అశ్లీల చిత్రాల వల్లే రేప్‌లు: హోంమంత్రి, ఇంటికి ఒకర్నీ..
ముంబై: బాధ్యత గల పదవిలో ఉండి బాధ్యతా రహితమైన వ్యాఖ్యలు చేసిన వారి జాబితాలో మరో మంత్రి చేరారు. మహారాష్ట్ర హోంమంత్రి ఆర్ఆర్ పాటిల్ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇంటికో పోలీసును పెట్టినా అత్యాచారాలు ఆపలేమని ఆయన వ్యాఖ్యానించారు.
టెలివిజన్ ఛానళ్లలో వచ్చే ప్రకటనల్లో కూడా మితిమీరిన అశ్లీలత ఉంటోందని ఆయన అన్నారు. మహిళల అశ్లీల చిత్రాల వల్లే అత్యాచారాలు పెరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఆర్ఆర్ పాటిల్ వ్యాఖ్యలపై ప్రతిపక్ష నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పాటిల్ ఒక అసమర్థుడని, చట్టాన్ని అతడు విజయవంతంగా అమలు చేయలేడని భారతీయ జనతా పార్టీ నాయకుడు వినోద్ తావ్డే ఆరోపించారు.

హోంమంత్రి పదవిలో కొనసాగుతూ మహిళలపై జరుగుతున్న దారుణాలపై బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం సిగ్గుచేటని మరో బిజెపి నేత షైనా మండిపడ్డారు. మంత్రివర్గం నుంచి ఆర్ఆర్ పాటిల్‌ను ముఖ్యమంత్రి వెంటనే తొలగించాలని న్యాయవాది అభాసింగ్ డిమాండ్ చేశారు. హోంమంత్రిగా ఒక్క క్షణం కూడా కొనసాగే అర్హత అతనికి లేదని అన్నారు.
కాగా, మధ్యప్రదేశ్ హోంమంత్రి బాబులాల్ గౌర్, ఛత్తీస్‌గఢ్ హోంమంత్రి కూడా ఇలాంటి బాధ్యత రహితమైన వ్యాఖ్యలు చేసిన వారి జాబితాలో ఉన్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కొందరు మంత్రులు, సమాజ్‌వాది పార్టీ ముఖ్య నాయకులు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేసినవారిలో ఉన్నారు.












Click it and Unblock the Notifications