సెంట్రల్ విస్టా నిర్మాణ స్థలంలో ఫొటోలు, వీడియోలు రద్దు చేశారు: ప్రధాని మోడీపై విమర్శల ఎఫెక్టే
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సెంట్రల్ విస్టా ప్రాజెక్టుపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. కరోనా మహమ్మారి దేశంలో అనేక మంది ప్రాణాలు తీస్తుంటే వేల కోట్లు ఖర్చు చేసి ఈ పార్లమెంటు నూతన భవనాన్ని నిర్మించడం అవసరమా? అని ప్రశ్నిస్తున్నాయి.

సెంట్రల్ విస్టా ఆవరణలో ఫొటోగ్రఫీ, వీడియో గ్రఫీ నిషేధం..
అంతేగాక, సెంట్రల్ విస్టా నిర్మాణాన్ని వెంటనే నిలిపేయాలని ప్రధాని మోడీకి రాసిన లేఖలో 9 ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో ఇండియా గేట్ సమీపంలోని నిర్మాణ స్థలంలో ఫొటోగ్రఫీ, వీడియో చిత్రీకరణను సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ నిషేధించింది. అనుమతి లేకుండా లోనికి ప్రవేశించరాదని స్పష్టం చేసింది.

కరోనా మహమ్మారి విజృంబిస్తున్న వేళ..
ఈ మేరకు సెంట్రల్ విస్టా నిర్మాణ ప్రాంతంలో సైన్ బోర్డులు ఏర్పాటు చేసింది. ఈ విషయంపై సీపీడబ్ల్యూడీలోని ఓ అధికారిని సంప్రదించేందుకు ప్రయత్నించగా.. ఆయన సమాధానమిచ్చేందుకు నిరాకరించారు. దేశంలో కరోనా సెకండ్ వేవ్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తుంటే.. సెంట్రల్ విస్టా రీడెవలప్మెంట్ ప్రాజెక్టు నిర్మించడంపై కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.

సెంట్రల్ విస్టా ప్రాజెక్టు ఇదే..
కాగా, దేశరాజధాని ఢిల్లీలోని ఇండియా గేట్ నుంచి రాష్ట్రపతి భవనం వరకూ ఉన్న ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు తలపెట్టిన ప్రాజెక్టే.. ఈ సెంట్రల్ విస్టా. కొత్తగా త్రిభుజాకారపు పార్లమెంటు భవనం, ఒక కామన్ సెంట్రల్ సెక్రటేరియట్, రాష్ట్రపతి భవనం నుంచి ఇండియా గేట్ వరకూ ఉండే మూడు కిలోమీటర్ల రాజ్‌పథ్‌ను నవీకరించనున్నారు.

ప్రధాని మోడీజీ.. ఆ 13వేల కోట్లు కరోనా కట్టడి ఉపయోగించండి..
ఈ ప్రాజెక్టుకు సుమారు 13వేల కోట్లు ఖర్చు చేయనున్నారు. అయితే, ఈ నిర్మాణానికి అయ్యే ఖర్చును దేశంలో కరోనా కట్టడికి, వ్యాక్సిన్ నేషన్ కోసం ఉపయోగించాలని కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం కూడా ప్రతిపక్షాలకు ఘాగాటుగానే బదిలిస్తోంది. 70 ఏళ్లలో చేయలేని పనిని ప్రధాని నరేంద్ర అధికారంలోకి వచ్చిన ఏడేళ్లలో చేస్తుంటే.. వారికి అసూయ కలుగుతోందని బదులిస్తున్నారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో చేయాలనుకున్నదే.. ఇప్పుడు మోడీ ప్రభుత్వం చేస్తోందని అన్నారు కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి.












Click it and Unblock the Notifications