ఓల్డ్ కాయిన్స్: ‘పాత రూపాయి కాయిన్‌కు రూ. 25 లక్షలు.. 5, 10 రూపాయల నాణేలు ఉన్నా మీరు లక్షాధికారే’ – ఇందులో నిజమెంత?

'పాత రూ.5, రూ .10 కాయిన్స్‌తో ఈజీగా లక్షలు సంపాదించొచ్చు', 'పాత రూపాయి నాణానికి కూడా లక్షల రూపాయలు ఇస్తారు' - ఇలాంటి కథనాలు మీ కంటపడే ఉంటాయి.
పాత కాయిన్స్‌కు నిజంగానే లక్షల రూపాయాలు ఇస్తారా? ఒకవేళ ఇస్తే ఎందుకిస్తారు? ఆ కాయిన్స్ మీ దగ్గరుంటే ఏం చేయొచ్చు? ఈ వ్యవహారంలో మోసాలు జరగొచ్చా.. ఇలాంటి ఎన్నో అనుమానాలు సహజంగా వస్తుంటాయి.
పాత నాణేలు, కరెన్సీ నోట్లను సేకరించడం కొంతమందికి హాబి. మరికొందరు జ్ఞాపకాల కోసం దాచుకుంటారు.
కొందరైతే ఈ పాత నాణేలను దేశం నలుమూలల నుంచి సేకరిస్తారు. దీనికి ఎంత ఖర్చైనా కూడా వెనుకాడరు. వీటితో అప్పుడప్పుడు ప్రదర్శనలు కూడా నిర్వహిస్తుంటారు.
అయితే ప్రస్తుతం వీటికి డిమాండ్ పెరడగంతో కొందరు తమ దగ్గరున్న నాణేలను అమ్మేందుకు ఈ-కామర్స్ వెబ్‌సైట్లను ఆశ్రయిస్తున్నారు.

ఆన్‌లైన్‌లో క్రయ విక్రయాలు
పాత కాయిన్ల క్రయ విక్రయాలన్నీ ఎక్కువశాతం ఆన్‌లైన్ వేదికగా జరుగుతున్నాయి.
ఇందులో అమ్మేవారు నాణేలకు ఒక ధర నిర్ణయిస్తే, కొనే వారు తమ కొనుగోలు ధరను చెబుతారు. ఇలాంటి వాళ్లు దేశవ్యాప్తంగా ఉంటారు.
వివిధ ట్రేడింగ్ కంపెనీలు, అసోసియేట్స్ పేరుతో అన్‌లైన్ సైట్లలో తమ ఆఫర్ ధరలను పెడుతున్నాయి. ఆ ధరలతో పాటు వారు ఎటువంటి నాణేలను, నోట్లను కోరుకుంటున్నారో కూడా స్పష్టంగా చెబుతున్నారు.
అయితే ఇదంతా కూడా అందరికీ అందుబాటులో ఉండదు. ఎవరైతే ఆయా వెబ్‌సైట్లలో రిజిస్టర్ అవుతారో వారు మాత్రమే ఈ వివరాలను చూడగలరు.
- 2 వేల సంవత్సరాల పురాతన అస్థిపంజరం.. మర్డర్ మిస్టరీలా ఉందంటున్న శాస్త్రవేత్తలు
- విజయనగర సామ్రాజ్యం శిథిలమైనా... డిజిటల్‌గా సజీవం

