30 దాకా కటకటాలే: ఆశారాం తరఫున జెఠ్మలానీ
న్యూఢిల్లీ: పదహారేళ్ల బాలికపై లైంగిక దాడి కేసులో ఆశారాం బాపు జ్యుడిషియల్ కస్టడీని కోర్టు మరో 14 రోజులు పొడిగించింది. దీంతో బాబా ఆశారాం బాపు సెప్టెంబర్ 30వ తేదీ వరకు జైలులోనే ఉండాల్సిన పరిస్థితి. ఆయన సెప్టెంబర్ 2వ తేదీ నుంచి జైలులో ఉంటున్నాడు.
కాగా, ఆశారాం బాపు బెయిల్ కోసం శుక్రవారంనాడు రాజస్థాన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్నారు. ఆశారాం బాపు తరఫున ప్రముఖ న్యాయవాది రాంజెఠ్మలానీ వాదిస్తారు. సోమవారంనాడు ఆయన బెయిల్ దరఖాస్తుపై విచారణ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

72 ఆశారాం బాపు ప్రస్తుతం జోథ్‌పూర్ కేంద్ర కారాగారంలో ఉన్నాడు. దిగువ కోర్టు ఆశారాం బాపు బెయిల్ పిటిషన్‌ను తోసిపుచ్చింది. జోథ్‌పూర్ శివారులో ఉన్న ఆశారాం బాపు ఆశ్రమంలో తనపై ఆగస్టు 15వ తేదీన లైంగిక దాడి జరిగినట్లు బాలిక ఆరోపించింది.
సెప్టెంబర్ 6న ఆశారాం బాపు చేసిన విజ్ఞప్తి మేరకు జిల్లా సెషన్స్ కోర్టు(రూరల్) ఆదేశాలతో వైద్య బృందం అతనికి వైద్య పరీక్షలు నిర్వహించింది. అదే సమయంలో ఆశారాం తనకు ఆరోగ్యకరమైన ఆహారం, సరైన బెడ్, గంగా జలం, మరికొన్ని సదుపాయాలు జైలులో కల్పించాలని కోరాడు. ఆశారాం తీవ్రమైన వ్యాధితో బాధపడుతున్నాడని అతని తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.












Click it and Unblock the Notifications