2024లోనూ బీజేపీకి ఎదురులేదు: రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ మోడీ హవాపై అమిత్ షా
వచ్చే సార్వత్రిక ఎన్నికలపై కేంద్ర హోంమంత్రి అమిషా కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీకి దేశంలో పోటీ లేదని అమిత్ షా స్పష్టం చేశారు.
న్యూఢిల్లీ: వచ్చే సార్వత్రిక ఎన్నికలపై కేంద్ర హోంమంత్రి అమిషా కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీకి దేశంలో పోటీ లేదని అమిత్ షా స్పష్టం చేశారు. ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై ఆయన స్పందించారు. దేశంలోని ప్రజల జీవితాల్లో క్షేత్రస్థాయి నుంచి సానుకూల మార్పులను తమ ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు.

దేశ ప్రజలు మోడీతో ఉన్నారన్న అమిత్ షా
దేశంలోని ప్రజలంతా ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరుస్తున్నారని అమిత్ షా స్పష్టం చేశారు. అధికారంలో ఉన్న గత ఎనిమిదేళ్లలో బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజలకు చేసిన సేవలే మరోసారి తమ పార్టీని గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు కేంద్ర హోంమంత్రి. భారతదేశం అన్ని రంగాల్లో పురోగతి సాధించిందని, వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా దేశం నిలబడిందని అమిత్ షా అన్నారు. దేశం పురోగతి, దేశాన్ని సురక్షితంగా మార్చడం, ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా మార్చడం నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వ ప్రాధాన్యతలలో ఒకటన్నారు. ఇది ప్రపంచంలో భారత్ సాధించిన విజయాలకు గుర్తింపు ఉందని వ్యాఖ్యానించారు.

బీజేపీ సాధించిన విజయాలివేనంటూ అమిత్ షా
తన ప్రభుత్వ విజయాలపై అమిత్ షా మాట్లాడుతూ.. ఎనిమిదేళ్ల తక్కువ కాలంలోనే దేశంలోని 60 కోట్ల మంది పేదల జీవన ప్రమాణాలను పెంచడానికి మేము ప్రయత్నించాము. ఇందులో మేము విజయం కూడా సాధించాము. మేం సాధించినవి చాలా విజయాలు ఉన్నాయి. రైల్వేలో పెద్ద మార్పులు ఉన్నాయి. అంతరిక్ష రంగంలో కొత్త విధానంతో.. అగ్రగామిగా ఉండేందుకు సిద్ధమవుతున్నాము. కొత్త విధానంతో మేము డ్రోన్ రంగంలో ముందుకు సాగుతున్నాము' అని అమిత్ షా తెలిపారు. 'వామపక్ష తీవ్రవాదం ముగింపు దశకు చేరుకుంది. జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదంపై మా ఏజెన్సీల నియంత్రణ, ఆధిపత్యం ఉంది. ఈశాన్య ప్రాంతంలో చాలా సమస్యలకు మేము పరిష్కారాలను కనుగొన్నాము. 8,000 మంది తీవ్రవాద సంస్థల సభ్యులు జన స్రవంతిలో చేరేలా చేశాం' అని అమిత్ షా తెలిపారు.

ప్రతిపక్షమే లేదు.. రాహుల్ ప్రభావంపై అమిత్ షా ఏమన్నారంటే?
2024లో ప్రధాన ప్రతిపక్షం గురించి అడిగినప్పుడు.. అది "దేశ ప్రజలచే నిర్ణయించబడుతుంది' అని షా అన్నారు. 'ఇప్పటి వరకు ప్రజలు లోక్‌సభలో ఏ ఒక్క పార్టీకి ప్రధాన ప్రతిపక్షం అనే ముద్ర వేయలేదు' తనదైన శైలిలో స్పందించారు. భారత్ జోడో యాత్రపై, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎదిగే అవకాశంపై అమిత్ షా మాట్లాడుతూ.. మూడు రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయని, (భారత్ జోడో యాత్ర) ప్రభావం ఎలా ఉంటుందో చూడాలన్నారు.

రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ మోడీ హవా ఉంటుందన్న అమిత్ షా
కేంద్ర ప్రభుత్వ పథకాలు అట్టడుగు వర్గాలకు సమర్ధవంతంగా చేరాయని కేంద్ర సహకార శాఖ మంత్రి షా అన్నారు. త్రిపురలో నిరుపేద కుటుంబానికి చెందిన ఇంటికి భోజనం చేసేందుకు వెళ్లాను.. మరుగుదొడ్డి, గ్యాస్ సిలిండర్, కరెంటు, కుళాయి నీరు, ఆయుష్మాన్ భారత్ కార్డు చూపించారు.. ఇవన్నీ పేద కుటుంబానికి చేరాయి" అని అమిత్ షా తెలిపారు. కేంద్ర పథకాలు ప్రతి పేద ఇంటికి చేరుతున్నాయన్నారు. అందుకే 2024 ఎన్నికల్లో బీజేపీకి దేశంలో పోటీ లేదని స్పష్టం చేశారు. దేశంలోని ప్రతి ఒక్కరూ ప్రధాని మోడీతో ముందుకు సాగుతారన్నారు.
త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు. కౌంటింగ్ రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు బీజేపీకి పూర్తి మెజారిటీ వస్తుందని జోస్యం చెప్పారు. కర్నాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లతో సహా రాబోయే నెలల్లో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో బీజేపీ మంచి పనితీరు కనబరుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications