కేసీఆర్, వైఎస్ జగన్ కు నో ఇన్విటేషన్, సిద్దరామయ్య, కాంగ్రెస్ ఆహ్వానం ఎవరికంటే !
బెంగళూరు/హైదరాబాద్: కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ శనివారం మద్యాహ్నం 12.30 గంటలకు బెంగళూరులో ప్రమాణస్వీకారం చెయ్యనున్నారు. కర్ణాటకతో పాటు దేశంలోని వివిద రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే స్వయంగా అందరికి ఫోన్లు చేసి కార్యక్రమానికి హాజరుకావాలని మనవి చేశారు.
ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్వయంగా పలువురు ముఖ్యమంత్రులు, పార్టీ నేతలకు ఆహ్వానం పంపారు.
తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, బీహార్ సీఎం నితీశ్ కుమార్, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రేలకు ఫోన్లు చేసిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కార్యక్రమానికి ఆహ్వానించారు.

కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లాకు కూడా ఆహ్వానాలు పంపింది. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాలకు కూడా కర్ణాటక కాంగ్రెస్ ఆహ్వానాలు పంపింది.
అంతేకాకుండా, ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘేల్, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖూలను కూడా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆహ్వానించింది. ఈ నేతలు అందరూ శనివారం బెంగళూరు వస్తున్నారు.
అయితే తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కే. చంద్రశేఖర్‌రావు, ఒడిశా సీఎం, బీజేడీ నేత నవీన్ పట్నాయక్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌లకు ఎలాంటి ఆహ్వానాలు పంపలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. బీజేపీ మీద నిత్యం విమర్శలు చేస్తున్న కేసీఆర్ ను ఎందుకు ఆహ్వానించలేదని చర్చ మొదలైయ్యింది.
ఇటీవల కర్ణాటక మాజీ సీఎం హెచ్ డీ. కుమారస్వామి, కేసీఆర్ నిత్యం టచ్ లో ఉండటం, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్ పార్టీకి కేసీఆర్ మద్దతు ఇవ్వడం ఓ కారణం అయి ఉంటుందని, అందుకే కేసీఆర్ ను ఆహ్వానించలేదని తెలిసింది. ఇక కాంగ్రెస్ పార్టీ మీద తిరుగుబాటు చేసి పార్టీ నుంచి బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టి ఆంధ్రప్రదేశ్ సీఎం అయిన వైఎస్. జగన్ మోహన్ రెడ్డికి కావాలనే ఆహ్వానం పంపించిఉండరని కొందరు నాయకులు అంటున్నారు.
బీఎస్పీ అధినేత్రి మాయావతికి కూడా ఎలాంటి ఆహ్వానం పంపలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌కు ఖర్గే ఆహ్వానం పంపగా ఆయన ప్రమాణ స్వీకారానికి హాజరయ్యే అవకాశం ఉంది. మల్లికార్జున ఖర్గే స్వయంగా సీపీఐ ప్రధాన కార్యదర్శి డి రాజాకు ఫోన్ చేసి ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారని కాంగ్రెస్ పార్టీ నాయకులు ధృవీకరించారు.
సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌కు కూడా మల్లికార్జున ఖార్గే ఆహ్వానం పంపారు.
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రమాణస్వీకారానికి బీహార్ సీఎం నితీశ్ కుమార్ హాజరవుతారని జేడీయూ అధికార ప్రతినిధి రాజీబ్ రంజన్ తెలిపారు.
మమతా బెనర్జీకి ఆహ్వానం అందింది కానీ ఆమె వేడుకకు హాజరు కావడం లేదు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే, కర్ణాటకకు కాబోయే సీఎం సిద్ధరామయ్య గురువారం స్టాలిన్‌ను ఫోన్ చేసి ప్రమాణస్వీకారోత్సవంలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానించినట్లు చెన్నైలో డీఎంకే పార్టీ అధికారికంగా తెలిపింది.












Click it and Unblock the Notifications