థర్డ్ పార్టీకి బాధ్యత ఉండదు...
ఇండియామార్ట్, క్వికర్, ఎర్న్ మనీ, కాయిన్ బజార్ వంటి ఈ-కామర్స్ సైట్లలో ఈ వ్యాపారం జోరుగా సాగుతుంది. దీని మీద ఆసక్తి ఉన్నవారు ముందుగా ఆయా వెబ్‌సైట్‌లలో అకౌంట్‌ను ఓపెన్ చేయాలి.
తర్వాత ఎవరికి వారే ఓల్డ్ కాయిన్స్ , కరెన్సీ నోట్లు అమ్ముతామనో, కొంటామనో లేదా రెండు చేస్తామనో వివరాలను తెలియపరుస్తూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత వారి వద్ద ఉన్న నాణేలను లేదా నోట్ల వివరాలను, కోరుకుంటున్న విలువను తెలియజేస్తూ వివరాలను అప్‌లోడ్ చేయాలి.
ఇవన్నీ ఒక ఐడీ పేరుతో కనిపిస్తుంటాయి. ఆసక్తి ఉన్న వారు ఈ ఐడీతో సంప్రదింపులు జరుపుతారు. ఇదంతా వారిద్దరి మధ్యే ఉంటుంది.
- మహిళల్లో సున్తీ: 'నాకు చేశారు.. నా కూతుళ్లకు చేయనివ్వను’
- అలెగ్జాండర్: 20 ఏళ్ల వయసులో సింహాసనం ఎక్కడం నుంచి అంతుచిక్కని మరణం వరకు..

మోసాలు ఉంటాయి
ఈ వ్యాపారానికి వేదికగా నిలుస్తున్న ఈ-కామర్స్ వెబ్‌సైట్లు కేవలం థర్డ్ పార్టీగానే వ్యవహరిస్తాయి. అమ్మకం, కొనుగోలు అంశాలతో వాటికి సంబంధం ఉండదు.
ఈ వ్యాపారంలో జరిగే లావాదేవీలకు, మోసాలకు కూడా వారు బాధ్యత వహించరు. ఈ విషయాన్ని ఆ వెబ్‌సైట్ల నియమ నిబంధనల్లో స్పష్టం చేస్తారు.
ఈ వ్యాపారం పేరుతో మోసం చేసే వారు కూడా చాలా మందే ఉన్నారు. అలాగే మోసపోయిన వారు కూడా ఉన్నారు. ఈ పురాతన నాణేల అమ్మకం, కొనుగోళ్లు కూడా బయ్యర్, సెల్లర్‌ల వ్యక్తిగత విషయమని ఆ వెబ్‌సైట్లు పేర్కొంటున్నాయి.
- హెరాక్లియాన్: సముద్రగర్భంలో కలిసిన ఈజిఫ్టు ప్రాచీన నగరం కథ
- అమెరికా, నెదర్లాండ్స్‌లో రాముని కరెన్సీ: ఈ వార్తల్లో నిజమెంత, రాముని కరెన్సీ చరిత్ర ఏమిటి

వందేళ్లు దాటిందా...రూ. 25 లక్షలు
ఈ రోజుల్లో ఒక రూపాయికి ఏమోస్తాయంటే రెండు అర్ధ రూపాయిలు వస్తాయి అనేది జోక్. కానీ ఒక రూపాయికి 10లక్షల నుంచి 25 లక్షలు వస్తాయంటున్నారు ఓల్డ్ కాయిన్స్ ట్రేడర్స్.
అయితే, 25 లక్షలు పొందాలంటే ఆ నాణెం కొన్ని 'అర్హత పరీక్షలు' పాస్ కావాల్సి ఉంటుంది. అది సాధారణ నాణెం కాకూడదు. పురాతన నాణెమై ఉండాలి. ఏవైనా అరుదైన సంఘటనలు జరిగిన సంవత్సరానికి సంబంధించినదైనా అవ్వాలి.
ఇదంతా వేలం పద్దతిలో జరుగుతుంది.

నిర్ధిష్టమైన వివరాలతో కూడిన నోట్లు, నాణేలు ఉన్నాయా అంటూ సోషల్ మీడియాలో పోస్టులు తిరుగుతూ ఉంటాయి. వాటిని చూసిన వారు, వారి వద్ద నాణేలు, నోట్లు ఉంటే వెబ్‌సైట్లలో అప్‌లోడ్ చేస్తారు.
ఇలా అప్‌లోడ్ చేసిన విశాఖపట్నానికి చెందిన మల్లేష్ బీబీసీతో మాట్లాడారు.
"మా ఇంట్లో పాత రెండు రూపాయల కాయిన్ ఉంటే నేను కూడా ఒక వెబ్‌సైట్లో పెట్టాను. అది నిజంగా ఎవరైనా కొంటారో, కొనరో తెలియదు కానీ, ఇప్పటి వరకైతే నన్నెవరూ సంప్రదించలేదు"
బహుశా నేను పెట్టిన రెండు రూపాయల కాయిన్ బయ్యర్లకు కావాల్సిన స్పెసిఫికేషన్లలో లేదేమో. గతంలో కూడా పాత రేడియోకు 10లక్షలు అంటే అప్పుడు కూడా ప్రయత్నం చేశాను. వాటికి, వీటికి ఖర్చులంటే నా డబ్బులే కొంత మధ్యవర్తులకు ఇచ్చాను. అయితే ఈ సారి నేను డైరెక్టుగా వెబ్‌సైట్‌లో పెట్టాను" అని మల్లేష్ బీబీసీకి చెప్పారు.
- పెద్ద నోట్ల రద్దు: ఆర్థిక రంగాన్ని దెబ్బతీసిన మోదీ జూదం
- నోట్ల రద్దు: భారీ కుంభకోణం... ఆ 15 మంది కోసం మోదీ చేసిన కుట్ర - రాహుల్ గాంధీ

రూపాయిపై 12345 ఉండాలి
ఒక వెబ్‌సైట్‌లో 1913లో తయారైన ఒక రూపాయి నాణెం విలువ రూ.25 లక్షలుగా చూపించింది.
అయితే ఇది వెండితో తయారు చేసి, ఈ నాణెంపై విక్టోరియా రాణి బొమ్మ ముద్రితమై ఉండాలి అని కండిషన్ పెట్టారు.
దీనిని విక్టోరియా కేటగిరీగా పిలుస్తారు.
అలాగే మరో వెబ్‌సైట్‌లో 18వ శతాబ్దపు నాణెం ధర రూ. 10 లక్షలు ఉంది. ఇది 1818 సంవత్సరం ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన నాణెం. ఇది రాగితో తయారు చేసి ఉండాలి. అలాగే దీనిపై హనుమంతుడి చిత్రం కూడా ఉండాలి.
పాత రూపాయి, రూ. 10, రూ. 100లతో పాటు ఇతర పాత నోట్లకు మంచి డిమాండ్ ఉంది.
ప్రస్తుతం పాత రూపాయి నోటు విలువ రూ. 45వేలు. పాత రూ.100 నోటు దానిని క్వికర్‌లో రూ.50 వేలకు అమ్మకానికి పెట్టారు.
1947 అంటే ఇండియాకి స్వాతంత్ర్యం వచ్చిన ఏడాది నాటి రూపాయి నాణేనికి రూ. 10లక్షలకు అమ్ముతున్నట్లు ఈ వెబ్‌సైట్‌లో ప్రకటన ఉంది.

పాత కాయిన్స్, నోట్లకు సంబంధించిన అమ్మకాలు, కొనుగోళ్లు ఇప్పుడు జోరుగా సాగుతోంది.
ఫలానా సంవత్సంలో పని చేసిన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంతకం ఉన్న, లేదా ఏదైనా సంవత్సరంలో ఫలానా సీరిస్ నోట్లు కావాలంటూ వెబ్‌సైట్లలో ప్రకటనలు ఉంటున్నాయి.
1957 నాటి రూపాయి నోటు విలువ రూ.45 వేలుగా చెప్పారు. అయితే దానిపై సిరీస్ 12345గా ఉండాలని కండిషన్ పెట్టారు.
అలాగే ఆర్బీఐ గవర్నర్‌గా పనిచేసిన ఎస్.కె. వెంకటరమణ సంతకం ఉన్న పాత రూ.500 నోటు ఏకంగా రూ.1.55 లక్షలు పలుకుతోంది. ఈ నోటుపై 1616 సిరీస్ ఉండాలి.
ఇంతే కాకుండా ప్రత్యేక సంవత్సరాలు అంటే...ఇండిపెండెన్స్, రిపబ్లిక్ డే ఈయర్స్, మహాత్మాగాంధీ, ఐన్‌స్టీన్ పుట్టిన సంవత్సరాలు ఇలా ప్రత్యేకమైన సందర్భానికి చెందిన నాణెలు, నోట్లు అన్నీ కూడా అమ్మకానికి పెడుతున్నారు.

కొందరికి అభిరుచి...మరి కొందరికి వ్యాపారం...
నాణేల సేకరణ వేల సంవత్సరాల నుంచి జరుగుతోంది. పురాతన నాణేలను, వస్తువులను, చిత్రపటాలను సేకరించేవారు అనేక మంది ఉన్నారు. ముఖ్యంగా అభిరుచితో పాటు ఆర్థిక స్థిరత్వం ఎక్కువగా ఉన్నవాళ్లు ఈ పనులు చేసేవారు.
అప్పట్లో అది ఒక అభిరుచిగా, తమ హోదాకి చిహ్నంగా భావించేవారు. అయితే ఇప్పుడది వ్యాపారంగా మారింది.
ఈ పరిణామం గురించి ఏయూ ఆర్కియాలజీ విభాగం ప్రొఫెసర్ ఎన్. జాన్ బాబు బీబీసీకి వివరించారు.

"ఇదంతా ఒక రకమైన గొప్పతనాన్ని చూపించుకునే ప్రక్రియ. డబ్బులున్నవారు తమ దగ్గర అపురూపమైన వస్తువులు ఉన్నాయని చెప్పుకోవాలని తాపత్రయపడుతుంటారు. అలాగే గొప్ప గొప్ప వ్యక్తులు వాడిన వాచీలు, చేతికర్రలు, ఉంగరాలు, అలాగే ఫలానా కాలంనాటి సమాజంలో ఉపయోగించిన వస్తువులు ఇలా అనేక రకాలుగా సేకరించడం చేస్తారు"
ఇదంతా కనిపించని విలువతో చేసే గారడీ అని జాన్ బాబు అభివర్ణించారు.
''పురాతన వస్తువుల వలన చరిత్ర తెలుసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇలా వ్యాపారం చేయడం వలన ఆ వస్తువులకు విలువ పెరగదు. డబ్బులు ఎక్కువగా ఉన్నవారు వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపితే, ఆ ఆసక్తినే తమకు వ్యాపార అవకాశంగా మార్చుకుంటారు కొందరు" అని ప్రొఫెసర్ ఎన్. జాన్ బాబు చెప్పారు.

రూపాయికి 'లక్ష ఇచ్చి...పది వేలు' కొట్టేస్తారు
ప్రజల్లో ఉన్న ఆశని వాడుకుని మోసం చేసేందుకు అనేక మార్గాలను ఎంచుకుంటున్నారు నేరగాళ్లు. గతంలో ఇరీడియం లోహంతో తయారు చేసే విగ్రహాలతో, రైస్ పుల్లింగ్ యంత్రాల పేరుతో ప్రజలను మోసం చేసేవారు. ఇప్పుడు అది కాస్త తగ్గింది.
ఇప్పుడు ఖరీదైన ఖనిజం, పాత నాణేలు, నోట్లు ఇలాంటి మోసాల ట్రెండ్ నడుస్తోంది. సోషల్ మీడియా కారణంగా, ఇటువంటి వాటికి ప్రచారం విపరీతంగా జరుగుతోంది.
ఈ మోసాల నుంచి తప్పించుకోవడానికి వాటికి దూరంగా ఉండటం తప్ప మరో మార్గం లేదని లాజిక్ షోర్ ఐటీ ప్రైవేట్ కన్సల్టింగ్ లిమిటెడ్ ఎండీ రామకృష్ణ బీబీసీతో చెప్పారు.
"పాత నాణేలకు డిమాండ్ అనేది చాలా ఏళ్లుగా ఉంది. అయితే వాటికో ప్రత్యేకత ఉండాలి. అటువంటి వాటిని ఒక చోట చేర్చేందుకు కొన్ని ఈ-కామర్స్ వెబ్‌సైట్లు తమ వేదికల్లో వీటికి ఒక విభాగాన్ని కేటాయించాయి. అయితే ఈ నాణేలు, నోట్ల వ్యాపారానికి అవి బాధ్యత వహించవు. వీటిలో మోసపోయిన వారు ఎవరైనా ఆయా వెబ్‌సైట్లపై కేసులు పెట్టేందుకు ప్రయత్నించినా అవి నిలవవు" అన్నారాయన.
ఈజీ మనీ కోసం ఆశపడి ట్రాప్‌లో చిక్కుకోవద్దని రామకృష్ణ హెచ్చరించారు.

