School Fees: సోషల్ మీడియాలో స్కూల్ ఫీజుల దుమారం.. బెంగళూరు డాక్టర్ పోస్ట్ చూసి నెటిజన్ల షాక్
Bangalore Schools: గతంలో తల్లిదండ్రులు బిడ్డలను చిన్న వయసులోనే ఏదైనా పనికి పంపించాలని భావించేవారు. కానీ వారు మాత్రం చదువుకోవడానికి ఆసక్తి చూపించేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది. అదే చదువును కొనడానికి పిల్లల తల్లిదండ్రులు ఎంతో కష్టపడుతున్నారు. అప్పట్లో ఉన్నత చదువుల కోసం పెద్దమొత్తంలో వెచ్చించాల్సి వచ్చేది. ఇప్పుడైతే నర్సరీ ఫీజు వింటే హార్ట్ అటాక్ రావడం ఖాయంగా కనిపిస్తోంది.
2024-25 ఏడాదిలో నర్సరీ ప్రవేశానికి గాను ఓ స్కూల్ వసూలు చేస్తున్న ఫీజు సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు వైరల్‌గా మారింది. బెంగళూరుకు చెందిన ఓ డాక్టర్ Xలో షేర్ చేసిన పోస్టుపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. విద్యావ్యవస్థలో పాతుకుపోయిన వ్యాపార దృక్పథం స్పష్టంగా కనిపిస్తోందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ENT సర్జన్ మరియు స్టాండ్-అప్ కమెడియన్ అయిన డాక్టర్ జగదీష్ చతుర్వేది ఓ స్కూల్‌కు చెందిన ఫీజు స్ట్రక్చర్ స్క్రీన్‌షాట్‌ను Xలో షేర్ చేశారు. పేరెంట్ ఓరియంటేషన్ ఫీజు 8 వేల 400గా ఉండటంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. డాక్టర్ కన్సల్టేషన్ కోసం ఇందులో 20 శాతం చెల్లించేందుకు కూడా ఏ తల్లిదండ్రులూ అంగీకరించరని అభిప్రాయపడ్డారు. హాస్పిటల్ మూసేసి స్కూల్ ప్రారంభించాలనుకుంటున్నట్లు హాస్యాస్పదంగా స్పందించారు.
8400 INR parent orientation fee!!!
— Jagdish Chaturvedi (@DrJagdishChatur) October 22, 2024
No parent will ever agree to pay even 20% of this for a Doctors consultation..
I am planning to open a school now 😁 pic.twitter.com/IWuy3udFYU
నర్సరీ మరియు జూనియర్ KG కోసం ఆ స్థాయిలో పేరెంట్ ఓరియంటేషన్ ఫీజు వసూలు చేయడంపై సోషల్ మీడియా యూజర్లు ఒక్కసారిగా భగ్గుమన్నారు. 55 వేల 600 అడ్మిషన్ ఫీజుతో పాటు కాషన్ మనీగా మరో 30 వేలకు పైగా తీసుకుంటున్నా ఇంకా సరిపోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అడ్మిషన్ సమయంలోనే దాదాపు 1.52 లక్షలు చెల్లించాలని చెప్పడం చూసి నోరెళ్లబెడుతున్నారు.
ఈ నేపథ్యలో తమకు స్కూళ్లలో ఎదురైన చేదు అనుభవాలను పలువురు తల్లిదండ్రులు పంచుకున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి తన కొడుకు ప్లేస్కూల్ ఫీజు కోసం 4.3 లక్షలు చెల్లించినట్లు వెల్లడించాడు. అక్కడ బాగా ఆడటం నేర్చుకుంటాడని ఆశిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ఎంతైనా చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నారు అందుకే స్కూళ్లు దోచుకుంటున్నాయని మరొకరు వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications