Delhi Elections 2025:టాప్ 5 ఆప్ నేతల ఆస్తుల వివరాలు..మైండ్ బ్లోయింగ్ అంతే..!!
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ఫిబ్రవరి 4వ తేదీ జరుగుతుంది. ఇప్పటికే ఇటు అధికార విపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. మొత్తం 70 స్థానాలకు సంబంధించి నామినేషన్లు దాఖలు చేసేందుకు ఈ రోజు (శుక్రవారం జనవరి 17) చివరితేదీ కావడంతో అభ్యర్థుల కోలాహలం మామూలుగా లేదు. ఇక ఎన్నికల ఫలితాలు ఫిబ్రవరి 8వ తేదీన వెలువడుతాయి. ఈ సారి కూడా అధికారం చేజిక్కించుకుని హ్యాట్రిక్ కొట్టాలని కేజ్రీవాల్ పార్టీ భావిస్తుండగా.. ఎలాగైనా సరే ఆమ్ ఆద్మీ పార్టీకి చెక్ పెట్టాలని ఇటు బీజేపీతో పాటు కాంగ్రెస్ కూడా పావులు కదుపుతోంది.
ఇక జనవరి 17వ తేదీ నామినేషన్ దాఖలకు చివరి రోజు కావడంతో ఇప్పటికే చాలా మంది బరిలో నిల్చునే నేతలు తమ నామినేషన్లు దాఖలు చేశారు. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ విషయానికొస్తే కేజ్రీవాల్‌తో సహా ఆ పార్టీ ఇతర నాయకులు కూడా నామినేషన్లు దాఖలు చేశారు. ఇక సామాన్యుడి పార్టీలో అత్యంత ప్రాధాన్యత గల వ్యక్తుల ఆస్తులు వారి వివరాలు అఫిడవిట్‌లో పొందుపర్చిన అంశాలను ఒకసారి పరిశీలిద్దాం. ఆమ్ ఆద్మీ పార్టీ అంటేనే ముందుగా గుర్తుకు వచ్చేది ఆ పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ముందుగా అరవింద్ కేజ్రీవాల్ ఆస్తుల చిట్టాను గమనిద్దాం.

అరవింద్ కేజ్రీవాల్‌కు సొంత కారు లేదా..?
అవును ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఇప్పటికీ సొంత కారు లేదు అంటే నమ్మగలరా.. యస్.. నమ్మి తీరాల్సిందే. కేజ్రీవాల్ రాజకీయాల్లోకి రాకముందు ఆయన ప్రభుత్వాధికారి. అప్పుడు తన సంపాదన నుంచి ఒక కారు కొనుక్కునే స్థోమత అయితే ఉంది. ఆ తర్వాత ఆయన రాజకీయాల్లోకి వచ్చాక ఢిల్లీ సీఎంగా పనిచేశాక కూడా ఆయనకు సొంతంగా కారు కూడా లేదంటే ఆశ్చర్యపోవాల్సిందే.తాజాగా కేజ్రీవాల్ జనవరి 15వ తేదీన ఢిల్లీ స్థానం కోసం నామినేషన్ దాఖలు చేశారు. అతని అఫిడవిట్ పరిశీలిస్తే పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి.కేజ్రీవాల్ తన కుటుంబ ఆస్తుల లెక్క రూ.4.2 కోట్లుగా డిక్లేర్ చేశారు. ఇందులో ఆయన వ్యక్తిగత ఆస్తులు రూ.1.73 కోట్లుగా ఉన్నాయి.
గతేడాది సెప్టెంబర్‌లో సీఎం పదవికి రాజీనామా చేసిన కేజ్రీవాల్‌కు రూ.3.4 లక్షలు విలువ చేసే చరాస్తులుండగా.. రూ.1.7 కోట్లు విలువ చేసే స్థిరాస్తులు ఉన్నట్లు తాను దాఖలు చేసిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఇందులో సేవింగ్స్ అకౌంట్‌లో రూ.2.96 లక్షలు ఉన్నట్లు తెలిపారు. ఇక చేతిలో నగదు రూ.50వేలు ఉందని ,FDR, టర్మ్ డిపాజిట్, ఎస్బీఐలో సేవింగ్స్ రూపంలో రూ.2.8 లక్షలు ఉన్నట్లు తెలిపారు. ఇక ఢిల్లీ మాజీ సీఎంకు ఒక సొంత కారు, ఇల్లు లేదని స్పష్టం చేశారు.ఘజియాబాద్‌లోని ఇందిరాపురంలో ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం రూ.1.7 కోట్లు విలువ చేసే వ్యవసాయేతర భూమి ఉన్నట్లు వెల్లడించారు. ఇక కేజ్రీవాల్ భార్య పేరుమీద బలేనో కారు ఉండగా గురుగ్రామ్‌లో ఆమె పేరుపై రూ.1.5 కోట్లు విలువ చేసే ఇల్లు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
2019-20 కేజ్రీవాల్ వార్షికాదాయం రూ.1.57 లక్షలు ఉండగా.. 2023-24 నాటికి అది రూ.7.2 లక్షలకు పెరిగింది.2020-21 వార్షికాదాయం రూ.44.9 లక్షలు ఉండగా.. 2023 -24కు అది తగ్గి రూ.7.2 లక్షలకు చేరింది.
ఢిల్లీ సీఎం అతిషీ వద్ద బంగారం
ఢిల్లీ సీఎం అతిషీ సింగ్ జనవరి 14న కల్కాజీ స్థానానికి తన నామినేషన్ దాఖలు చేసింది. తాను డిక్లేర్ చేసిన ఆస్తుల ప్రకారం చరాస్తుల విలువ రూ.76.93 లక్షలుగా ఉంది. చేతిలో నగదు రూ.30వేలు ఉండగా, రూ. లక్ష విలువ చేసే నగలున్నట్లు పేర్కొన్నారు. బ్యాంకు ఖాతాలో రూ.75 లక్షలు ఉన్నట్లు స్పష్టం చేశారు. మాజీ సీఎం కేజ్రీవాల్‌లానే ఢిల్లీ సీఎం అతిషీకి కూడా సొంత కారు, ఇల్లు తన పేరున లేదు. 2023-24లో అతిషీ సంపాదన రూ.9,62,860గా ఉండగా, 2022-23లో అది రూ.4.72 లక్షలుగా ఉన్నింది.గతేడాది సెప్టెంబర్‌లో కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేయగా అతిషీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఆస్తులు
ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా జంగ్‌పురా స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. సిసోడియా తన కుటుంబ ఆస్తులు రూ.1.4 కోట్లుగా అఫిడవిట్‌లో చూపించారు. తన పేరుపై రూ.57.43 లక్షలు విలువ చేసే ఆస్తులుండగా.. తన భార్య పేరిట రూ.82.87 లక్షలు విలువ చేసే ఆస్తులున్నాయి. తన పేరుపై చరాస్తులు రూ.34.43 లక్షలుండగా..ఇందులో రూ.25వేలు చేతిలో నగదు, జీవిత బీమా రూ.12,200 ఉండగా.. మిగతాది బ్యాంకు సేవింగ్స్ ఖాతాలో దాదాపుగా రూ.34 లక్షలు ఉన్నట్లు పేర్కొన్నారు. రూ.23 లక్షలు విలువ చేసే స్థిరాస్తులు ఉన్నట్లు అఫిడవిట్‌లో తెలిపిన సిసోడియా... అందులో ఘజియాబాద్‌లోని వసుంధరలో ఒక రెసిడెన్షియల్ ఫ్లాట్ ఉన్నట్లు వివరించారు. 2019-20లో రూ.2.89 లక్షల సంపాదన ఉండగా.. 2023-24 నాటికి అది రూ.11.95 లక్షలకు చేరింది.

సౌరభ్ భరద్వాజ్‌కు రాయల్ ఎనిఫీల్డ్ బైక్
ఢిల్లీ రాష్ట్ర మంత్రి సౌరభ్ భరద్వాజ్ గ్రేటర్ కైలాష్ స్థానానికి జనవరి 16వ తేదీన నామినేషన్ దాఖలు చేశారు. తన కుటుంబ ఆస్తులు రూ.1.48 కోట్లుగా డిక్లేర్ చేశారు. ఇందులో రూ.63 లక్షలు విలువ చేసే చరాస్తులు ఉండగా.. రూ.85 లక్షలు విలువ చేసే స్థిరాస్తులున్నాయి. 2013,2015,2020లో భరద్వాజ్ గ్రేటర్ కైలాష్ స్థానం నుంచి వరుసగా గెలిచారు. భరద్వాజ్ పేరిట మారుతీ సుజుకీ వాగర్ ఆర్ కారు, రాయల్ ఎనిఫీల్డ్ బైక్ ఉన్నాయి. రూ.10.65 లక్షలు విలువ చేసే బంగారు నగలు ఉండగా.. ఒక ఇల్లు దక్షిణ ఢిల్లీలోని చిరాగ్ ఢిల్లీ ప్రాంతంలో ఉంది.
సత్యేంద్ర జైన్ ఆస్తుల వివరాలు
సీనియర్ ఆప్ నేత సత్యేంద్ర జైన్ అత్యంత ధనికుడని చెప్పొచ్చు. షాకుర్ బస్తీ నుంచి ఆప్ తరపున అభ్యర్థిగా బరిలో ఉన్నారు సత్యేంద్ర జైన్. గత మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ఈ స్థానం నుంచి జైన్ గెలిచారు. మాజీ ఆరోగ్య శాఖ మంత్రి అయిన జైన్ కుటుంబ ఆస్తులు రూ.8.8 కోట్లుగా డిక్లేర్ చేశారు. ఇ:దులో రూ.3.2 కోట్లు చరాస్తులుండగా.. రూ.5.6 కోట్లు స్థిరాస్తులున్నట్లు పేర్కొన్నారు. మంత్రిగా పనిచేసిన సత్యేంద్ర జైన్‌కు సొంతంగా కారులేదు. బంగారం మాత్రం రూ.7.4 లక్షలు ఉన్నట్లు తెలిపారు. రూ.1.5 కోట్లు విలువ చేసే వ్యవసాయ భూమి ఢిల్లీలోని పల్లా గ్రామంలో ఉంది. రూ.12 లక్షలు విలువ చేసే వ్యవసాయేతర భూమి మీరట్‌లో సత్యేంద్ర జైన్ పేరిట ఉన్నట్లు అఫిడవిట్ ద్వారా తెలుస్తోంది. పీతంపురాలో మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ పేరిట రెండు ఇల్లు ఉండగా వీటి ప్రస్తుత విలువ రూ.4.12 కోట్లుగా ఉంది.
మొత్తానికి ఆమ్ ఆద్మీ పార్టీలోని టాప్ ఐదు రాజకీయ నాయకులు సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లోని వారి ఆస్తులు, ఆదాయాలు పై విధంగా ఉన్నాయి.












Click it and Unblock the Notifications