అప్రమత్తంగా లేకపోతే మోసపోతారు- పోలీసులు
ప్రజల్లో అప్రమత్తత రానిదే ఈ మోసాలు ఆగవని విశాఖ సైబర్ క్రైమ్స్ పీఎస్ ఇన్స్‌స్పెక్టర్ ఆర్వీఆర్కే చౌదరి చెప్పారు.
"ఈ నాణేలు, నోట్లు లావాదేవీల పేరుతో మోసం చేసేవారు ఉన్నారు. మీ నాణేన్ని మేం కొంటాం. దానికి లక్ష రూపాయల ధర ఇస్తాం. అయితే మనీ ట్రాన్స్‌ఫర్ ఛార్జీల కోసం మాకు 10వేలు పంపండి అని అడుగుతారు. లక్ష వస్తుంటే పదివేలదేముంది అని పంపుతారు. ఆ తర్వాత ఆ ఫోన్ పని చేయదు" అని ఆయన వివరించారు.
ఇటువంటి మోసాలు మధ్యప్రదేశ్, కర్నాటక రాష్ట్రాల్లో ఎక్కువగా నమోదయ్యాయి. కర్నాటకలో 1947లో ముద్రించిన ఓ రూపాయి కాయిన్‌ను అమ్మే క్రమంలో బెంగుళూరుకు చెందిన ఓ మహిళ సైబర్ నేరగాళ్ల వలలో పడింది.
పాత కాయిన్‌కు రూ. 20లక్షల వరకు ఇస్తామని మహిళకు చెప్పి, టాక్స్ అండ్ ట్రాన్స్‌ఫర్ ఛార్జీల కోసం రూ.లక్ష పంపాలని అడిగారు. అది నిజమే అనుకుని లక్ష రూపాయలు పంపి మోసపోయిన ఆ మహిళ ఆ తర్వాత సైబర్ పోలీసులను ఆశ్రయించారని చౌదరి వివరించారు.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ ఆత్మహత్యలు ఎందుకు పెరుగుతున్నాయి... వీటిని ఆపేదెలా?
- కరోనా సేవకుడే కరోనాతో మృతి... వందల మృతదేహాలకు అంత్యక్రియలు చేసిన బృందంలో విషాదం
- చైనాలో అతి సంపన్నులపై పెరిగిపోతున్న అసహనం... సంపద ప్రదర్శనపై చిర్రెత్తిపోతున్న జనం
- లైంగిక దోపిడీ: 'అయినవారే, ఘోరాలకు పాల్పడుతుంటే అన్నీ మౌనంగా భరించే చిన్నారులు ఎందరో' - అభిప్రాయం
- కోవిడ్ వ్యాక్సీన్ పేటెంట్ వివాదం ఏంటి... ఈ హక్కులు తొలగిస్తే టీకా అందరికీ అందుతుందా?
- మ్యూకోర్మైకోసిస్: భారత్‌లో కోవిడ్ రోగుల అవయవాలు దెబ్బతీస్తున్న 'బ్లాక్ ఫంగస్'
- భారత్‌లో కోవిడ్ సంక్షోభం మోదీ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసిందా?
- కరోనావైరస్ సెకండ్ వేవ్ భారత్‌లో బలహీన పడుతోందా... కేసులు నిజంగానే తగ్గుతున్నాయా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
-
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన -
వచ్చే మూడు నెలలు హై అలర్ట్, ఏపీలో ఎండల ముప్పు











Click it and Unblock the Notifications