పీఎం కావాలనే: నితీష్‌పై అమిత్‌షా సంచలనం, పాక్‌పై లాలుకు చురక
పాట్నా: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా శుక్రవారం నాడు జేడీయూ నేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పైన, ఆర్జేడీ చీఫ్, మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ పైన తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. ప్రధానమంత్రి కావాలన్న వ్యక్తిగత కాంక్షతోనే నితీష్ తమ పార్టీతో తెగతెంపులు చేసుకున్నారని ఆరోపించారు.
అమిత్ షా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి బీహార్‌కు వచ్చారు. మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్ జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జీవితాంతం ఠాకూర్ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోరాడారన్నారు. కానీ ఆయన శిష్యులు నితీష్, లాలూలు మాత్రం ఠాకూర్ సిద్ధాంతాలకు విరుద్ధంగా కాంగ్రెస్‌తో చేతులు కలిపారన్నారు.
నితీశ్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్‌లు అధికారాన్ని చేజిక్కించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సహాయం పొందుతున్నారని, అందువల్ల వారికి కర్పూరి ఠాకూర్ పేరు కూడా ఎత్తే హక్కు లేదన్నారు. ప్రముఖ సోషలిస్టు నాయకుడయిన కర్పూరి ఠాకూర్ తన జీవితాంతం కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాడారని పేర్కొంటూ అలాంటి కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపడం ద్వారా నితీశ్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్‌లు కర్పూరి ఠాకూర్ బోధనలను తుంగలో తొక్కారన్నారు.

ఈ సంవత్సరం చివరలో జరిగే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ తన విజయ యాత్రను కొనసాగిస్తుందన్నారు. నితీష్ ఆకాంక్షలను బీజేపీ ఎప్పుడూ గౌరవించిందన్నారు. లాలుకు, కాంగ్రెస్‌కు అధికారం దక్కకుండా చూసేందుకు ఆయనను సీఎం చేసిందన్నారు. కానీ ప్రజాభిప్రాయానికి ఆయన వెన్నుపోటు పొడిచారన్నారు.
దేశసరిహద్దుల్లో తరుచుగా పాకిస్తాన్ జరుపుతున్న కాల్పులను, చొరబాట్లను అరికట్టడంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం విఫలమైందన్న లాలు వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. లాలూకు చూపు మందగించిందన్నారు. యూపీఏ హయాంతో పోలిస్తే ఎన్డీయే ప్రభుత్వ హయాంలో సరిహద్దుల వద్ద పరిస్థితిలో చాలా తేడా ఉందన్నారు. గతంలో కాల్పులు పాక్ ఆరంభించి, పాక్‌తోనే ముగిసేవని, ఇప్పుడు పాక్ ఆరంభిస్తే.. భారత్ తిప్పికొట్టడంతో ఆగిపోతున్నాయన్నారు.
బీజేపీని అధికారంలోకి తీసుకు వస్తే అయిదేళ్లలో నెంబర్ వన్ రాష్ట్రంగా చేస్తామన్నారు. ఇరవై నాలుగు గంటలు విద్యుత్ ఇస్తామని చెప్పారు. కాగా, ఈ కార్యక్రమంలో బీహార్‌కు చెందిన కేంద్ర మంత్రులు, రాష్ట్ర సీనియర్ నాయకులు సుశీల్ కుమార్ మోడీ, నంద కిశోర్ యాదవ్ వంటి వారు పాల్గొన్నారు. బీహార్‌లో బిజెపిని మరింత బలోపేతం చేసేందుకు అమిత్ షా రాష్ట్ర రాజధాని పాట్నాకు వచ్చారు.












Click it and Unblock the Notifications