CUET UG 2024 re-exam: 19న మరో రీ-టెస్ట్
జాతీయ స్థాయిలో ఎంట్రన్స్ టెస్టుల నిర్వహణ అస్తవ్యస్తమైంది. నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ (NEET PG exams) పోస్ట్ గ్రాడ్యుయేషన్ పరీక్షలు మొదలుకుని దాదాపుగా అన్ని రకాల పరీక్షల షెడ్యూల్ తలకిందులైంది. లక్షలాది మంది అభ్యర్థులు దీని ప్రభావానికి గురయ్యారు.
నీట్ పీజీ పరీక్షల్లో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ దేశవ్యాప్తంగా దుమారం చెలరేగిన విషయం తెలిసిందే. గుజరాత్, బిహార్‌లల్లో నీట్ పరీక్ష పేపర్లను అమ్ముకున్నారంటూ వార్తలు రావడం, పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, 1,563 మంది విద్యార్థులకు అదనంగా గ్రేస్ మార్కులు కలవడం వంటి వివాదాలు నీట్ పరీక్షలను చుట్టుముట్టాయి.

అప్పట్లో ఆ పరిస్థితుల మధ్య కేంద్ర ప్రభుత్వం నీట్- పీజీ పరీక్షలను వాయిదా వేసింది. ఆగస్టు 11వ తేదీన రెండు షిఫ్టుల్లో ఈ పరీక్షలను నిర్వహించనున్నట్లు వెల్లడించింది. దీనికోసం అభ్యర్థులు సన్నద్ధమౌతోన్నారు. అంతకుముందు జాయింట్ సీఎస్ఐఆర్- యూజీసీ- ఎన్ఈటీ పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి.
అదే సమయంలో సెంట్రల్ యూనివర్శిటీల్లో అండర్ గ్రాడ్యుయేషన్ అడ్మిషన్ల కోసం నిర్వహించిన పరీక్షలు కూడా దీనివల్ల ప్రభావితం అయ్యాయి. సుమారు 1,000 మందికి పైగా అభ్యర్థులు ఈ వాయిదాల గందరగోళానికి గురయ్యారు. రీటెస్ట్ నిర్వహించాలంటూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి విజ్ఞప్తి చేశారు.
వారి అభ్యర్థన మేరకు ఈ నెల 19వ తేదీన రీటెస్ట్ నిర్వహించనున్నట్లు ఎన్టీఏ తెలిపింది. కంప్యూటర్ బేస్ట్ టెస్ట్ ఫార్మాట్‌లో ఇవి జరుగనున్నాయి. ఈ నెల 22వ తేదీన ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. కిందటి నెల 30, జులై 7, 9 తేదీల మధ్య సాయంత్రం 5:00 గంటల వరకు [email protected]కు ఫిర్యాదు చేసిన వారికి ఈ పరీక్షలను రాసే అవకాశాన్ని కల్పించింది ఎన్టీఏ.
సెంట్రల్ యూనివర్శిటీ అండర్ గ్రాడ్యుయేట్ రెగ్యులర్ పరీక్షలు ఈ ఏడాది మే 15, 16, 17, 18, 21, 22, 24, 29 తేదీల్లో జరిగిన విషయం తెలిసిందే. 379 నగరాల్లో ఎన్టీఏ వీటిని నిర్వహించింది. 13 లక్షలమందికి పైగా విద్యార్థులు ఈ పరీక్షలను రాశారు. ఆ తరువాత ఎన్టీఏలో చోటు చేసుకున్న గందరగోళ పరిస్థితుల వల్ల 1,000 మందిపైగా ఈ పరీక్షలను రాయలేకపోయారు. వారి కోసం ఈ రీటెస్ట్ నిర్వహించనుంది.












Click it and Unblock the Notifications