వీగిన కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం: బీజేపీకే జేజేపీ మద్దతు, నెగ్గిన మనోహర్ లాల్ ఖట్టర్ సర్కారు
ఛండీగఢ్: హర్యానాలో మనోహర్ లాల్ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ-జేజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 31 మంది సభ్యులు ఓటేయగా, 55 మంది వ్యతిరేకంగా ఓటేశారు. దీంతో అవిశ్వాస తీర్మానం వీగిపోయినట్లు అసెంబ్లీ స్పీకర్ ప్రకటించారు.
ఈ నేపథ్యంలో మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వం అవిశ్వాసం నుంచి గట్టెక్కింది. ఖట్టర్ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందంటూ కాంగ్రెస్ పార్టీకి చెందిన వివక్ష నేత భూపీందర్ సింగ్ హుడా సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు.

90 మంది ఉండాల్సిన అసెంబ్లీలో ప్రస్తుతం 88 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. అవిశ్వాసం నుంచి గట్టెక్కాలంటే 45 మంది సభ్యులు అవసరం. కాగా, బీజేపీకి 40 మంది సభ్యులు ఉండగా, జేజేపీకి 10 మంది, స్వతంత్రులు ఐదుగురు, లోక్‌హిత్ పార్టీకి చెందిన ఒకరు ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారు.
కాగా, కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలపై అసంతృప్తిగా ఉన్న జేజేపీ.. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేస్తుందని కాంగ్రెస్ భావించింది. కానీ, ప్రభుత్వాన్ని అస్థిరపరిచే చర్యలేవీ తాము చేపట్టబోమని జేజేపీ ముందే ప్రకటించింది.
అందుకు తగినట్లుగానే ఓటింగ్ లో పాల్గొని ఖట్టర్ ప్రభుత్వానికి మద్దతు పలికింది. దీంతో కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో తాను బుధవారం రాత్రి నిద్ర కూడా సరిగపోలేదని ఖట్టర్ సభలో భావోద్వేగానికి గురయ్యారు. హర్యానా, పంజాబ్ రైతులు నూతన చట్టాలకు వ్యతిరేకంగా భారీ ఎత్తున ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications