Nirbhaya case: నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలుకు కొత్త తేదీ ప్రకటన, డేట్, టైమ్ ఇదే..
న్యూఢిల్లీ: 2012 నిర్భయపై సామూహిక అత్యాచారం, హత్య చేసిన కేసులో నలుగురు దోషులకు ఉరిశిక్ష అమలు కానుంది. మార్చి 20న నలుగురు దోషులకు ఉరిశిక్ష విధించాలని ఢిల్లీలోని పాటియాలా కోర్టు ఆదేశించింది. నలుగురు దోషులకు తాజాగా గురువారం మరోసారి ఈ డెత్ వారెంట్లు జారీ చేసింది.

మార్చి 20, ఉదయం 5.30గంటలకు ..
మార్చి 20న ఉదయం 5.30గంటలకు దోషులకు ఉరితీయాలని పాటియాలా కోర్టు స్పష్టం చేసింది. ఇప్పటి వరకు తమకున్న న్యాయపరమైన అవకాశాలను నిర్భయ దోషులు వినియోగించుకోవడంతో మార్చి 20న నిర్భయ దోషులకు ఉరి ఖాయంగా కనిపిస్తోంది. అడిషనల్ సెషన్స్ జడ్జీ ధర్మేంద్ర రానా మార్చి 20 తేదీని ఖరారు చేశారు. నిర్భయ దోషులకు న్యాయపరమైన అవకాశాలు ఇక లేవని, ఉరిశిక్ష అమలుకు కొత్త తేదీని ప్రకటించాలని కోర్టును ఢిల్లీ సర్కారు ఆశ్రయించిన విషయం తెలిసిందే.

ఈసారైనా న్యాయం జరుగుతుందా..?
నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు తేదీని ప్రకటించడంపై నిర్భయ తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. ఈసారైనా ఎలాంటి అవాంతరాలు లేకుండా దోషులకు శిక్ష పడుతుందని భావిస్తున్నట్లు తెలిపారు. నిర్భయకు మార్చి 20న న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. కాగా, కోర్టు తాజాగా ఉరిశిక్ష అమలు తేదీని ప్రకటించడంతో తీహార్ జైలు అధికారులు దోషుల ఉరికి సంబంధించిన ఏర్పాట్లు మొదలు పెడుతున్నారు.

నిర్భయ దోషుల క్షమాభిక్ష తిరస్కరణ
నిర్భయ కేసులో ఉరిశిక్ష విధించబడిన నలుగురు దోషులు ముకేష్ కుమార్ సింగ్(32), పవన్ గుప్తా(25), వినయ్ శర్మ(26), అక్షయ్ కుమార్(31) ఇప్పటి వరకు తమకున్న న్యాయపరమైన అవకాశాలను వినియోగించుకున్నారని.. ఇక వారికి ఎలాంటి అవకాశాలు లేవని ఢిల్లీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ క్రమంలో నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు చేసేందుకు కొత్త తేదీని ప్రకటించేందుకు తాము కోర్టును కోరుతున్నామని ఢిల్లీ ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటి వరకు ఉన్న అన్ని అవకాశాలు దోషులు వినియోగించుకున్నందున.. వారికి ఉరిశిక్ష అమలు చేయాలని కోర్టును కోరింది ఢిల్లీ సర్కారు. మరణశిక్ష ఎదుర్కొంటున్న నలుగురు దోషులు కూడా తమకున్న న్యాయపరమైన అవకాశాలను ఇప్పటికే వినియోగించుకున్నారు. తాజాగా పవన్ గుప్తా క్షమాభిక్ష పిటిషన్‌ను కూడా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తిరస్కరించారు. ఇతర దోషులు పెట్టుకున్న మెర్సీ పిటిషన్లను కూడా ఇప్పటికే రాష్ట్రపతి తిరస్కరించారు. కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాలు కూడా నిర్భయ దోషులకు క్షమాభిక్షను వ్యతిరేకించాయి.

2012లో నిర్భయపై అత్యంత అమానవీయ చర్య
2012, డిసెంబర్ 16న దక్షిణఢిల్లీలో 23ఏళ్ల మెడికల్ విద్యార్థి నిర్భయను ఆరుగురు నిందితులు బస్సులో సామూహికంగా అత్యాచారం చేశారు. ఆ తర్వాత ఆమెను చిత్రహింసలకు గురిచేశారు. ఆ దుర్మార్గుల దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. ఆరుగురు దోషుల్లో రామ్ సింగ్ అనే నిందితుడు ఆత్మహత్యకు పాల్పడగా, మరో నిందితుడు మైనర్ కావడంతో శిక్ష అనుభవించి జైలు నుంచి బయటికి వచ్చాడు. మిగిలిన నలుగురు దోషులకు కోర్టు మరణశిక్ష విధించింది. ఈ దోషులకు విధించాల్సిన ఉరిశిక్ష ఇప్పటికే మూడుసార్లు వాయిదా పడటం గమనార్హం.












Click it and Unblock the Notifications