నూడుల్స్ వల్ల ఆ కుటుంబం చనిపోలేదు: గ్రేటర్ నోయిడా కుటుంబ సభ్యుల మృతి కేసులో బిగ్ ట్విస్ట్..
ఇటీవల ఉత్తరప్రదేశ్ లోని గ్రేటర్ నోయిడాలో ఓ కుటుంబంలోని ఐదుగురు రాత్రి నూడుల్స్ తిని ఉదయాన్నే విగతజీవులుగా కనిపించారు. అయితే అంతా నూడుల్స్ వల్లే చనిపోయారని భావించారు. ఈ కేసును పోలీసులు పూర్తి స్థాయిలో విచారించగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కుటుంబ పెద్దే తన భార్యా పిల్లలకు ఆహారంలో విషం కలిపి.. ఆ తర్వాత తానూ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. దీర్ఘకాలంగా కొనసాగుతున్న ఆస్తి తగాదాలే ఈ ఘోరానికి దారితీశాయని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గ్రేటర్ నోయిడా పరిధిలోని నాగ్లా శ్రీ పదం గ్రామంలో మహేష్, లలిత దంపతులు నివసిస్తున్నారు. వీరికి లడ్డు, మిష్టి, సాక్షాత్ అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే రాత్రి నూడుల్స్ తిని.. టీ తాగిన వీళ్లంతా తెల్లారేసరికి విగతజీవులుగా మిగిలారు. అయితే తొలుత ఇది ఫుడ్ పాయిజనింగ్ వల్లే జరిగిందని భావించినప్పటికీ పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఈ కేసుని విచారించిన పోలీసులు దంపతులు, వారి ముగ్గురు పిల్లల మృతికి కారణం నూడుల్స్ కాదని స్పష్టం చేశారు. దీర్ఘకాలంగా కొనసాగుతున్న ఆస్తి వివాదం కారణంగానే.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుందని క్లారిటీ ఇచ్చారు. ఆత్మహత్యకు ముందు మృతుడు మహేశ్ తన ఫోన్ లో రికార్డ్ చేసిన వాయిస్ నోట్ తో ఈ విషయం గుర్తించినట్లు తెలిపారు. ఆస్తి కోసం ఇద్దరు సోదరీమణులు, బావ తమ కుటుంబాన్ని కొన్నేళ్లుగా వేధిస్తున్నారని మహేశ్ ఆ వాయిస్ నోట్ లో పేర్కొన్నాడు. వారి వేధింపులు తాళలేక తాము ఆత్మహత్య చేసుకుంటున్నట్టు వాయిస్ నోట్లో వెల్లడించాడు మహేష్. ఆ వాయిస్ రికార్డ్ తో ఇద్దరు సోదరీమణులు, బావపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ మేరకు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇక మహేష్ నూడుల్స్ లో విషం కలిపి కుటుంబ సభ్యులకు పెట్టి, అనంతరం తానూ తిని మరణించి ఉంటాడని పోలీసుల విచారణలో తేలింది. దాంతో ఈ కేసుపై పూర్తి స్థాయిలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.












Click it and Unblock the Notifications
