించారని నేహా బోరా ఆరోపించారు. శాంతియుతంగా మార్చ్ నిర్వహిస్తున్న విద్యార్థినులతో విధి నిర్వహణలో ఉన్న మహిళా జర్నలిస్టులపై కూడా పోలీసులు దౌర్జన్యానికి దిగారని ఆరోపించారు. పోలీసు బలగాలు మహిళలను అసభ్యంగా తాకుతూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులతో పెనుగులాట సందర్భంగా తన ఒంటిపై అయిన గాయాలను ఈ సందర్భంగా ఆమె చూపారు.
Tomorrow 3 PMCitizens' MarchIndia Gate to Jantar Mantar 4 PM, Sunday, 4th October 2026From Streets to Protests, Women Are NOT SAFE! Delhi Police's assault against women protestors, journalists will not be tolerated! In the spirit of women taking back the streets:Rise against Delhi Police! Rise against anti-women SIR!Rise for freedom!Rise against Gyanesh Kumar! Jantar Mantar 2.0!
— Neha (@neha_aisa) October 3, 2026
శనివారం నాటి ఆందోళనకు కొనసాగింపుగా.. ఈ మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీ ఇండియా గేట్ నుంచి జంతర్ మంతర్ వరకు శాంతియుతంగా నిరసన ప్రదర్శనను చేపట్టనున్నామని నేహా బోరా తెలిపారు. దీనికి మహిళా జర్నలిస్టులు సైతం తమ సంఘీభావాన్ని తెలిపారని వివరించారు.












Click it and Unblock the Notifications
