నిర్భయ తరహా ఘటన.. స్లీపర్ బస్సులో బాలికపై గ్యాంగ్ రేప్
దేశ రాజధాని ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో మరో దారుణం జరిగింది. నోయిడాలో నిర్భయ తరహా దారుణ ఘటన చోటుచేసుకుంది. కదిలే స్లీపర్ బస్సులో 16 ఏళ్ల విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగిన ఘోర ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బస్సులోనే డ్రైవర్, కండక్టర్ కలిసి విచక్షణారహితంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆగస్ట్ 4న జరిగిన ఈ ఘటనపై బాదితురాలి కుటుంబ సభ్యులు, బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అత్యాచారానికి పాల్పడిన బస్సు డ్రైవర్, కండక్టర్‌ను అరెస్ట్ చేశారు.
కుటుంబసభ్యులతో గొడవబడి బయటకు వచ్చిన బాలిక
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆగస్టు 4వ తేదీన 16 ఏళ్ల విద్యార్థిని కుటుంబ సభ్యులతో గొడవపడి మనస్తాపంతో ఇంటి నుంచి బయటకు వచ్చింది. నోయిడాలోని కన సోదరి ఇంటికి వెళ్లేందుకు బయలుదేరిన ఆ బాలిక.. తీవ్రమైన వర్షం, చీకటి కారణంగా మార్గం తెలియక పొరపాటున పరి చౌక్ వద్ద బస్సు దిగింది. అదే సమయంలో వర్క్‌షాప్‌లో మరమ్మతులు పూర్తి చేసుకుని ఖాళీగా తిమర్ పూర్ వైపు వెళ్తున్న ఓ స్లీపర్ బస్సు అటుగా వచ్చింది. ఒంటరిగా ఉన్న ఆ బాలిక సహాయం కోసం ఆ బస్సును ఆపింది. బస్సు డ్రైవర్, కండక్టర్ ఆమెను నోయిడా సెక్టార్ 63 వద్ద దింపుతామని నమ్మించి బలవంతంగా బస్సులోకి ఎక్కించుకున్నారు.

స్లీపర్ బస్సులో ఘాతుకం
బస్సు కొంత దూరం ప్రయాణించిన తర్వాత కండక్టర్ బాలికపై లైంగిక దాడికి ఒడిగట్టాడు. ఆమె గట్టిగా కేకలు వేస్తూ ప్రతిఘటించడంతో చంపేస్తామని బెదిరించారు.అనంతరం డ్రైవర్, కండక్టర్ ఇద్దరూ కలిసి విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. స్లీపర్ బస్సుకు తెరలు ఉండటంతో లోపల జరుగుతున్న దారుణం బయటకు కనిపించకుండా పోయింది.
కాశ్మీరీ గేట్ వద్ద వదిలేసి పరారీ
ఈ ఘటన అనంతరం నిందితులు ఆ బాలికను కాశ్మీరీ గేట్ బస్ స్టాండ్ సమీపంలోని రింగ్ రోడ్డుపై దింపివేసి అక్కడి నుంచి పారిపోయారు. బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.
నిందితుల అరెస్ట్
తిమర్‌పూర్ బస్ పార్కింగ్ స్థలంలో ఉన్న బస్సు డ్రైవర్, కండక్టర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నేరానికి ఉపయోగించిన స్లీపర్ బస్సును స్వాధీనం చేసుకుని కీలకమైన ఆధారాల సేకరణ కోసం దానిని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారు. నిందితులపై కఠిన చట్టాల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.














Click it and Unblock the Notifications