చిరుకు షాక్: ప్రభుత్వ నివాసం ఖాళీచేయాలని నోటీసు
న్యూఢిల్లీ/హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవికి నివాసం ఖాళీ చేయాలంటూ నోటీసులు ఇచ్చారు. దేశ రాజధాని న్యూఢిల్లీలోని ప్రభుత్వ గృహాన్ని ఖాళీ చేయాలంటూ ప్రభుత్వ అధికారులు గురువారం నాడు ఆయనకు నోటీసులు ఇచ్చారు. ప్రస్తుతం చిరంజీవి ఉంటున్న ఇల్లు ఆయన కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు కేటాయించారు.
ఖాళీ చేయాలని కోరుతూ అధికారులు ఆయన ఇంటికి ఇప్పుడు నోటీసులు అంటించారు. యూపీఏ హయాంలో చిరంజీవి కేంద్రమంత్రిగా ఆ గృహానికి వచ్చారు. యూపీఏ గద్దెదిగి, ఎన్డీయే అధికారంలోకి వచ్చినప్పటికీ ఆయన ఇంటిని ఖాళీచేయలేదు. 2014 మే 30తోనే ఆయన అధికారిక నివాసం గడువు ముగిసింది.
దీంతో ఇల్లు ఖాళీ చేయాలంటూ ఆయనకు జూన్ నెలలో అధికారులు మొదటిసారి నోటీసులిచ్చారు. వాటికి ఎలాంటి స్పందన లేదు. దీంతో ఇప్పుడు ప్రభుత్వ అధికారులు ఆయన నివాసానికి నోటీసులు అంటించి వెళ్లారు.

రాహుల్ గాంధీకి కౌంటర్
ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఫోటోలు దిగడం కోసమేనంటూ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించడంపై భారతీయ జనతా పార్టీ వెంటనే స్పందించింది. మహాత్మాగాంధీ కలలు కన్న క్లీన్ ఇండియాను కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ అవహేళన చేస్తున్నారని పేర్కొంది.
ఈ మేరకు ఆ పార్టీ నేత నళిని కోహ్లీ మాట్లాడుతూ... రాహుల్ జీవితం పూర్తిగా ఫోటో అవకాశమేనన్నారు. లోకల్ ట్రైన్స్‌లో ప్రయాణించడం, దళితుల ఇళ్లకు వెళ్లడం, ఆర్డినెన్స్‌ను చించివేయడం. ఇదంతా పూర్తిగా రాహుల్ ఫోటోల కోసమే చేశారని వ్యాఖ్యానించారు.
సుజన పైన రఘువీరా మండిపాటు
టీడీపీలో సుజనా చౌదరి ఓ బ్రోకర్ అని ఏపీసీసీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అనంతపురంలో ఆయన మాట్లాడారు. సుజనాకు కేంద్రమంత్రి పదవి ఎందుకు ఇప్పించారో చెప్పాలన్నారు. టీడీపీ అధినేతకు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఎంపీలు కనబడలేదా? అని ఆయన నిలదీశారు.












Click it and Unblock the Notifications