50 మంది ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికీ రూ. 50 కోట్లు: బీజేపీపై సిద్దరామయ్య సంచలనం
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య భారతీయ జనతా పార్టీ (BJP)పై సంచలన ఆరోపణలు చేశారు. తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు 50 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ. 50 కోట్ల చొప్పున ఇవ్వజూపిందని సిద్దరామయ్య (Siddaramaiah) ఆరోపించారు. అయితే, ఇందుకు ఏ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కూడా అంగీకరించలేదని, అందుకే ఇప్పుడు బీజేపీ తమపై తప్పుడు కేసులు పెడుతోందని అన్నారు.
'సిద్ధరామయ్య ప్రభుత్వాన్ని ఎలాగైనా పడగొట్టాలని, వారు (బీజేపీ) 50 మంది ఎమ్మెల్యేలకు రూ.50 కోట్లు ఆఫర్ చేశారు. వారికి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? మాజీ ముఖ్యమంత్రులు బీఎస్ యడియూరప్ప, బసవరాజ్ బొమ్మై , ప్రతిపక్ష నేత ఆర్.అశోక, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర డబ్బులు ముద్రించారా?' అని సీఎం సిద్దరామయ్య ప్రశ్నించారు.

మైసూరు జిల్లాలోని టి నరసిపుర అసెంబ్లీ నియోజకవర్గంలో రూ.470 కోట్ల విలువైన ప్రజాపనులను ప్రారంభించిన అనంతరం సిద్ధరామయ్య ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి చెందిన నేతలంతా రూ. కోట్లు సంపాదించారని, ఆ నగదును ఎమ్మెల్యేలకు ఎరగా వేశారని ఆరోపించారు. అయినప్పటికీ తమ ఎమ్మెల్యేలు ఎవరూ తలొగ్గకపోవడంతో ఎలాగైనా తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రయత్నాలు చేశారని సిద్దరామయ్య వ్యాఖ్యానించారు.
మరోవైపు, కర్ణాటక రాష్ట్రంలోని మూడు నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ధీమా వ్యక్తం చేశారు. ఉప ఎన్నికల్లో పార్టీ విజయంపై వందశాతం నమ్మకం ఉందన్నారు. కాగా, బువారం చన్నపట్న, శిగ్గవ్, సండూర్ స్థానాలకు పోలింగ్ జరిగింది. మరోవైపు, మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) కేసులో ఈడీ దర్యాప్తుకు సంబంధించి, చట్టబద్ధంగా జరిగే ఏ దర్యాప్తును ప్రభుత్వం వ్యతిరేకించదని సిద్ధరామయ్య అన్నారు.












Click it and Unblock the Notifications